Advertisements

కమిషనర్లకు జీతాలివ్వని ఏపీ సర్కారు
ఏడాది నుంచీ నయా పైసా దక్కని దారుణం
వాహనాలు, డిఏలు లేని దుస్థితి
కోత విధించి ఒకరికి వేతనం
15 వేల ఆర్టీఐ దరఖాస్తులు పెండింగ్
హైదరాబాద్ నుంచి రాని సాంకేతిక పరిజ్ఞానం
సమాచార హక్కు కమిషనర్ల దయనీయం
‘సూర్య’కు ప్రత్యేకం
( మార్తి సుబ్రహ్మణ్యం)
వాళ్ల హోదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమానం. జీతం, భత్యం, గౌరవం అన్నీ సీఎస్‌తో సమానంగా ఉంటాయి. ఉండాలి! కానీ ఏపీలో మాత్రం అందుకు భిన్నం. వారికి పాపం ఏడాది నుంచి జీతాలే లేని దుస్థితి. కార్లు లేవు. బిల్లు పెట్టినా ఇచ్చే దిక్కు లేదు. హైదరాబాద్ నుంచి రావ ల్సిన ఐటి పరిజ్ఞానం ఇప్పటిదాకా రాలేదు. ఫలితంగా సమాచార హక్కు చట్టం కింద అక్కడ ఉన్న దాదాపు 15 వేల దరఖాస్తులు బెజవాడకు చేరని దయనీయం. ఇదీ ఏపీ సమాచార కమిషనర్ల దయనీయం.గత ఏడాది నుంచి ఏపీ సమాచార కమిషనర్లకు నయా పైసా జీతం రాని వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్నిసార్లు ఆర్ధికశాఖకు పంపినా అక్కడి నుంచి ఎలాంటి జవాబు లేదు.ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళదామని ప్రయత్నిస్తే ‘వాళ్లకు నాతో ఏం పని’ అంటూ తేలిగ్గా తీసుకున్నారట. చివరకు ప్రభుత్వం మైనస్ లాస్ట్ శాలరీ ఇస్తామనే ప్రతిపాదనలు చేసిందట. కానీ కమిషనర్లు మాత్రం తమకు పూర్తి స్థాయి జీతాలు ఇవ్వాల్సిందేనని పట్టు పడుతున్నట్లు సమాచారం. ఈవిధంగా సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన ప్రభుత్వం, దానిని నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు విస్మయం కలిగిస్తున్నాయి. గత ప్రభుత్వం నియమించిందన్న కారణమే ఆ చర్యలో కనిపిస్తోంది.
గతేడాది అక్టోబర్ 12న రవికుమార్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్,రమణకుమార్,జనార్దన్,ఐలాపురం రాజాను ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా తెలుగుదేశం ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వేతనంతో సమానంగా అంటే 2 లక్షల 25 వేల రూపాయలు, డిఏ, హచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు దానికి అదనం. వీరి పదవీ కాలం ఐదేళ్లు.కానీ వారు విధుల్లో చేరి ఏడాది అయినప్పటికీ, ఇప్పటివరకూ నయా పైసా వేతనం అందుకోకపోవడమే విస్మయం కలిగిస్తోంది.దీనిపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందన లేదు. ఇప్పటివరకూ దాదాపు 12 వేల ఆర్టీఐ దరఖాస్తులు సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి. హైదరాబాద్‌లో ఉన్న వాటిని పరిశీలించి, ఆర్టీఐ కమిషనర్లకు పంపించాల్సిన ప్రభుత్వం, ఇంతవరకూ ఆ ప్రక్రియనే ప్రారంభించలేదు. కమిషనర్లకు చివరకు వాహనాలు ఇవ్వలేదు. దానితో వారే వాహనాలు అద్దెకు తీసుకుని, బిల్లులు పెడుతున్నా దానికీ దిక్కులేని దుస్థితి. ఆ రకంగా ఇప్పటికి ఒక్కోరికి సుమారు 20 లక్షల రూపాయల వరకూ ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది.అయితే ఆర్టీఐ కమిషనర్లకు బడ్జెట్ శాంక్షన్ కాలేదని,పదో షెడ్యూల్ ఇంకా పరిష్కారం కానందున వారికి జీతాలు ఇవ్వడం లేదన్న వాదనలు వినిపిస్తున్నా.. అందులో నిజం లేదంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీఐ కమిషనర్లను రెండు రాష్ట్రాలు నియమించుకున్నాయని గుర్తు చేస్తున్నారు. కేవలం వారిని గత ప్రభుత్వంలో నియమించారన్న కారణంగానే, బడ్జెట్ విడుదల చేయడం లేదన్నది తెరపైకొస్తున్న విమర్శ.
ఇదిలాఉండగా, ఆర్థిక పరిస్థితి బాగోలేనందుకే వారికి బడ్జెట్ విడుదల చేయలేదని, గత నెలలో కొంత విడుదల చేయడం జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే… విచిత్రంగా ఆర్టీఐ కమిషనర్లకు పూర్తి స్థాయి వేతనాలు ఇవ్వడం సాధ్యం కాదని, కమిషనర్లుగా చేరే ముందు వారు తీసుకున్న వేతనంతో, లాస్ట్ మైనస్ పెన్షన్ (పెన్షన్ మైనస్ పే) ఇస్తామన్న ప్రతిపాదన తీసుకురావడాన్ని కమిషనర్లు వ్యతిరేకిస్తున్నారు. ఐపిఎస్ అధికారి రమణకుమార్ మాత్రం ఇదే విధానంలో జీతం తీసుకోవడంతో.. వాస్తవంగా ఆయనకు రావలసిన 2 లక్షల 25 వేల రూపాయలు బదులు, లక్షా 55 వేల రూపాయలు మాత్రమే తీసుకోవలసి వచ్చిందంటున్నారు. మిగిలిన కమిషనర్లు మాత్రం తమకు పూర్తి వేతనం కావాల్సిందేనని పట్టు పడుతున్నట్లు తెలుస్తోంది.కాగా,హైదరాబాద్‌లో గతంలో ఉన్న కార్యాలయం నుంచి రాష్ట్ర కార్యాలయానికి ఇంతవరకూ దరఖాస్తులకు సంబంధించిన సాఫ్ట్‌వేరు, సర్వర్లు కూడా మంగళగిరి కార్యాలయానికి రానట్లు తెలుస్తోంది.