Advertisements

* నోటికొచ్చినట్లు మాట్లాడే ప్రజా ప్రతినిధులు ఏనాడైనా రాజ్యాంగ చర్చల గురించి చదివారా?
* మిగిలిన కులాలు మాట తప్పుతాయా జగన్ రెడ్డి
* న్యాయవాదులకు అండగా ఉంటాం
* తిరుపతి న్యాయవాదులతో చర్చలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్
జైలుకు వెళ్లిన జగన్ రెడ్డే మంకు పట్టుతో ముఖ్యమంత్రి అయినప్పుడు.. భావితరాల భవిష్యత్తు కోసం రాజకీయాల్లోకి వచ్చిన నాకు ఎంత మొండితనం ఉండాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జగన్ రెడ్డి, ఆయన ఎమ్మెల్యేల మాదిరి తనకు ఆస్తుల మీద మమకారం, ప్రాణం మీద తీపి లేదన్నారు. దేశం మీద ప్రేమ, సమాజం పట్ల గౌరవంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. మంగళవారం మధ్యాహ్నం తిరుపతి, చిత్తూరు న్యాయవాదులతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారో వారికే తెలియడం లేదు. నోరిప్పితే అమ్మా, ఆలి అని మాట్లాడుతున్నారు. రాజ్యాంగం రూపొందించడానికి జరిగిన చర్చలు చదివితే వీళ్లు ఇలా మాట్లాడరు. తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటు లేస్తారని సామెత ఉంది. మంత్రుల స్థాయి వ్యక్తులే దిగజారి మాట్లాడితే.. రోడ్ల మీద తిరిగే వారు అఘాయిత్యాలు ఎందుకు చేయరు..?. మన నాయకులే అలా ఉన్నారు.. మనం మానభంగాలు చేసిన ఫర్వాలేదని చేస్తారు.  మంత్రులు, ప్రజాప్రతినిధులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే సమాజం ఇలానే తయారవుతుంది. సమాజం కూడా ఎంత దిగజారిపోయింది అంటే ఒక మహిళ పై అత్యాచారం జరిగితే ఆడబిడ్డపై ఆఘాయిత్యం చేశారు అని రాయకుండా దళిత మహిళపై అత్యాచారం, అగ్రవర్ణ మహిళపై అత్యాచారం అంటూ ట్యాగులు పెట్టడం బాధ కలిగించింది. దిశా అనే బిడ్డను మద్యం మత్తులో నలుగురు పశువులు చంపేస్తే మనం కులం చూస్తామా..?
జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించను
 జగన్ రెడ్డి అనే పిలుస్తాను. ఆయన్ని ముఖ్యమంత్రిగా గుర్తించను. మానవత్వమే నా మతం అని చెప్పుకొన్న ఆయన, జనసైనికుల బత్తాయి చెట్లు ఎందుకు నరికించేశారో సమాధానం చెప్పాలి.ఇచ్చిన మాట తప్పకపోవడమే నా కులం అంటున్నారు జగన్ రెడ్డి. అంటే మిగిలిన కులాలు మాట తప్పుతాయి అంటారా? ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీకి, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ భయపడి సమాధానం చెబుతుంది అంటే మన వైపు ధర్మం ఉందని అర్ధం.ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్ముతాను. దీనర్ధం ఏంటంటే “ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది” అని. రాయలసీమ పర్యటనకు వస్తున్నాను అంటే కొందరు వద్దన్నారు. ఆ ప్రాంతాన్ని కొన్ని గ్రూపులు కబ్జా చేశాయి.. అక్కడికి ఎవరిని రానివ్వరూ అన్నారు. నేను వాళ్లకు ఒకటే చెప్పాను. వాళ్లు కూడా మనలాగే సామాన్యమైన మనుషులే. వాళ్లను కత్తితో పొడిచినా మనలాగే నెత్తురు వస్తుంది. వాళ్లను ఎదిరించడానికి తల ఎగిరిపడినా ఫర్వాలేదనే గుండె ధైర్యం ఉంటే చాలు. మహాత్మ గాంధీని రైలు నుంచి బ్రిటిష్ వాడు దించేశారని ఆత్మగౌరవం దెబ్బ తిని.. వాళ్లను దేశం నుంచే గెంటేశాడు. ఇవాళ మనల్ని చూసి నవ్వినవాడు రెండున్నర దశాబ్ధాల తర్వాత మన గురించి మర్యాదగా మాట్లాడతాడు. అయితే మీరు నా నుంచి అద్భుతాలు ఆశించవద్దు. కిందపడ్డ, మీదపడ్డ మళ్లీ నిలబడతాడని నమ్మండి చాలు. ఈ ఆరు నెలల్లో వైసీపీ ప్రభుత్వం పాలన చూస్తే  ప్రజలకు కనీసం ఉల్లిపాయలను కూడా పంపిణీ చేయలేని దుస్థితిలో ఉంది.
* బోస్, భగత్ సింగ్ ల స్ఫూర్తి ఎప్పటికీ నిలిచే ఉంటుంది
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం నా వరకు చాలా కష్టం. ఎవరినైనా నమ్మి బాధ్యత అప్పగిస్తే వాళ్లు మిగతా వారిని కలుపుకొని వెళ్లలేకపోతున్నారు. దానిని చూసే నిస్సహాయత  అవహించింది. 100 మందిని కూర్చొబెట్టి మాట్లాడితే 10 గ్రూపులుగా ఏర్పడుతున్నారు.  జనసేన పార్టీ ఒక దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన సామాన్యుడు పెట్టిన పార్టీ. ఏడు దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ కాదు. పార్టీ వెనుక వేలకోట్లు పెట్టే సమూహాలు లేవు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను తట్టుకోలేక పార్టీ పెట్టాను.  సామాన్యుడి ఏడుపే నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది.  నాకు గెలుపోటములకు పెద్దగా తేడా తెలియదు. మనస్సాక్షిని  భగవంతుడిగా నమ్ముతాను. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోష్ వంటి వారికి ఏ పదవులు ఉన్నాయని మనం నమస్కరిస్తాం. డాక్టర్ అంబేద్కర్ గారు ఎన్నికల్లో ఓడిపోతే ఆయన విలువ తగ్గిందా..?. లాయర్ల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది. వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి పార్టీ లీగల్ వింగ్ బలోపేతంపై చర్చిస్తామ”ని హామీ ఇచ్చారు.
రాజ్యాంగేతర శక్తులు రాజ్యమేలుతున్నాయి:నాదెండ్ల మనోహర్
పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. “లాయర్లు సమాజానికి ఎంత అవసరం అనేది స్వాతంత్య పోరాట సమయం నుంచి మనం చూస్తూనే ఉన్నాం, దురదృష్టవశాత్తు ఈ రోజు కొందరు అవకాశవాదులు రాజకీయాల్లో దూరిపోయి సామాన్యులకు, లాయర్లకు స్థానం లేకుండా చేసారు.   గతంలో ఎం.ఎల్ ఎ.లు, ఎం.పి.లుగా లాయర్లకు అవకాశం వచ్చేది. ఎందుకంటే మీరు పోరాడగలుగుతారు. ఆ స్థాయి మీలో ఉంది. సమస్య పరిష్కారం కోసం నిలబడగలుగుతారు. ఒక  ఎం.ఎల్.ఎ. లేదా ఒక ఎం.పి. ఏ విధంగా వ్యవహరించాలి… ప్రజల కోసం అయన చేసిన ప్రమాణాలు ఏమిటి అన్న విషయాలను మర్చిపోయి ల్యాండ్ సెటిల్మెంట్ల  కోసమే పని చేయడం శోచనీయం.  ఈ ప్రభుత్వ పాలనలో అమాయకులపై అనవసరంగా కేసులు పెడుతున్నారు. ఒక పోలీస్ స్టేషన్ కాదు అని ఇంకో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తున్నారు. జిల్లా జిల్లాలకు మార్చి మరీ కేసులు పెడుతున్నారు. ఎందుకంటే తగిన సమయంలో వారికి న్యాయ సహాయం దొరకకూడదు అనే. రాజ్యాంగేతర శక్తులు సమాజంలో పెరిగిపోయి లాయర్లకు ఇవ్వాల్సిన స్థానాన్ని పక్కన పెట్టి సెటిల్మెంట్ల ద్వారా అధికార యంత్రాగమును దుర్వినియోగం చేస్తున్నారు.  ఈ పరిస్థితుల్లో న్యాయాన్ని, ధర్మాన్ని పాటించి ఏ నిర్ణయమైనా తీసుకుందామనే పవన్ కళ్యాణ్ అభినందనీయులు.ఉపన్యాసాలకో, ఆర్టికల్స్ కో,  అంబేద్కర్ జయంతి రోజున తలచుకోడానికో రాజ్యాంగాన్ని పరిమితం చేసి దానిని పాటించని నేతలున్న రోజులివి. అయితే రాజ్యాంగ నిర్మాణ సమయంలో దేశ వ్యాప్తంగా ఒక్కొక్క ఆర్టికల్ పై మూడు సంవత్సరాలపాటు జరిగిన చర్చలు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడల్లా ప్రస్తావనకు వస్తుంటాయి. కొత్త తరం వీటిని మర్చిపోకుండా ప్రజలలో చైతన్యం నింపాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రవ్యాప్తంగా యువత కోసం రాజ్యాంగంపై అవగాహనా సదస్సులు ఏర్పాటు చెయ్యాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్ మదిలో ఉంది.  జిల్లాల వారిగా పార్టీ కమిటీల ఏర్పాటు అనంతరం లీగల్ సెల్ ఆవిర్భావం జరుగుతుంది. లాయర్లు అందరు పార్టీ బలోపేతానికి పాటుపడాల”ని  కోరారు.