– ఆ మాంత్రికుడు ఎవరికోసమో వచ్చారన్న సుబ్బారెడ్డి వ్యాఖ్యలు శుద్ధ అబద్ధం
– దేవుడి ప్రసాదాన్ని అందజేసి, శాలువాలు కప్పినంత మాత్రాన వీరి కేసుల్లో న్యాయమూర్తులు అనుకూలంగా వ్యవహరిస్తారని భావించడం పొరపాటు
– సుబ్బారెడ్డి పై కూడా ఒక కేసు లో అభియోగాలు ఉన్నాయి
– అయినా అదేమీ పట్టించుకోకుండా, ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల మీద పడిపోతుండడం వల్ల వారు ఇబ్బందిగా ఫీలవుతున్నారు
– మాంత్రికుడికి దైవత్వాన్ని అంట గడుతూ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం
– మాంత్రికుడు వచ్చిన ప్రత్యేక విమానం బెంగళూరుకు చెందిన విఆర్ఎన్ లాజిస్టిక్ అనే కంపెనీకి చెందినది కాదా?
– ప్రత్యేక హోదా, పోలవరం కోసం మరోసారి ఢిల్లీకి జగన్ మోహన్ రెడ్డి
– సొంత వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికి ప్రత్యేక హోదా, పోలవరం సాకు
– సుప్రీంకోర్టు మార్గదర్శకాలను హైకోర్టు పాటించాలి
– హైకోర్టు పాటించకపోతే సుప్రీంకోర్టుకు నివేదించాలి
– సీబీఐ అప్పీలుకు వెళ్ళకపోతే అనుమానించే అవకాశాలే ఎక్కువ
– నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
తనకు తానే దేవుడిని అనుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓ మాంత్రికుడి ఆశీస్సులు అవసరమా?, పూజ గదిలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటున్నారని, ఆయన ఫోటోకు హారతులు ఇస్తున్నారని సాక్షి దినపత్రికలో వార్తలకు కొదవలేదు . ప్రజల చేత దేవుడిగా పూజింపబడుతున్నట్లు చెప్పుకునే జగన్మోహన్ రెడ్డికి , ఓ మాంత్రికుడితో ఆశీస్సులు ఇప్పించడమంటే ఆయన్ని అవమానించినట్లు కాదా? అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామ కృష్ణంరాజు ప్రశ్నించారు.
తనని తాను దైవంగా భావించుకోవడమే కాకుండా, తానే దైవమని సొంత పత్రికలో రాయించుకోవడం సిగ్గుచేటు. ఈజిప్షన్ మహారాజుల మాదిరిగా తనకు తానే దైవం అని భావిస్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఒక మాంత్రికుడి ద్వారా ఆశీస్సులు ఇప్పిస్తారా? తప్పు కదా? అంటూ ఆయన ఎద్దేవా చేశారు. బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఒక మాంత్రికుడు ఆరు గంటలపాటు ఆశీస్సులు అందజేస్తారా?, అవి మంతనాలు కాకపోతే మరేమిటి అని నిలదీశారు.
ఆ మాంత్రికుడు ఎవరికోసమో వచ్చారన్న టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు శుద్ధ అబద్ధమన్నారు. సాక్షి దినపత్రికలో పారిశ్రామికవేత్త సివి రావు తో పాటు, ఆయన పెద్ద కుమారుడితో సదరు మాంత్రికుడు ఉన్న ఫైల్ ఫోటో వేసి తప్పుడు వార్తా కథనాన్ని ప్రచురించారని మండిపడ్డారు. మాంత్రికుడు వచ్చిన ప్రత్యేక విమానం బెంగళూరుకు చెందిన విఆర్ఎన్ లాజిస్టిక్ అనే కంపెనీకి చెందినది కాదా? అని ప్రశ్నించిన ఆయన, కోర్టు మేనేజ్మెంట్ కోసం రామోజీరావు వియ్యంకుడు మాంత్రికుడిని పిలిపించవచ్చు కదా? అన్న టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. రామోజీరావు రెండవ కుమారుడు, సివి రావు అల్లుడు ఆర్ వి ఆర్ కన్ స్ట్రక్షన్స్ అధినేత రఘు వియ్యంకుడు అయితే, రామోజీరావుకు సివి రావు వియ్యంకుడని చెప్పడం విడ్డూరంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తనకు సోదరుడేనని తమ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డి చెప్పినట్లుగానే ఉందని అపహాస్యం చేశారు.
ఏప్రిల్ లో విశాఖకు మకాం మారుస్తానన్న జగన్ ఇప్పుడు మాట మార్చారు…
ఏప్రిల్, మే మాసాలలో విశాఖపట్నం తన మకాం మారుస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు మాట మార్చి సెప్టెంబర్ లో విశాఖకు మకాం మారుస్తానని పేర్కొనడం విస్మయాన్ని కలిగించిందని రఘురామకృష్ణం రాజు అన్నారు. సుప్రీంకోర్టులో రాజధాని కేసు పై తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నారా?, రాజధాని అమరావతి అయినప్పటికీ మూటముల్లే సర్దుకొని విశాఖపట్నం మకాం మారుస్తారా? అన్నది ఆయన చెప్పడం లేదు. కోర్టులో రాజధాని కేసు పెండింగ్ లో ఉండగానే విశాఖకు మకాం మారుస్తానని ఎలా చెబుతారు?. కోర్టు తీర్పు ఏదైనాప్పటికీ, విశాఖపట్నం కు మకాం మారుస్తానని చెప్పండి. విశాఖకు మకాం మారిస్తే మార్చండి. అంతేకానీ ఇలా ప్రజలను భయపెట్టడం ఎందుకు? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.
ఇతర దేవాలయాల చైర్మన్లు అలాగే వెళ్తున్నారా?
సుప్రీం కోర్టు లో న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తి పదవీ ప్రమాణ స్వీకారం చేయగానే, ప్రత్యేక విమానం లో దేవాలయ పురోహితులను వెంటబెట్టుకొని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి వారి ముందు వాలిపోవడం ఆనవాయితీగా మారింది. దేశంలోని ఇతర దేవాలయాల చైర్మన్లు ఎవరైనా ఇలాగ వ్యవహరిస్తున్నారా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వారికి దేవుడి ప్రసాదాన్ని అందజేసి, శాలువాలు కప్పినంత మాత్రాన వీరి కేసుల్లో న్యాయమూర్తులు అనుకూలంగా వ్యవహరిస్తారని భావించడం పొరపాటు. 33 ఆర్థిక నేరాల కేసులలో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , పిన్ని భర్త అయిన సుబ్బారెడ్డి పై కూడా ఒక కేసు లో అభియోగాలు ఉన్నాయి. అయినా అదేమీ పట్టించుకోకుండా, ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల మీద పడిపోతుండడం వల్ల వారు ఇబ్బందిగా ఫీలవుతున్నారు. ప్రపంచ ప్రజలు పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కాదనలేక, వారు స్వీకరిస్తున్నరన్నారు. అంతేకానీ వీరు కప్పే శాలువాల కోసం కాదు. ముఖ్యమంత్రి పదవి కంటే ఉన్నతమైనది టీటీడీ సంస్థ చైర్మన్ పదవి. ఆ పదవిలో కొనసాగుతూ, అడ్డమైన వారికి దైవత్వాన్ని అంటగట్టడం సుబ్బారెడ్డి కి తగదు. టీటీడీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న సుబ్బారెడ్డి కి ఒక స్థాయి ఉన్నదని తాము భావిస్తున్నామని, ఆ స్థాయి ఆయనకు ఉన్నదో లేదో తేల్చుకోవాలన్నారు. ఒక మాంత్రికుడికి దైవత్వాన్ని అంట గడుతూ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. అతడికి దైవత్వమే ఉంటే, రాష్ట్రపతుల వెనుక, సుప్రీం కోర్ట్, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల వెనుక ఎందుకు నిలబడతారని ప్రశ్నించారు.
గత పాలకుల నిర్లక్ష్యం అంటే ఆయన తండ్రి కూడా నిర్లక్ష్యం చేశాడా?
గత పాలకుల నిర్లక్ష్యం వల్లే శ్రీకాకుళం అభివృద్ధి చెందకుండా, వెనుకబడిపోయిందంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని రఘురామకృష్ణం రాజు అన్నారు. గత పాలకులు అంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా శ్రీకాకుళం ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారా? అంటూ ప్రశ్నించారు. శ్రీకాకుళం ను మరో చెన్నై, ముంబై మాదిరిగా అభివృద్ధి చెందుతుందని జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. గత నాలుగేళ్లుగా ఎటువంటి అభివృద్ధిచేయకుండా, ఇప్పుడు చెన్నై, ముంబై మాదిరిగా అభివృద్ధి చేస్తానని చెప్పడం విడ్డూరం. భావనపాడు పోర్టు పేరు , మూలపాడు పోర్ట్ మార్చి శంకుస్థాపన చేశారు. ఈ పోర్టు కాంట్రాక్టు పనులు విశ్వసముద్ర అనే కంపెనీకి కట్టబెట్టారు. విశ్వసముద్ర అనే కంపెనీ ప్రత్యేక విమానంలో మాంత్రికుడిని తాడేపల్లి ప్యాలెస్ కి తీసుకు వచ్చిన చింతా శశిధర్ ది కాదా? అని ప్రశ్నించారు.
సలహాలు ఇచ్చేందుకు సలహాదారులను పెట్టుకున్న సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏ సలహా ఇవ్వగలరు?
సలహాలు ఇవ్వడానికే వందమంది సలహాదారులను నియమించుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఏమి సలహా ఇవ్వగలరని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఐఏఎస్ పాసైన విద్యాధికుడైన జవహర్ రెడ్డి తనకు జగన్మోహన్ రెడ్డి సలహాలు ఇస్తారని భావించడం విస్మయాన్ని కలిగించింది. తన తమ్ముడి కోసం, బాబాయి కోసం జగన్మోహన్ రెడ్డి తన లండన్ పర్యటన రద్దు చేసుకున్నారని ప్రజలంతా భావిస్తున్న తరుణంలో, ఢిల్లీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం ఉండడంతో, దానికి ముఖ్యమంత్రిని అందుబాటులో ఉండాలని జవహర్ రెడ్డి కోరడం వల్లే, తన కూతుళ్లను లండన్ వెళ్లి చూడాలనుకున్న కార్యక్రమాన్ని కూడా ఆయన రద్దు చేసుకున్నారట. ప్రత్యేక హోదా, పోలవరం కోసం ముఖ్యమంత్రి మరోసారి ఢిల్లీ పెద్దలను కలవనున్నట్లు తెలిసింది. తాను గత రెండు, మూడు రోజుల క్రితమే ప్రత్యేక హోదా, పోలవరం కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్దలను కలుస్తారని చెప్పాను.
వైయస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడిని తేలికగా తీసిపారేసిన సాక్షి దినపత్రిక, సాక్షి ఎండి బంధువులను మాత్రం మహానేత అన్నట్లుగా కీర్తించడం, తమ పార్టీ నాయకులంతా వారికి మద్దతు పలకడం విడ్డూరంగా ఉంది. పార్టీ నిర్ణయం ప్రకారం, క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా తాను కూడా వైయస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి మద్దతు తెలియజేశానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ప్రత్యేక హోదా, పోలవరం కోసం ముఖ్యమంత్రి ఢిల్లీ పెద్దలను కలిసేందుకు తమ పార్టీకి చెందిన ఎంపీలు ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కాస్ట్ ను టెక్నికల్ కమిటీ క్లియర్ చేసిందని , కేబినెట్ క్లియర్ చేయవలసి ఉందని, అవసరమైతే ముఖ్యమంత్రి ఢిల్లీకి రావలసిన అవసరం ఉంటుందని జవహర్ రెడ్డి చెప్పారట. మరి ముఖ్యమంత్రిని, జవహర్ రెడ్డి ఢిల్లీకి రమ్మంటారో, లేదో తెలియాల్సి ఉంది. ముఖ్యమంత్రి తన సొంత వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికి ప్రత్యేక హోదా, పోలవరం ను సాకుగా చూపెడుతున్నారన్నారు. ప్రతిసారి ప్రత్యేక హోదా, పోలవరం పనుల కోసమే ఢిల్లీ పెద్దలను కలిశానని చెబితే ప్రజలు అసహ్యించుకుంటున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
బ్యాంకులో డబ్బులు లేక బటన్ నొక్క లేదట
బ్యాంకులో డబ్బులు లేకపోవడం వల్లే ముఖ్యమంత్రి బటను నొక్క లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వివరణ ఇచ్చారని రఘు రామకృష్ణంరాజు తెలిపారు. ఏప్రిల్ మాసంలో బ్యాంకులో డబ్బులు లేకపోవడం అన్నది సహజమేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొనడం విస్మయాన్ని కలిగించింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే బ్యాంకులో డబ్బులు లేకపోవడం ఏమిటో అర్థం కాలేదు. ఆర్థిక సంవత్సరం చివరిలో బ్యాంకులో డబ్బులు లేవు అంటే అర్థం ఉంది. బ్యాంకులో డబ్బులు లేవు అన్న వ్యాఖ్యల ద్వారా, రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు గురించి ఒక సంకేతాన్ని ఇచ్చినట్లయిందన్నారు.
విచారణలో కోర్టులు జోక్యం చేసుకోవద్దని సుప్రీం మార్గదర్శకాలు
పోలీసు విచారణలో కోర్టులు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన పలు కీలక తీర్పులను చదివి వినిపించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ హైకోర్టు అతిక్రమించకూడదు. ఒకవేళ హైకోర్టు అతిక్రమిస్తే, ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వెళ్లాలి. న్యాయవ్యవస్థపై అత్యంత గౌరవం కలిగిన తాను, న్యాయ వ్యవస్థ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయడం లేదు. గతంలో, ఇటీవల తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఇచ్చిన తీర్పును మాత్రమే చదివి వినిపించాను. తన వ్యాఖ్యలను సాక్షి దినపత్రిక వక్రీకరించి రాసే అవకాశాలు లేక పోలేదు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టే పై, సిబిఐ, డాక్టర్ సునీత తరపు న్యాయవాదులు అప్పీల్ కు వెళితే, స్టే రద్దు అవుతుంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టే పై నిరుత్సాహపడకుండా సీబీఐ అప్పీల్ కు వెళ్లాలి. ఒకవేళ, సీబీఐ అప్పీలుకు వెళ్ళకపోతే అనుమానించే అవకాశాలే ఎక్కువ. గత పది రోజుల క్రితం బాగా చేస్తున్నారని, ఇందులో మనం ఇంటర్ఫియర్ కాకూడదు అని అద్భుతమైన ఆర్డర్ ఇచ్చిన న్యాయస్థానం, మంగళవారం నాడు ఇచ్చిన తీర్పు దానికి అనుగుణంగా లేదన్నది ప్రజల భావన. బెయిల్ మంజూరీ చేయడం అన్నది న్యాయమూర్తి విచక్షణాధికారం. దాన్ని ఎవ్వరూ ప్రశ్నించడానికి లేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు.