Advertisements

క్వారీలు, మైనింగ్‌లో వాటా ఇవ్వాల్సిందే
బల్లికురువ, మల్లాయపాలెం, కొణిదెనకొండపై కన్ను
దళితులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్న వైసీపీ బీ టీమ్?
అక్షారాలా 600 కోట్ల మైనింగ్‌పై నజర్
బిజెపి నేత పేరుతో హల్‌చల్
వైసీపీ-బీజేపీ నేతల జాయింట్ వెంచర్
సొమ్ము వ్యాపారులది, సోకు వైసీపీ నేతది
అప్పుడు టిడిపి.. ఇప్పుడు వైసీపీ
నాడు సత్తెనపల్లిలో ‘కే’ టాక్స్.. నేడు అద్దంకిలో ‘బి’ టాక్స్
ప్రకాశం జిల్లా అద్దంకిలో ఇదో దందారాజ్

 

‘సత్తెనపల్లి, నర్సరావుపేటలో ‘కె’ టాక్స్ పేరిట వసూళ్లు చేస్తున్నారు. కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం కోడెల ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. దీనితో ప్రజలు ఇళ్లు కట్టుకోవాలన్నా హడలిపోతున్నారు. వ్యాపారులు వ్యాపారం చేసుకోలేకపోతున్నారు. ప్రతి దానిలోనూ వాటాలడుగుతున్నారు. ఈ ‘కె’ టాక్స్ పోవాలంటే జగనన్న రాజ్యం రావాలి’ ఇది గత ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచీ జగన్ సహా, వైసీపీ నేతలు చేసిన ఆరోపణలు. గత ఎన్నికల్లో వైసీపీ నేతలు దానినో ప్రధానాంశంగా మార్చారు. అదెప్పుడంటే.. టిడిపి అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత! కానీ, ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే ‘బి’ టాక్స్ పేరుతో యువనేత చేస్తున్న వసూళ్లు.. జగన్ సర్కారును అభాసుపాలు చేస్తున్నాయి. దీనిపై వైసీపీ రెడ్డి వర్గీయుల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కమ్మ సామాజికవర్గ నేతృత్వంలో, ఇతర కులాలను తెరపైకి తెచ్చి తెలివిగా చేయిస్తున్న ఈ దందా ఇప్పుడు సీఎంఓకు చేరింది.
ఎన్నికల నష్టాన్ని పూడ్చుకునేందుకు మైనింగ్, క్వారీలన్నీ సదరు వైసీపీ యువ నేతనే చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. అంతకుముందు ఆయా క్వారీల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి, ఇప్పటికే పనులు చేసుకుంటున్న వారిని పిలిచి బెదిరించడం, లొంగకపోతే అధికారులతో దాడులు చేయించడం, ఉన్న పొలాన్ని తక్కువ ధరకు ఇచ్చేయాలంటున్నారు. ఇదీ అక్కడి సీన్! బల్లికురువ, మల్లాయపాలెం, కొణిదెనకొండలపై ఉన్న క్వారీలపై కన్నేసిన ‘బి’ టాక్స్ బ్యాచ్ వాటిని స్వాధీనం చేసుకోవాలనే తొందరలో ఉంది. వీటిలో ఒక క్వారీని దసరా పండుగ రోజు ప్రారంభించి, తవ్వకాలు మొదలెట్టేసింది. బెజవాడకు చెందిన ఓ వ్యాపారి అద్దంకిలోని క్వారీ, మైనింగ్ కోసం కోట్లాదిరూపాయలు ఖర్చు చే స్తున్నట్లు .సమాచారం.
అంతేనా? గతంలో టిడిపి ప్రజాప్రతినిధి ఒకరు సొంతం చేసుకోవాలన్న దళితులు నివసించే ప్రాంతంపై ఇప్పుడు ‘బి’ ట్యాక్స్ బ్యాచ్ న్నుపడింది. అవన్నీ దళితుల భూములు.అంతకుముందు మాజీ వైసీపీ ప్రజాప్రతినిధి, తాజా టిడిపి ప్రజాప్రతినిధి వేరేచోట దళితుల కోసం ఇళ్లు నిర్మించి, వారిని పంపించిన తర్వాత అక్కడ మైనింగ్ చేసుకోవాలని భావించారు. కానీ దళితులు కొన్ని కారణాల వల్ల అక్కడికి వెళ్లలేదు. ఇప్పుడు వైసీపీ ‘బీ’టాక్స్ యువ దళపతి ఆ భూమిపై కన్నేశారట. దాదాపు 80 శాతం మంది దళితులను బెదిరించి, వారికి మరొకచోట మూడు ఎకరాల్లో డికె పట్టాలిచ్చి, ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే కొంతమందికి ఇచ్చేశారట. కానీ భూమివ్వడానికిష్టపడని వారిని బెదిరిస్తున్నారు.
ఇంతకూ మైనింగ్ ఉన్న ఆ భూమిలో తవ్వితే వచ్చే మైనింగ్ విలువెంతో తెలుసా? అక్షరాలా 600 కోట్ల రూపాయలు మాత్రమే. అయితే మరి అందులో ‘బి’ టాక్స్ యువ దళపతి పెట్టే పెట్టుబడి ఎంతో తెలుసా? సున్నా! పెట్టుబడి అంతా ఇతరులది. ప్రభుత్వపరంగా వచ్చే ఇబ్బందులను పరిష్కరించి, అందులో వచ్చే లాభాలు తీసుకోవడమే ‘బి’ టాక్స్ యువ అధిపతి బాధ్యతట! ఈ వ్యవహారంలో బెడవాడ, అద్దంకి, గుంటూరుకు చెందిన పెట్టుబడిదారులు సభ్యులట. వారిలో రెడ్డి సామాజికవర్గానికి చె ందిన ఓ వ్యాపారి గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం 5,6 కోట్లు పెట్టుబడి పెట్టారట. ఇంకొకాయన బెజవాడలో ఉంటూ అద్దంకిలో ఉన్న అన్ని క్వారీల్లో కొంత పెట్టుబడి పెడుతున్నారట. జగన్ ప్రభుత్వంలో కమ్మ నేతలకు పనులు జరగడం లేదన్న ముందు జాగ్రత్తతో, ‘బి’ టాక్సు యువదళపతి తెలివిగా.. రెడ్డి, బీసీ వ్యాపారస్తులను తెరపైకి తెచ్చి, తెర వెనక మైనింగ్ కొల్లగొట్టే పనిలో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతంలో టిడిపితో గ్రామస్థాయి పదవులతో లబ్ధిపొంది, సాక్షాత్తూ వైసీపీ అధికార మీడియా ‘సాక్షి’పై విజయవాడ నగర జాయింట్ కమిషనర్‌కు గత ఎన్నికల ముందు ఫిర్యాదు చేసిన వారితో కలసి, ‘బి’ టాక్స్ యువ దళపతి ఈ వ్యవహారం నడిపించడం మరో విచిత్రం.అద్దంకి నియోజకవర్గంలో కీలకమైన ఓ దేవాలయ చైర్మన్ పదవి కోసం ఓ వైశ్య ప్రముఖుడి వద్ద బి టాక్సు బృంద ప్రముఖుడొకరు ఇప్పటికే 5 లక్షల అడ్వాన్సు కూడా తీసేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఓ వైపు అవినీతిరహిత ప్రభుత్వం కోసం జగన్ కష్టపడుతూ, గత సర్కారు మాదిరిగా చెడ్డపేరు రాకూడదని జాగ్రత్తపడుతుంటే.. అద్దంకిలో మాత్రం ‘బి’ టాక్స్ పేరుతో వసూళ్లపర్వానికి, మైనింగ్ స్వాధీనాలకు తెరలేపడం చర్చనీయాంశమయింది. దీనిపై తొలి నుంచీ పార్టీ కోసం కష్టపడుతున్న వైసీపీ రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అద్దంకిలో జరుగుతున్న వ్యవహారాలను మంత్రి బాలినేని, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఎంపి విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారట. కాగా.. తాజాగా ఈ ‘బి’ టాక్సు వ్యవహారం సీఎంపేషీ అధికారుల వరకూ వెళ్లడంతో మైనింగ్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
అద్దంకిలో ఖరీదైన క్వారీ, మైనింగ్‌పై కన్నేసిన వ్యాపారులు పొలిటికల్ కార్డులు వాడుతుండటం మరో విశేషం. బెజవాడకు చెందిన ఓ వ్యాపారి.. తనకు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని, పలువురు కేంద్రమంత్రులు బాగా తెలుసంటూ వారితో ఎయిపోర్టు, హోటళ్లలో తీయించుకున్న ఫొటోలు చూపి, సొంత మార్కెటింగ్ చేసుకుని, బిజెపి పేరు వాడుకోవడం మరో విశేషం. బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ అనుమతి, సిఫార్సు లేకుండా ఢిల్లీ, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు ఎంపీల లేఖలతో, అమిత్‌షా కార్యదర్శి సిఫార్సుతోనే తనకు సెన్సార్‌బోర్డులో పదవి వచ్చిందని ప్రచారం చేసుకుని, దానితో పార్టీ పేరు అడ్డుపెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటున్న ‘భీమవరం తెలివి’ బట్టబయలయింది. ప్రకాశం జిల్లా టిడిపికి చెందిన ఓ మాజీ మంత్రి సోదరుడికి దేశంలో ఎక్కడనుంచైనా బిజెపి నుంచి రాజ్యసభ సీటు ఇప్పిస్తానని చెప్పి, అద్దంకి ప్రాంతంలో ఉన్న ఆయన క్వారీని లీజుకు తీసుకున్న ‘గోదావరి జిల్లా తెలివితేటలు’ ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఇక దళితులను అక్కడి నుంచి బలవంతంగా ఖాళీ చేయించి, వారికి మూడెకరాల సర్కారీ స్థలమిచ్చి, తద్వారా 600 కోట్ల రూపాయల విలువైన మైనింగ్‌ను సొంతం చేసుకునేందుకు ‘బి’ ట్యాక్స్ యువదళం చేస్తున్న ప్రయత్నాలు, దానిపై దళితుల్లో పెల్లుబికుతున్న ప్రతిఘటన, స్థానిక రాజకీయ పార్టీ నేతల మౌనం వెనక పరమార్ధం వంటి చిదంబరహస్యంపై పూర్తి వార్తా కథనం మీ ‘సూర్య’ వెబ్‌సైట్‌లో.. త్వరలో చూడండి.