– భారీగా తరలి వచ్చిన ప్రజలు
– సమస్యలపై వెంటనే స్పందించిన ప్రజావాణి ఇంచార్జీ చిన్నారెడ్డి
హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 3,053 దరఖాస్తులు అందాయి. సమస్యలు తెలిపేందుకు ప్రజలు భారీ ఎత్తున ప్రజా భవన్ కు తరలి వచ్చారు. ప్రజావాణి ఇన్చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి ప్రజల సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఈ దరఖాస్తులలో ఎక్కువ శాతం ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చాయి. రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం కూడా దరఖాస్తులు అందాయి.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 111, విద్యుత్ శాఖకు సంబంధించి 100, రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 55, ఇందిరమ్మ ఇండ్లు పథకం కోసం 2,691 దరఖాస్తులు వచ్చాయి, ఇతర శాఖలకు సంబంధించి 96 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్.చిన్నారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్ కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.