ఆ స్వామి వారితో పాటు ఈఓ స్వామికీ కల్యాణమా?

మోపిదేవి ఆలయంలో కొత్త సంప్రదాయం

కల్యాణంలో స్వామివారి పక్కనే కూర్చున్న ఈఓ

ముక్కున వేలేసుకున్న భక్తులు

సోషల్ మీడియాలో ఫొటో, వీడియోలు హల్‌చల్


ఆయన ఒక ఆలయ కార్యనిర్వహణాధికారి. పైగా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్. మరి అలాంటి బాధ్యతాయుతమైన అధికారి, తన ఆలయంలో జరిగే పూజాదికాల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి? కానీ, ఆయన గర్భగుడిలో ఉన్న స్వామితోపాటు, తాను కూడా స్వామినేనని (ఆలయానికి) అనుకున్నట్లున్నారు కామోసు. అందుకే ఎంచక్కా స్వామి వారికి జరిగే కల్యాణోత్సవంలో విగ్రహం పక్కనే కూర్చుని, పరోక్షంగా తానూ కల్యాణం చేయించుకుని ధన్యులయినట్లున్నారు. ఒక ఈఓ వ్యవహారశైలికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి భక్తజనం ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇంతకూ అసలేం జరిగిందంటే... కృష్ణాజిల్లాలోని ప్రసిద్ధ మోపిదేవి గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా స్వామివారికి కల్యాణం నిర్వహించారు. ఆ మేరకు వేదపండితులు శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు. దానికి వందలాదిమంది భ క్తులు హాజరయ్యారు. వారికి ఏర్పాట్లు కూడా బాగానే చే శారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ కల్యాణ సమయంలో ఆలయ ఈఓ స్వామి వారి విగ్రహం పక్కనే కూర్చోవడమే భక్తులకు మింగుడుపడలేదు. సహజంగా ఎంత చిన్న ఆలయాల్లోనయినా కల్యాణం లేదా ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు, అర్చకులతో సహా అందరూ స్వామి వారి విగ్రహానికి ఎదురుగానే కూర్చుని పూజలు నిర్వహిస్తుంటారు.కానీ మోపిదేవి ఆలయ ఈఓ మాత్రం అందుకు భిన్నంగా, స్వామి వారి విగ్రహం పక్కనే కూర్చుని కల్యాణం చేయించడంపై భక్తుల్లో నిరసన వ్యక్తమవుతోంది. దానికి సంబంధించి విడుదలయిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అందులో స్వామి వారి విగ్రహం పక్కనే ఈఓ కూర్చోవడం స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై హిందు సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

‘దేవాలయాల్లో శాస్త్రప్రకారంగా పూజలు జరిగేలా చూడాల్సిన ఈఓనే శాస్త్రానికి విరుద్ధంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం క్షమార్హం కాదు. ఆలయ ఈఓ మిగిలిన వారికి కొత్త సంప్రదాయాన్ని చూపినందుకు ఆయనపై దేవదాయ శాఖ అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. అక్కడ పూజను పర్యవేక్షించే అధికారులు కూడా ఉన్నట్లు కనిపించడం లేదు. ఈఓకు పైత్యమో, అహంకారమో అర్ధం కావడం లేదు. అంటే స్వామివారితో పాటు ఆయన కూడా కల్యాణం చేయించుకున్నట్లు భక్తులు భావించాల్సి ఉంది. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా కమిషనర్ చర్యలు తీసుకోవాలి. శాస్త్రవిరుద్ధంగా వ్యవహరించిన ఈఓను వెంటనే సస్పెండ్ చేయాల’ని బ్రాహ్మణ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ డిమాండ్ చేశారు.


సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X