సామాన్యుల కష్టాలు ఈ ప్రభుత్వానికి పట్టవు

* ఉల్లి కష్టాలకు ప్రభుత్వ వైఫల్యమే కారణం

* ఉల్లి కోసం ప్రజలు బజార్ చుట్టూ తిరగాల్సి వస్తోంది

* గత ప్రభుత్వాలదే తప్పు అంటూ తప్పించుకోవద్దు

తన అభిమానుల వల్ల నష్టం వాటిల్లిన ఉల్లి వ్యాపారికి రూ.3 వేలు పరిహారం ఇచ్చిన జనసేనాని

తిరుపతి ఆర్సీ రోడ్డు రైతు బజారును సందర్శించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 

ఉల్లి కోసం ప్రజలుపడుతున్న కష్టాలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రభుత్వం రైతు బజార్లో కిలో ఉల్లిపాయలు రూ.25కే ఇస్తామని చెబుతున్నా అమలు జరగడం లేదని అన్నారు.ప్రజల కష్టాలు సర్కార్ కి పట్టదని చెప్పారు. గత ప్రభుత్వాలదే తప్పు అంటూ తప్పించుకోవడం సమస్యకు పరిష్కారం కాదన్న ఆయన.. ప్రణాళికలు రచించడంలో ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. ప్రజల కష్టాలు తీర్చే సమర్ధత లేకపోతే ప్రభుత్వం తప్పుకొని ఎన్నికలకు వెళ్లాలని అన్నారు.  మంగళవారం ఉదయం తిరుపతిలోని ఆర్సీ రోడ్డు వద్ద ఉన్న రైతు బజార్ కు వెళ్లారు. అక్కడ ప్రభుత్వ సబ్సిడి ఉల్లిపాయల కోసం ప్రజలు వేచి చూడటం చూసి  వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు,  వినియోగదారులు, వ్యాపారులు తమ పడుతున్న బాధలను పవన్ కళ్యాణ్ కి వివరించారు.

* ఉల్లిపాయలు ఎప్పుడు వస్తాయో తెలీదు

“జగన్ వస్తాడు.. ఉద్ధరిస్తాడు అనుకొంటే ఏం ఉద్ధరించాడు. పప్పులు, కూరగాయలు, పామాయిల్ ధరలు పెరిగిపోయాయి. పిల్లలకు స్కాలర్ షిప్స్ ఇస్తున్నాం అంటున్నారు, ఓసీలకు ఇవ్వరు. ఏం కొనాలన్నా భయమేస్తోంది. రైతు బజారులో అన్ని కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. వెయ్యి రూపాయలు  తెచ్చుకున్న సంచి నిండటం లేదు. క్వాలిటీ తక్కువగా ఉన్న ఉల్లిపాయలను సైతం రూ. 80 కి అమ్ముతున్నారు. మంచి రకం కావాలంటే రూ.130 పెట్టాల్సి వస్తోంది. ప్రభుత్వం సరఫరా చేస్తామని చెబుతున్న సబ్సిడి ఉల్లి ఎప్పుడొస్తుందో ఎవరికి తెలియడం లేదు" అని జ్యోతి అనే గృహిణి వాపోయారు. నాలుగు రోజులుగా అయితే సబ్సిడి ఉల్లిపాయలు అమ్మడం లేదని కొనుగోలుదారులు తెలిపారు. స్టాక్ వచ్చినా రోజంతా క్యూలో నిలబడితే ఒక్క కిలోనే ఇస్తున్నారు. రోజు కూలీ చేస్తే రూ. 300 ఇస్తున్నారు. అందులో వంద రూపాయలు ఉల్లిపాయలకే ఖర్చు చేస్తే కుటుంబాలను ఎలా పోషించాలని వాపోయారు. రూ. 3వేలు పెట్టి ఉల్లి మూట కొంటే అందులో 15 కిలోల వరకు ఉల్లిపాయలు కుళ్లిపోతున్నాయని  వ్యాపారులు బాధపడ్డారు. దీంతో లాభం మాట దేవుడెరుగు నష్టాలు తప్పడం లేదని తమ బాధలను చెప్పుకున్నారు.

* సామాన్యుడు ఎలా బతకాలి

రైతులు, వ్యాపారులు కొనుగోలుదారుల కష్టాలు విన్న అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. "ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత మాదిరిగానే ఉల్లి కోసం కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక వైపు రెక్కలు ముక్కలు చేసుకున్న రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. మరో వైపు రైతు బజారులో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా చూస్తే మధ్యలో దళారులు బాగుపడుతున్నారు అనిపిస్తోంది. కిలో సబ్సిడి ఉల్లిపాయల కోసం మహిళలు రోజంతా క్యూలైన్లో ఉండిపోవాల్సి రావడం బాధకరం. రూ. 25 దొరకాల్సిన ఉల్లిపాయలు.. రూ.100కి అమ్మితే సామాన్యులు ఎలా బతుకుతారు.?. రెచ్చగొట్టే రాజకీయాలకు జనసేన దూరం. పార్టీ పెట్టిందే ప్రజా సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కారం చేయడానికి. ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకొని ప్రజలకు ఉల్లిపాయలను అందుబాటులోకి తీసుకురావాలి. లేని పక్షంలో ప్రజలందరితో కలిసి ఆందోళనను ముందుకు తీసుకెళ్తామ"ని హెచ్చరించారు.  అంతకుముందు తనను చూడటానికి వచ్చిన జనసైనికులు, అభిమానుల వల్ల ఉల్లి వ్యాపారికి నష్టం వాటిల్లితే ఆయనకు రూ. 3వేలు పరిహారం ఇచ్చారు. ఎండబెట్టిన ఉల్లిపాయలను చిందరవందరగా అభిమానులు తన్నేయడంతో వాటిని ఎత్తి తిరిగి చాపమీద పోశారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగడతాం

పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... "ఉల్లి ధరలతో సామాన్యులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికే రైతు బజారుకు వచ్చాం. నాలుగు రోజులైన సబ్సిడి ఉల్లిపాయలు మార్కెట్లో లేకపోవడం దారుణం. స్టాక్ వచ్చినా ప్రజలకు సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. ఉల్లిపాయల పంపిణీ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగడతాం. రెండు, మూడు నెలల ముందు రూ. 500 పెడితే తెచ్చుకునే సంచి నిండేది. ఇప్పుడు వెయ్యి పెట్టినా సంచి నిండటం లేదు. ప్రభుత్వ ప్రణాళిక లోపం వల్ల ప్రజలకు న్యాయం జరగడం లేద"ని అన్నారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X