టీఆర్ఎస్ లో మరో 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం

– ప్రజలతో ఒత్తిడి చేయించుకుని రాజీనామా చేయబోతున్నారు
– త్వరలో మరిన్ని ఉప ఎన్నికలు రాబోతున్నాయి
– ఆర్టీసీని మళ్లీ ప్రైవేటుపరం చేసే కుట్ర
– ‘చీకోటి’ దందా వెనుక కేసీఆర్ కుటుంబ హస్తం
– అధికారంలోకి వస్తే నయీం కేసుపై ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేస్తాం
– నయీం బాధితులను ఆదుకుంటాం.. ఆస్తులను స్వాధీనం
– మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించబోతోంది
– ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 62 స్థానాలకుపైగా బీజేపీ కైవసం
– బీజేపీకి 40 నుండి 53 శాతం వరకు ఓట్లొస్తాయని సర్వే నివేదికలు చెబుతున్నాయి
– రాబోయే రోజుల్లో ఓట్లు, సీట్ల శాతం గణనీయంగా పెరగడం ఖాయం
– కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ పై మొదటి నుండి పోరాడుతున్నారు
– మోదీ పాలనను పలుమార్లు ప్రశంసించారు
– బీజేపీ సిద్ధాంతాలు, మోదీ నాయకత్వాన్ని నమ్మినవారిని పార్టీలో చేర్చుకుంటాం
– బీజేపీ అధికారంలోకి రాగానే జర్నలిస్టుల సంక్షేమంపై విధానపరమైన నిర్ణయం తీసుకుని అమలు చేస్తాం
– మీడియాతో ఇష్టాగోష్టిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నుండి 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కేసీఆర్ కుటుంబంపై అనేక ఆరోపణలు వస్తున్నాయని…ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఉండదనే నిర్ణయానికి ఆయా ఎమ్మెల్యేలు వచ్చారన్నారు. త్వరలోనే మునుగోడు తరహాలోనే తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు. అందులో భాగంగా తమ తమ నియోజకవర్గ ప్రజల చేత ఒత్తిడి చేయించుకుని ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయబోతున్నారని పేర్కొన్నారు.

చీకోటి ప్రవీణ్ కుమార్ క్యాసినో దందా వెనుక కేసీఆర్ కుటుంబ హస్తంతోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హస్తం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. నయీం కేసుతోపాటు మొత్తం వ్యవహారంపై బీజేపీ అధికారంలోకి వచ్చాక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నయీం ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ కొనుగోలు చేయొద్దని… ఒకవేళ ఎవరైనా ఆ పని చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది పడతారని హెచ్చరించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేసిన బండి సంజయ్ ఈ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దబోయే ఎన్నిక కాబోతోందని పేర్కొన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుండి టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతున్నారని… అదే సమయంలో ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వ విధానాలను పలుమార్లు ప్రశంసించారని గుర్తు చేశారు.

బీజేపీ సిద్ధాంతాలు, మోదీ నాయకత్వాన్ని నమ్మే వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసే కుట్రకు మళ్లీ తెరలేపారని ఆరోపించారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 62 సీట్లతోపాటు 47 నుండి 53 శాతం ఓట్లు వస్తాయని అనేక సర్వే సంస్థలు నివేదికల్లో వెల్లడైందన్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకత పెరగబోతోందని… తద్వారా బీజేపీకి సీట్లు, ఓట్ల శాతం మరింతగా పెరగబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్దేశించబోయే ఎన్నిక కాబోతుందన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ కుమార్ 3వ రోజు భువనగిరి శివారు నుండి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా దారి మధ్యలోనున్న పాదయాత్ర సహప్రముఖ్ జిట్టా బాలక్రిష్ణారెడ్డి ఫాంహౌజ్ వద్దకు వచ్చి జర్నలిస్టులతో కొద్దిసేపు ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన పలు అంశాలపై ముచ్చటించారు. అందులోని ముఖ్యాంశాలు…

నాకు మీడియాతో ముందునుంచి అటాచ్ మెంట్ ఎక్కువే. కరోనా టైంలో జర్నలిస్టుల పాత్ర మాటల్లో వర్ణించలేను. అదే కరోనా సమయంలో కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో పడుకున్నారు. పాలమూరు జిల్లాలో నా పాదయాత్ర సమయంలో జర్నలిస్టులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయం నా దృష్టికి తీసుకువచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే… మీడియా మిత్రులకు ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం… రైల్వే పాసులను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తాం. హెల్త్ కార్డులు, ఇండ్ల తో పాటు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తాం. జర్నలిస్టులను ఆయుష్మాన్ భారత్ లో కలుపుతాం.

ఆయుష్మాన్ భారత్ లో ప్రభుత్వం రాష్ట్ర ప్రజల డాటా ఇవ్వాలి. ఆరోగ్యశ్రీ అంటేనే రోగులను బయటికి గెంటే ప్రయత్నం చేస్తున్నారు. నూతన జర్నలిస్ట్ ల పాలసీ ని తీసుకొస్తాం. జర్నలిస్ట్ లను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి. డ్రగ్స్ స్కామ్ లో ముందు కేసీఆర్ ప్రభుత్వం హడావిడి చేసింది ఆ తర్వాత డ్రగ్స్ స్కామ్ ను ఏం చేసిందో… ఎలా నీరు గార్చిందో మనం చూశాం. చీకోటి క్యాసినో వ్యవహారం కూడా అంతే… ఇందులో ఎందరో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. చీకోటి ప్రవీణ్ ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్నాడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున ఆస్తులను సంపాదించుకున్నారు. ఆయా ఆస్తులను కాపాడుకునేందుకు కొందరు జోకర్ లా ప్రవర్తిస్తుంటారు.

చీకోటి వ్యవహారం లో కేసీఆర్ కుటుంబం పాత్రపై ఆరోపణలు వస్తున్నాయి. చీకోటి ప్రవీణ్ వ్యవహారం కోర్ట్ చూసుకుంటుంది. క్యాసినో వ్యవహారం తెరపైకి రావడంతో అందులో పాత్ర ఉన్న కొంతమంది టీఆర్ఎస్ నేతలు తమ ఆఫీస్ లను బంద్ చేసుకున్నారు. ఈ వ్యవహరం బయటకు రాగానే కేసీఆర్ కుటుంబం సైలెంట్ అయిపోయింది. కేసీఆర్ ఢిల్లీ పోయిండు. త్వరలోనే అన్నీ బయటకు వస్తాయి. కేసీఆర్ పాలనపై ప్రజలు తిరగబడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికతో కేసీఆర్ పతనం పతాక స్థాయికి చేరుకుంటుంది. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది బీజేపీ నే. మునుగోడు ఉప ఎన్నిక… తెలంగాణ ప్రజల భవిష్యత్ ను నిర్దేశించేది కాబోతోంది. మునుగోడు అభ్యర్థి ఎవరనే విషయంపై పార్టీ నిర్ణయిస్తుంది.

తెలంగాణలోని చాలా నియోజకవర్గాల్లో త్వరలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కారణం కాబోతున్నారు. ఇప్పటికే 10 నుంచి 12 మంది trs ఎమ్మెల్యేలు ఒక రహస్య ప్రదేశంలో సమావేశమై, తమ భవిష్యత్ ఏంటి అని ఆలోచించుకుంటున్నారు. టీఆర్ఎస్ ఏక్ నిరంజన్ పార్టీ. రాష్ట్రంలో అరాచకాలు, హత్యలు, పలు మాఫియాలు, కబ్జాలు…. ఇలా ఏవి జరిగినా అన్నింటిలో ఉన్నది టీఆర్ఎస్ నాయకులే. కేసీఆర్ కుటుంబంపై ప్రజలు తిరగబడుతున్నరు. టీఆర్ఎస్ లో కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్తు దెబ్బతినబోతుందనే భయం వాళ్లకు పట్టుకుంది. అందుకే ప్రజల చేత వాళ్లే ఒత్తిడి చేయించుకుని ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలనుకుంటన్నారు.

కాళేశ్వరం మునగడానికి ప్రధాన కారకుడు కేసీఆరే. కేసీఆర్ శంకర్ దాదా ఎంబీబీస్ లాంటి ఇంజినీరింగ్ తోనే ఇలా అయింది. ధరణి పేరుతో భూములు కబ్జా చేస్తున్నారు. బీజేపీ దెబ్బకే… చేనేత బీమా ప్రకటన చేశారు. బీజేపీ ప్రభుత్వం వస్తే తప్పకుండా ఉచిత విద్య, వైద్యం అందిస్తాం… అర్హులైన పేదలను గుర్తించి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించి ఇస్తాం. నాకు ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం… కేసీఆర్ కుటుంబం మళ్లీ ఆర్టీసీ ని కూడా ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆర్టీసీ విలువైన ఆస్తులను కేసీఆర్ కుటుంబం తన అనుయాయులకు, ప్రైవేటు వాళ్లకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. బీజేపీ ప్రభుత్వం వస్తే…ఆర్టీసీని కాపాడుకుంటాం. ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటాం. బీజేపీలో అంతర్గత విబేధాల్లేవు. అందరం కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేసే వాళ్ళకు మాత్రమే బీజేపీలో స్థానం ఉంటుంది. వ్యక్తిగత ఇమేజ్ కోసం పని చేసే వ్యక్తులకు స్థానం ఉండదు. మునుగడు మాత్రమే కాదు… పాతబస్తీ సంగతి చూడడమే బీజేపీ లక్ష్యం. రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుని తీరుతాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా… బీజేపీ కి 60 పై చిలుకు అసెంబ్లీ స్థానాల్లో గెలుచుకుంటుంది.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలో చేరతారని వార్తలను నేను చూశాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుండి టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతున్నాడు. చాలా సందర్భాల్లో మోడీ పాలనను అభినందించారు. బీజేపీ సిద్ధాంతాలు, మోదీ నాయకత్వాన్ని నమ్మి వచ్చే వాళ్లందరినీ బీజేపీలోకి ఆహ్వానిస్తాం. సముచిత గౌరవమిస్తాం… అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్ లో సహజం. కాంగ్రెసోళ్లు సమావేశం పెడితే వాళ్లు కొట్టుకునే స్థాయికి వస్తారని తెలిసి పోలీస్ బందోబస్తు పెట్టుకుంటారు.

నయీమ్ ను ఎన్కౌంటర్ చేయించిందే కేసీఆర్ కుటుంబం.. ఎందుకంటే… నయీం అరాచకాల వెనుక టీఆర్ఎస్ హస్తముంది. అయితే నయీమ్ తో కేసీఆర్ కుటుంబానికి అనుకోని ఇబ్బంది రావడంతోనే ఆయనను ఎన్కౌంటర్ చేయించారు. బీజేపీ ప్రభుత్వం వస్తే నయీం కేసుపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తాం. నయీమ్ బాధితులను ఆదుకుంటాం… నయీమ్ ఆస్తులను కొల్లగొట్టిన వ్యక్తుల నుంచి రికవరీ చేయించి, బాధితులకు అండగా ఉంటాం. కొనేటప్పుడు నయీమ్ ఆస్థులా… కాదా… అనేది చూసి కొనుక్కోండి. లేనిపక్షంలో భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. నయీమ్ పరోక్షంగా టీఆర్ఎస్ నాయకుడే. ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో… ఈనెల 6న ఓటేసేందుకు ఢిల్లీ వెళుతున్నా కాబట్టి ఆ ఒక్కరోజు మాత్రమే పాదయాత్రకు విరామం… ఆ తర్వాత యధావిధిగా కొనసాగుతుంది. ఎన్నికలొచ్చే వరకు నా పాదయాత్ర కొనసాగుతూనే ఉంటుంది. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నా.

“ప్రధాన మంత్రి ఆవాస్ యోజన”కు సంబంధించిన లబ్ధిదారుల లిస్ట్ ఇమ్మంటే… ఇప్పటివరకు కేసీఆర్ సర్కార్ ఆ వివరాలు ఇవ్వలేదు. కేంద్రం తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2.7 లక్షలకుపైగా ఇండ్లు మంజూరు చేయడంతోపాటు దాదాపు 4 వేల కోట్లు విడుదల చేసింది. కేసీఆర్ ప్రభుత్వం ఆ నిధులకు లెక్కలు చూపలేదు. పైగా నిధులను దారి మళ్లించింది. డబుల్ బెడ్రూం పేరుతో కట్టించింది ఇండ్లు 8 వేల =మాత్రమే. తెలంగాణ కు కేంద్రం మంజూరు చేసిన ఇండ్లను కూడా కట్టించలేని అసమర్థుడు కేసీఆర్. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు కట్టించి ఇస్తాం.

Leave a Reply