Advertisements

రాష్ట్రాలేమైనా ఇద్దరి సొంత ఆస్తులా?

అపెక్స్ కమిటీ వద్దన్న కేసీఆర్
జగన్‌తో చెప్పించే యత్నంపై విమర్శలు
అడకత్తెరలో జగన్
వద్దంటే మోదీకి, కావాలంటే కేసీఆర్‌కు కోపం
మరి ఇక బోర్డులు, కోర్టులెందుకో?
          (మార్తి సుబ్రహ్మణ్యం)

దేశానికి స్వాతంత్య్రం రాక పూర్వం పెద్ద మనుషులే పంచాయితీలు చెప్పేవారు. అంటే రాజులు, జమిందారుల స్థాయిలో అన్నమాట. రెండు రాజ్యాల మధ్య కూడా సయోధ్య ఆవిధంగానే కుదిరేది. కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చి, రాజ్యాంగమనేది ఒకటి రూపొందించుకున్న తర్వాత, కోర్టులనేవి ఒకటి వచ్చాయి. రాష్ట్రాల మధ్య జల వివాదాలు తలెత్తినప్పుడు ఆ తగవులను తీర్చడానికి వాటర్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ ప్రకారంగా అంతర్రాష్ట జల వివాదాలను కొన్ని దశాబ్దాల నుంచి ఆ బోర్డు పరిష్కరిస్తోంది.కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఓ దేశంగా భావిస్తున్న సీఎం కేసీఆర్ మాత్రం అలాంటి బోర్డులు, గీర్డులేమీ వద్దని.. మా పంచాయితీలు మేమే పరిష్కరించుకుంటామని ఏకంగా కేంద్రానికే స్పష్టం చేశారు.అది కేసీఆర్ వైఖరి వరకయితే ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ, తన దారిలోనే ఏపీ కూడా నడవాలని ఏపీ సీఎం జగన్‌పై ఒత్తిడి తీసుకువస్తున్న తీరే విమర్శలకు దారి తీస్తోంది. ఒకరకంగా ఈ వ్యవహారం జగన్‌కు ప్రాణసంకటంగా మారింది. అపెక్స్ కౌన్సిల్ అవసరం లేదంటే మోదీకి, కావాలంటే కేసీఆర్‌కూ కోపం రావచ్చు. ఆయనకు ప్రస్తుతానికి మోదీతో కంటే, కేసీఆర్‌తో అవసరాలే చాలా ఎక్కువ.

కృష్ణా-గోదావరి నదులపై రెండు రాష్ట్రాల మధ్య తలెత్తే సమస్యలపై కేంద్రం జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని, ఆ మేరకు అపెక్స్ కౌన్సిల్ అవసరం లేదన్న తన వాదనతో, ఏపీ సీఎం జగన్‌నూ ముగ్గులోకి దించేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు జగన్‌కూ ఇబ్బందికరంగా  పరిణమించాయి. అసలేం జరిగిందంటే.. కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ అధీనంలోని ఈ అపెక్స్ కౌన్సిల్ గతంలో చంద్రబాబు-కేసీఆర్ సమక్షంలో  తొలి భేటీ నిర్వహించింది. విభజన చట్టం ప్రకారం.. రెండు రాష్ట్రాల నడుమ తలెత్తే నీటి పంచాయితీని, ఈ శాఖనే పరిష్కరిస్తుంది. ఆ ప్రకారంగా మరోసారి భేటీ కానున్నందున మీ అజెండాలు పంపాలని కేంద్ర జల వనరుల శాఖ రెండు రాష్ట్రాల సీఎంలకు లేఖ రాసింది. 

ఆ మేరకు వెంటనే స్పందించిన కేసీఆర్.. తమకు మీ పెద్దరికం అవసరం లేదని, అసలు తమ మధ్య ఎలాంటి తగాదాలు లేనందున.. అజెండాలో చెప్పాల్సిన విషయాలేవీ లేవని కేంద్రానికి జవాబిచ్చారు.మరి దీనిపై జగన్ ఇంకా సమాధానం ఇచ్చినట్లు లేదు. దానిపై ఎలా వ్యవ హరించాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు. గతంలో కేసీఆర్‌తో జరిగిన ఒప్పందం మేరకు, మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటామంటే అది కేంద్రాన్ని ధిక్కరించినట్టవుతుంది. ఇప్పటికే కేసీఆర్‌పై దృష్టి సారించిన కేంద్రం.. ఆయనతో తాను చేస్తున్న దోస్తీనీ సీరియస్‌గా తీసుకుంటుంది. ఈ దశలో తమకు అపెక్స్ కౌన్సిల్ అవసరం లేదంటే అదొక ధిక్కారం మాత్రమే కాకుండా, కేసీఆర్-తానూ కలసి కేంద్రానికి వ్యతిరేకంగా గూడుపుఠాణీ చేస్తున్నామన్న బిజెపి అనుమానం నిజం చేసినట్టవుతుంది. ఒకవేళ ఇవ్వకపోతే.. అనేక అవసరాలున్న కేసీఆర్‌ను దూరం చేసుకున్నట్టవుతుంది.అదీ కాక.. ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం కాదు. రెండు రాష్ట్రాల సమస్య. కేసీఆర్-జగన్ ఇద్దరూ శాశ్వతంగా సీఎంలుగా ఉండరు. ఇప్పుడున్న వారి స్నేహం, రేపు వైరంగానూ మారవచ్చు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత మిత్రులూ ఉండరు. అప్పుడు రెండు రాష్ట్ర జల వివాదాలు ముదురుపాకాన పడవచ్చు.

మరి అప్పుడు వాటిని ఎవరు పరిష్కరిస్తారు?  దీనిపై జగన్ ఇచ్చే జవాబు ప్రతిపక్షాలకు లాభించవచ్చు. ఇప్పటికే రాష్ట్ర  ప్రయోజనాలను జగన్ కేసీఆర్‌కు తాకట్టు పెడుతున్నారని, ఏపీలో విపక్షాలు దుయ్యబడుతున్నాయి. మరి ఈ స్థితిలో జగన్ సర్కారు, కేంద్రానికి ఏం లేఖ రాస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.నిజానికి.. గతంలో పోలవరంపై తెలంగాణ సర్కారు ఇచ్చిన ఫిర్యాదును  ఇప్పటివరకూ వెనక్కి తీసుకోలేదు. కేసీఆర్-జగన్ రెండుసార్లు భేటీ అయినా, కేసీఆర్ సూచించిన వారికి జగన్ టిటిడిలో స్థానం కల్పించినా, హైదరాబాద్ సచివాలయ భవనాలు ఇచ్చేసినా..  తెలంగాణ సర్కారు తన వంతుగా ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకోకపోవడం కూడా, ఏపీ సర్కారును.. ప్రజల ముందు ముద్దాయిగా నిలిపింది. నిజంగా కేసీఆర్‌కు చర్చలపై అంత నమ్మకం ఉంటే, తాను చేసిన ఫిర్యాదును ఎందుకు వెనక్కి తీసుకోలేదన్న ఏపీ విపక్షాల ప్రశ్నలకు, జగన్ జవాబు చెప్పాల్సి ఉంటుంది. పోలవరం ముంపు గ్రామాలు, ఎత్తు అంశాలపై తెలంగాణ సర్కారు జగన్-కేసీఆర్ భేటీ తర్వాత కూడా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కమిటీ సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేయడం విస్మయం కలిగించింది.  దీన్నిబట్టి,   జగన్ అవసరం, అవగాహనారాహిత్యాన్ని అడ్డుపెట్టుకుని, కేసీఆర్ లబ్థిపొందుతున్నారన్న వ్యాఖ్యలు వివిధ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 

పైగా.. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేవు. దానికి అపెక్స్ కౌన్సిల్ అనుమతులూ లేవు. దానివల్ల ఏపీకి నష్టమన్న వాదన వినిపించాల్సిన జగన్ అనుసరిస్తోన్న మౌనం, విపక్షాలకు అస్త్రంగా మారనుంది.ఈ క్రమంలో కేసీఆర్‌తో దోస్తీ జగన్‌కు అటు రాజకీయంగా, ఇటు పాలనాపరంగా చిక్కులు తెస్తున్నాయి. అపెక్స్ కౌన్సిల్ అజెండాపై జగన్ సర్కారు ఇచ్చే జవాబుపై, అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. మరి దానిపై జగన్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి. 

%d bloggers like this: