Advertisements

మోడీతో పోరుకు జగన్ రె‘ఢీ’

బిజెపి నుంచి వైసీపీలోకి తెచ్చే వ్యూహం
దగ్గుబాటిపై అదే ఒత్తిడి వ్యూహం
ఇటీవలే వైసీపీలో చేరిన జూపూడి, ఆకుల
వలసపై వైఖరి మార్చుకున్న జగన్
బిజెపిని చూసి  జగన్ భయపడుతున్నా

ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత ప్రభావిత నేతల్లో ఒకరయిన సోనియాగాంధీనే ఎదిరించిన యువనేత జగన్..ఏపీలో ఒక్కసీటు కూడా  లేని బిజెపిని చూసి భయపడుతున్నారా? ఆ పార్టీ రాష్ట్రంలో తన చాపకింద నీళ్లు తెస్తుందని ఆందోళనతో ఉన్నారా? టిడిపి, జనసేన నేతల  చేరికతో కిటకిటలాడుతున్న బిజెపిలోకి, మరికొందరు జంప్ చేయకుండా జగన్ అడ్డుచక్రం వేసే వ్యూహంలో ఉన్నారా? అందుకే వద్దనుకున్న వలస రథానికి తానే పచ్చజెండా ఊపుతున్నారా? ఆ వ్యూహంలో భాగంగానే బిజెపి అగ్రనేత, కేంద్ర  మాజీ మంత్రి పురంధీశ్వరిని వైసీపీలోకి తీసుకురావాలని ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై ఒత్తిడి తెచ్చారా? అంటే జగన్.. ప్రధాని మోదీతో ఢీకొనేందుకు సిద్ధమవుతున్నారా? ఇదీ తాజా రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ.ఎన్నికల ముందు బిజెపితో తెరచాటు స్నేహం చేసిన వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీతో, రాజకీయ యుద్ధానికి సిద్ధపడుతున్నట్లు ఆయన వేస్తున్న అడుగులు స్పష్టం చేస్తున్నాయి. పోలవరం పిపిఏలను సమీక్షించవద్దని, కాంట్రాక్టరును మార్చవద్దని కేంద్రం చెప్పినా ఖాతరు చేయని జగన్, తాను అనుకున్నట్లే చేసి.. తన స్వతంత్ర వైఖరిని కేంద్రానికి స్పష్టం చేశారు. 

తాజాగా బిజెపి అగ్రనేత, కేంద్ర మాజీ మంత్రి పురంధ్వీరిని వైసీపీకి లోకి తీసుకురావాలని, భార్యాభర్తలు చెరో పార్టీలో ఉండటం సరైనది కాదని ఆయన భర్త, వైసీపీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఖరాఖండీగా స్పష్టం చేయడంతో.. జగన్, బిజెపితో రాజకీయ సంగ్రామానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.పురంధీశ్వరి వంటి అగ్రనేత విషయంలోనే జగన్ ఖరాఖండిగా వ్యహరిస్తున్నారంటే, రాష్ట్రంలో భవిష్యత్తు రాజకీయాలు, బిజెపి అనుసరించబోయే ఎత్తుగ డపై  జగన్ ఎంత అప్రమత్తంగా ఉన్నారో స్పష్టమవుతోంది. నిజానికి పురంధీశ్వరి మాస్ లీడర్ కాదు. జనంలో పెద్దగా బలం ఉన్న నాయకురాలూ కాదు. కానీ జగన్ ఈ విషయంలో అంత గ ట్టిగా పట్టుబడుతున్నారంటే, ఆయన దూరదృష్టి ఏమిటో అర్ధమవుతోందంటున్నారు.  రానున్న కాలంలో తనకు టిడిపి కాకుండా, బిజెపినే ప్రధాన రాజకీయ శత్రువయ్యే ప్రమాదం ఉన్నట్లు జగన్ పసిగడుతున్నట్లు ఆయన ధోరణి స్పష్టం చేస్తోంది. 

గత ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మారుతున్న రాజకీయ వాతావరణం, క్రమేపీ బిజెపికి అనుకూలంగా పయనిస్తోందన్న విషయాన్ని  జగన్ గ్రహిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన చాలామంది అభ్యర్ధులు ఆర్ధి ంగా దెబ్బతిన్నారు. వారికి ఎన్నికల చివరి సమయంలో అందాల్సిన డబ్బు రాకపోవడం, దానితో అప్పులు చేయాల్సి రావడం, దానికి సంబంధించిన హామీపై నాయకత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడం, అటు స్థానికంగా వైసీపీ నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో.. చాలామంది టిడిపి నేతలు బిజెపిలోకి క్యూలు కడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన కాపు అభ్యర్ధులు, గత నెలలో కాకినాడలో నిర్వహించిన సమావేశ ఆంతర్యం ఇదేనన్న విషయం జగన్‌కు చేరింది. అందులో పాల్గొన్న ఇద్దరు కాపు నేతలు ఇటీవలే జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం గమనార్హం. 

వారిలో చాలామంది నేతలు తొలుత బిజెపితో మంతనాలు సాగించారు. కొందరు ముహుర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న జగన్ హటాత్తుగా వ్యూహం మార్చారు.  స్థానికంగా వారికి ఉన్న మైనింగ్, క్వారీ, ఇతర వ్యాపారాలను చూపి భయపెట్టిన వైసీపీ నాయకత్వం.. కొందరు నేతలను తన పార్టీలో చేర్చుకుంది. ఇక అక్కడి నుంచి నియోజకవర్గాలను ప్రభావితం చేసే నేతలు,  బిజెపిలోకి వెళ్లకుండా అడ్డుకోవడంలో జగన్ విజయం సాధిస్తున్నారు.నిజానికి, చాలామంది టిడిపి ఎమ్మెల్యేలు తన పార్టీలోకి రాకపోతే, బిజెపిలోకి వెళ్లాలని భావిస్తున్న విషయాన్ని జగన్ గ్రహించారు. బిజెపి కూడా టిడిపిని నిర్వీర్యం చేసి, ఆ స్థానాన్ని తాను భర్తీ చేయాలన్న వ్యూహంతో వెళుతున్నట్లు జగన్‌కు తెలుసు. అందుకే జాతీయ పార్టీల ఎత్తుగడను ఇప్పటికే, కాంగ్రెస్ ద్వారా అనుభవించిన జగన్.. తన రాష్ట్రంలో బిజెపికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. 

ఆ వ్యూహంలో భాగంగానే.. ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే, వెంటనే వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను బహిరంగంగానే కోరారు. దీనితో వైసీపీలో చేరి రాజకీయ రక్షణ పొందాలని భావించిన కొందరు టిడిపి ఎమ్మెల్యేలు, అది సాధ్యం కాకపోవడంతో  బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే వారంతా  అనర్హతకు భయపడి వెనక్కి తగ్గారన్న ప్రచారం అప్పుడే వినిపించింది. ఇది బిజెపికి ఆగ్రహం కలిగించింది.  జగన్ అనర్హత వేటు హెచ్చరిక చేయపోతే, ఈపాటికి చాలామంది టిడిపి ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేవారని అటు జగన్‌పై కమలం కస్సుబుస్సులాడుతోంది. ఇటీవలే జూపూడి ప్రభాకర్, ఆకుల సత్యనారాయణను వైసీపీలో చేర్చుకోవడం చాలామందిని విస్మయపరిచింది. నిజానికి టిడిపి నుంచి కొందరు ఎమ్మెల్యేలు తన పార్టీలోకి వస్తానన్న సంకేతాలు పంపినా, జగన్ దానిపై ఆసక్తి చూపలేదు. తనకే 151 మంది ఎమ్మెల్యేలు ఉండటం, మరికొందరు ఓడిపోవడం, టికెట్ల సమయంలో చాలామందికి పదవుల హామీ ఇవ్వడం వంటి కారణాలే దానికి కారణం. వారికే సర్దుబాటు చేయలేని పరిస్థితిలో, మళ్లీ కొత్తగా వచ్చే టిడిపి ఎమ్మెల్యేలను  భరించడం కష్టమన్న ముందుచూపుతోనే జగన్ ఈ వైఖరి ప్రదర్శించినట్లు వైసీపీ వర్గాలు ఆనాడే విశ్లేషించాయి. 

నిజానికి తెలంగాణలో తెరాస మాదిరిగా, ఏపీలో వైకాపా బస్సు లెక్కలేనంతమంది వలస నేతలు, పాత నేతలతో మోయలేని భారంతో వెళుతోంది. పాత, కొత్త వారికి న్యాయం చేసే పరిస్థితిలో రెండు పార్టీలూ లేవు. ఈ పరిస్థితిలో జగన్ తాను విధించిన నిషేధాన్ని తానే తొలగించుకుని, ఇతర పార్టీల నుంచి నేతల వలసలకు రెడ్‌సిగ్నల్ ఇవ్వడం వైసీపీ వర్గాలనే విస్మయానికి గురిచేసింది.వలస నేతలు బిజెపిలో చేరే ప్రమాదం ఉన్నందున, దానిని అరికట్టేందుకే జగన్ ఈ వ్యూహం అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. రాబోయే కాలంలో తన రాజకీయ  ప్రత్యర్ధి బిజెపి ఒక్కటేనన్న అనుమానంతోనే, జగన్ ఆ పార్టీకి ఎదిగేందుకు అవకాశం ఇవ్వకుండా తొలి దశలోనే తొక్కివేసే ఎత్తుగడతో అడుగులు వేస్తున్నారన్న వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి.

కేవలం ఒక్క సీటు మాత్రమే ఉన్న రాష్ట్రంలోనే బిజెపి అధికారంలోకి వచ్చిందని, మెజారిటీ లేకపోయినా ఈశాన్య రాష్ర్టాల్లో బిజెపి ప్రభుత్వం వచ్చిన విషయాన్ని  జగన్ పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే,  బిజెపికి తన రాష్ట్రంలో ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్న పట్టుదలతో, చివరకు మోదీతో ఢీ కొనేందుకు సిద్ధమవుతున్నారన్న వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఏదేమైనా మోదీ-అమిత్‌షా వైపు కన్నెత్తి చూసేందుకు కాంగ్రెస్ వంటి పెద్ద పార్టీనే భయపడుతున్న నే పథ్యంలో, వారిని ఎదుర్కొందుకు జగన్ సిద్ధం కావడం సాహసం మాత్రమే కాకుండా, అద్భుతమేనంటున్నారు.

%d bloggers like this: