Suryaa.co.in

Andhra Pradesh

ప్రతిపక్షంగా 100 రోజుల వైసీపీ వైఫల్యాలు

– టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల

మంగళగిరి: అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జగన్ రెడ్డికి ప్రజల సంక్షేమం పట్టదు అన్న విషయం వంద రోజుల జగన్ వైఖరిని చూస్తే బట్టబయలైంది. ఈ వంద రోజుల్లో జగన్ ఆంధ్రప్రదేశ్‌లో కంటే బెంగళూరు ఎలహంక పాలెస్‌లోనే ఎక్కువ రోజులున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు గడవకముందే రాష్ట్రపతి పాలన డిమాండ్ చేశారంటే జగన్ ఎంత స్వార్థపరుడో అధికార దాహంతో ఉన్నారో అర్ధమవుతోంది. ఎన్నికల్లో ఘోర ఓటమి భరించలేక శాంతిభద్రతల సమస్యలు సృష్టించి అరాచక మూకలను రెచ్చగొట్టి చివరకు లా అండ్ ఆర్డర్ విఫలమైందని ఆరోపించడం గుడ్డకాల్చి ముఖాన వేయడమేనని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు.

శాసనసభ ప్రతిపక్ష నేత హోదా కావాలంటూ కోర్టుకు వెళ్ళడం వెనుక అంతర్యమేమిటి? ప్రతిపక్షనేత హోదా ఇస్తేనే సభకు హాజరవుతావా..? హోదా లేకపోతే సభకెళ్లవా..? అని వైసిపికి ఓట్లేసిన 39% జనమే నిలదీసే దుస్థితి నేడు జగన్ రెడ్డిది. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే జగన్ రెడ్డి తనకు, తన కుటుంబానికి 3 షిప్టులలో 900 మంది, బైటకెళ్తే 3 వేల మంది భద్రత కావాలని హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. జగన్ రెడ్డి సీఎంగా బుడమేరుకు రూ.300 కోట్లుతో ఆధునీకరణ పనులు చేయకపోవడం, బుడమేరును వైసీపీ నాయకులు కబ్జాలు చేయడం వల్ల వరద బీభత్సం బెజవాడను ముంచేసింది. కలెక్టరేట్‌నే సీఎంవో చేసి, బస్సులోనే బసచేసి, వరదనీటిలో నడుస్తూ, జేసీబీపై వెళ్లి నేనున్నాని బాధితులకు ధైర్యం కలిగిస్తే జగన్మోహన రెడ్డి మాత్రం ఒడ్డున ఉండి గడ్డలు వేయడంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.

ఐదేళ్ళ అవినీతి కుంభకోణాల గుట్టును 7 శ్వేతపత్రాలతో ఎన్డీఏ ప్రభుత్వం రట్టు చేసింది. మద్యంలో రూ 20 వేల కోట్లు దోపిడీ చేశారు. ఐదేళ్లలో దాదాపు 2 లక్షల ఎకరాల పేదల, ఆలయ, జమీందారీ, అసైన్డ్, 22ఏ, చుక్కల, నిషిద్ద జాబితాల భూములన్నీ స్వాహా చేశారు. ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, రాయలసీమలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ల్యాండ్ మాఫియా అరాచకాలన్నీ ప్రజలే ముందుకొచ్చి బైట పెడ్తున్నారు. ప్రతిరోజూ వందలాది బాధితులు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు వినతుల వెల్లువ.

పుష్కరం నిండకుండానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో కలిసేరోజు మరెంతో దూరంలో లేదు. తల్లి-చిన్నమ్మ, చెల్లెళ్లు, కుటుంబమే కాదు చివరికి పార్టీ కూడా ఛీకొట్టే దుస్థితికి జగన్ చేరారంటే స్వయంకృతాపరాధాలే.. చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవ అనేదందుకే..

LEAVE A RESPONSE