ఎందుకీ గుండె గు‘బిల్లు’?

పౌరసత్వ సవరణ చట్టంపై ఏమిటీ పొలికేకలు?

భారతీయులను పిలిపిస్తే ఏమిటీ అడ్డుగోడలు?

కాంగ్రెస్ చేసిను తప్పును సవరిస్తే ఎందుకీ గావుకేకేలు?

పౌర చట్టంతో ముస్లింలకు వచ్చిన నష్టం సున్నా

ముస్లింలు ఈ గడ్డలో కలిసే బిడ్డలే

మత రాజకీయాలపై మోదీ పంజా


( మార్తి సుబ్రహ్మణ్యం)

దశాబ్దాలుగా పరాయి దేశాల్లో రెండవ తరగతి ప్రజల్లా జీవిస్తూ.. రోజూ ప్రాణాలరచేతిలో పట్టుకుని ధన-మాన-ప్రాణాలు కోల్పోతూ.. కళ్లెదుటే కుటుంబసభ్యులపై మానభంగాలు చేసి, మత మార్పిళ్లు చేసే అరాచక పాలనలో మగ్గుతూ.. సాయం చేసే చేతులు లేక.. వారి వేదన అరణ్యరోదనగా మిగిలిన భారతీయులు ఎదుర్కొంటున్న అమానవీయ పరిస్థితిలో మార్పు తీసుకురావడం.. కాంగ్రెస్, తెరాస, మజ్లిసు దృష్టిలో నేరం, మహా ఘోరం.

ఆయా దేశాల్లో వారి చావు వారు చావాల్సిందే. ఆడవారిపై సామూహిక అత్యాచారాలు చేసినా, వారి ఇళ్లను తగులబెట్టినా ఇలాంటి రాజకీయ పార్టీలకు మహదానందమే. అలాంటి బాధితులకు, అందునా మన దేశం నుంచి తలదాచుకునేందుకు పరాయి దేశాలకు వెళ్లిన వలస ప్రజలకు. మన దేశంలో ఇంత చోటిస్తే అది వారి దృష్టిలో మహా పాతకం. మన వారిపై పరాయి గడ్డపై ఎన్ని అత్యాచారాలు జరిగినా వారికి అనవసరం. వారికి కావల్సింది మాత్రం ఓట్లు, సీట్లు! పౌరసత్వ సవరణ చట్టంపై వివిధ పార్టీల విన్యాసాలు, దానిని వ్యతిరేకిస్తూ చేస్తున్న వెగటు చేష్టలు, రాజకీయ పార్టీల అధినేతల ప్రకటనలు చూసిన తర్వాత మనసున్న ఎవరికైనా కలిగే మనోవేదనే ఇది.

భారత్-పాక్ విడిపోయిన తర్వాత చాలామంది పౌరులు పాక్-బంగ్లా-ఆఫ్ఘనిస్తాన్-శ్రీలంక దేశాలకు వెళ్లి జీవిస్తున్నారు. కానీ పాక్, బంగ్లాదేశ్‌లలో ముస్లింలు మెజారిటీ అయితే, భారత్ నుంచి వెళ్లిన ఆరు మతాల వారు మైనారిటీలు. దానితో సహజంగానే అక్కడ నివసించే హిందు,క్రైస్తవ, పార్శీ, సిక్కు, బౌద్దమతస్తులపై మెజారిటీ ప్రజల దాడులు ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్‌లో భారత్ నుంచి వె ళ్లిన వారికెలాంటి హక్కులూ లేవు. ఇప్పటికే అక్కడ కొన్ని వేల దేవాలయాలు, చర్చిలు నేలమట్టం చేశారు.

భారత్ నుంచి వెళ్లిన వారి విషయంలో మానవ హక్కులెవరికీ పట్టవు. మొన్నా మధ్య భారత్‌లో అత్యాచారాలు పెరిగిపోయాయంటూ కన్నీరు పెట్టుకుని, కుమిలిపోయిన ఐక్యరాజ్యసమతి పెద్ద ఓసారి పాక్‌లో పర్యటించి, అక్కడి మైనారిటీలపై జరుగుతున్న అత్యాచారాలు తెలుసుకుంటే పాపం గుండె పగిలిపోయేదేమో?! మైనారిటీ మతాలకు చెందిన కుటుంబసభ్యుల కళ్లెదుటే ఆడవారిపై అత్యాచారం చేసి, బలవంతపు వివాహం చేసుకుని ఎత్తుకెళ్లిన ఘటనలు చెబితే పెద్ద గ్రంధమే అవుతుంది. అయినా ప్రతిఘటించేవారెవరూ ఉండరు. దానిని ఖండించే సాహసం పాక్ ప్రతిపక్షమూ చేయదు. భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ వచ్చిందంటే, ఇక పాక్‌లోని భారతీయులు చూసే నరకం అంతా ఇంతా కాదు. భారత్ జెండా ఎగురవేసిన వారి చేతులు తర్వాత తెగి ముక్కలవుతుందంతే. కానీ, ఇదే ఇండియాలో హైదరాబాద్, కాన్పూర్, పాట్నా వంటి నగరాల్లో ఏకంగా పాక్ జెండాతో ఊరేగింపులే చేస్తారు. భారత్ జాతీయ జెండాను దహనం చేస్తుంటారు. అంత స్వేచ్ఛ ఉన్న దేశం ప్రపంచంలో ఇదొక్కటే మరి!

ఇన్ని అరాచకాలు, అవమానీయ చర్యలకు బలవుతున్న మన దేశపు బిడ్డలు, తిరిగి భారత్‌కు వచ్చినప్పుడు వారికి పౌరసత్వం ఇస్తే వచ్చే నష్టమేమిటి? వారిని గుండెల్లో పెట్టుకుంటే ఎందుకీ గుండెలు పగిలేంత గావుకేకలు? వారొస్తే ఈ దేశ ప్రజలకు ఏం నష్టం? వారూ మన సోదరులే కదా?! అంటే ఈ దేశంలో హిందు, క్రైస్తవ, సిక్కు, పార్శీ, జైన్, బౌద్దులకు తిరిగి ప్రవేశం కల్పించడం కాంగ్రెస్ వంటి రాజకీయపార్టీలకు ఇష్టం లేదా? వేలాదిమందిని ఊచకోత కోసి, దారుణమైన మానభంగాలకు పాల్పడిన రోహింగ్యాలను ఎందుకు అడ్డుకుంటున్నారన్న ప్రశ్నలొక్కటి చాలు.. ఈ దేశ రాజకీయమ్మన్యులకు మన దేశభద్రతపై ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి! ఈ క్షుద్ర రాజకీయాలే భారత్‌ను బలహీనం చేస్తున్నాయన్న దేశభక్తుల ఆవేదనలో తప్పేముంది?దీనికోసం జరిగిన పౌరసత్వ సవరణ చట్టం ఓటింగ్‌లో పాల్గొన్న రాజకీయ పార్టీలు గంటలపాటు సమయహననం చేసి, అర్ధం లేని వాదనలతో ప్రజాధనం వృధా చేయడం మరో రోత. మన దేశానికి చెందిన సంతతి పరాయి గడ్డపై ఎదుర్కొంటున్న అరాచాలనుంచి.. ఈ దేశ పాలకులు విముక్తం చేయాలన్న సంకల్పానికి చేయూతనివ్వాల్సిందిపోయి, ముస్లింలకు ఎందుకు పౌరసత్వం ఇవ్వరు? పౌరసత్వ బిల్లు వల్ల ఈ దేశ ముస్లింలకు అన్యాయం జరుగుతుందనే చచ్చు పుచ్చు వాదనలను తెరపైకి తీసుకువచ్చిన తీరు, సగటు భారతీయుడికి వెగటు కలిగించేవే. పాక్, బంగ్లా, ఆఫ్ఘాన్ ఫక్తు ముస్లిం దేశాలు. కాబట్టి అక్కడ నివసించేది మన దేశం నుంచి వెళ్లిన ముస్లింలయినా వారికొచ్చిన గత్తరేమీ లేదు. ఇబ్బందల్లా అక్కడ నివసించే హిందు, సిక్కు, క్రైస్తవ, పార్శీ, బౌద్దులకే. అక్కడ వారే బాధితులు. పైగా ఆ మూడు దేశాలు మన మాదిరిగా ప్రజాస్వామ్య దేశాలు కావు. ముస్లిం మత రాజ్యాలు.

పౌరసత్వ బిల్లుకు మోకాలడ్డి, సర్కారు సంకల్పానికి తూట్లు పొడిచేందుకు సిద్ధమైన ఈ సోకాల్డ్ రాజకీయ పార్టీలు.. మన దేశంలో ముస్లింలకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నరు, కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి పదవులిచ్చి గౌరవిస్తుంటే, పాక్-బంగ్లాదేశ్‌లో ఒక్క మైనారిటీ యినా అలాంటి పదులివ్వరు ఎందుకని ఒక్క గొంతయినా నినదించదేం? ఆ స్వేచ్ఛ, అంత విశాల హృదయం ప్రపంచంలోని ముస్లిం దేశాలకు ఉందా అని ఒక్క గళం ధ్వనించదేం? దానిపై ఏ సోనియాగాంధీ మాట్లాడరు. ఏ ఒవైసీ పెదవి విప్పరు. ఏ రాహుల్ గాంధీ ట్వీట్ చేయరు. ఎందుకంటే ముస్లిం ఓట్లు పోతాయన్న భయం. ముస్లిం ఓట్లు పోతే తెరవు ఉండదన్న ఆందోళన. అయినా కాంగ్రెస్ చేసిన తప్పును సరిదిద్ది, దుమ్ముపట్టిన ఆనాటి ఒప్పందాన్ని నరేంద్రమోదీ సర్కారు అమలుచేస్తే, తప్పేంటన్న ప్రశ్నకు ఈ కుహనా లౌకిక మేధావుల వద్ద సమాధానమే ఉండదు.

ఎందుకంటే.. మత ప్రాతిపదిక భారత్ నుంచి విడిపోయిన పాకిస్తాన్‌తో జరిగిన ఒప్పందం ప్రకారం.. రెండు దేశాలు విడిపోయినప్పటికీ, రెండు దేశాల పౌరుల మైనారిటీలకు సమాన హక్కులివ్వాలని తీర్మానించాయి. అంటే పాక్‌లో హిందువులు వివక్షకు గురైతే, వారంతా భారత్‌కు వెళ్లవచ్చు. అలాగే భారత్‌లో ముస్లింలు వివక్షకు గురైతే వారంతా పాక్‌కు వెళ్లవచ్చు. ఇదీ ఆ ఒప్పంద సారాంశం. అయితే ఇప్పటివరకూ ఏ ఒక్క ముస్లిం తనకు వివక్ష ఎదురైందన్న వాదనతో పాక్‌కు వెళ్లలేదు. (తీవ్రవాద శిక్షణ కోసం కొందరు వెళ్లడం తప్ప) ఎందుకంటే భారత్‌లో ముస్లింలకు ఇచ్చే విలువ, ప్రాధాన్యం ప్రపంచంలోకి మరే ముస్లిం దేశాలివ్వవు కాబట్టి! రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, కేంద్రమంత్రి, సీఎం, ఎంపి వంటి అత్యున్నత గొప్ప పదవులిచ్చి వారిని గౌరవించిన దేశం ఇది. కానీ అదే పాక్,బంగ్లాదేశ్,ఆఫ్ఘనిస్తాన్‌లో ఒక్క హిందువు కయినా,ఒక్క క్రైస్తవుడికయినా, ఒక్క సిక్కుకయినా ఇలాంటి పదవులిచ్చిన దాఖలాలు భూతద్దంవేసి వెతికినా కనిపించవు. ఇది భారతదేశ గొప్పతనం, అన్ని మతాలను ప్రేమించే విశాల హృదయానికి ఓ నిదర్శనం.ఆ ఒప్పందం ప్రకారంగానే.. పాక్-బంగ్లా-ఆఫ్ఘనిస్తాన్‌లో వివక్షకు గురవుతున్న హిందు, సిక్కు, పార్శీ, జైన్, క్రైస్తవ మైనారిటీలకు భారతదేశంలో ఆశ్రయంతోపాటు పౌరసత్వం ఇప్పించడం ద్వారా, పరాయిదేశాలలో అరాచకాలకు గురవుతున్న భారతీయులకు మోదీ సర్కారు బాసటగా నిలిచారు. ఇది తప్పనిపించడం విపక్షాలకే చెల్లింది.నిజానికి 1947 విభజన నాటికి పాక్‌లో 25 శాతమే హిందువులు మిగలారు. ప్రస్తుతం పాక్-బంగ్లా దేశాల్లో 1.5 శాతం మంది మాత్రమే ముస్లిమేతరలున్నట్లు ఒక అంచనా. ఇక ఆఫ్ఘనిస్తాన్‌దీ దాదాపు అదే పరిస్థితి. ఆ మూడు దేశాల్లో జరుగుతున్న అరాచకాలకు పారిపోయి వచ్చిన హిందువులు, మరికొందరు ఇతర మతస్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం నాటి ఒప్పందం ప్రకారం భారత పౌరసత్వం ఇవ్వలేదు. కానీ అదే పాక్-బంగ్లా నుంచి వచ్చిన ముస్లింలకు మాత్రం ఆశ్రయమివ్వడమే ఈ బిల్లు మూలానికి కారణంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌లో పాక్-బంగ్లా పౌరులు వీసా ముగిసినా, వారిని పంపించివేయని కాంగ్రెస్ సంతుష్టీకర విధానాలకు హైదరాబాద్‌లో వందలమంది అమాయకులు వివిధ ఘటనలో చనిపోయారు. అందులో ముస్లిములూ ఉండటం విషాదకరం. దీనిపై బిజెపి నేతలు ఇంద్రసేనారెడ్డి, కిషన్‌రెడ్డి ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న డిమాండ్ కాంగ్రెస్ పాలకులకు వినిపించలేదు. దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా, ఏ అరాచం జరిగినా వాటి మూలాలు హైదరాబాద్‌లో తేలుతున్నాయంటే, దానికి కారణం కాంగ్రెస్ వేసిన సంతుష్టీకర, ఓటు బ్యాంకు రాజకీయ బీజాలేనన్నది నిష్ఠుర నిజం. ఇక పశ్చిమ బెంగాల్‌లో బంగ్లా నుంచి అడ్డదారుల్లో వచ్చిన వేలాదిమంది ముస్లింలకు అక్కడి కమ్యూనిస్టు, టీఎంసి ప్రభుత్వాలు ఆశ్రయమివ్వడమే కాదు, రేషన్‌కార్డులూ ఇచ్చాయి. అసలు కశ్మీర్ పండితులను ఊచకోత కోసి, భయానకం సృష్టించిన రోజు నుంచి, వారంతా చెట్టుకొకరు పుట్టకొకరుగా విడిపోతే... మొన్న కశ్మీర్‌కు బిజెపి సర్కారు విముక్తం కలిగించిన తర్వాత గానీ వారంతా తిరిగి కశ్మీరుకు వెళ్లలేకపోయారు. అంటే దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు ఏ స్థాయిలో పాతుకుపోయేయా స్పష్టమవుతోంది.

ఇక పౌరసత్వ సవరణ బిల్లు వల్ల ఈ దేశంలోని ముస్లింలకు ప్రమాదం వచ్చిపడుతుందని, ఈశాన్య రాష్ట్రాల వారి ఉనికికే ప్రమాదమంటూ సోనియా నుంచి ఒవైసీ వరకూ చేస్తున్న అడ్డగోలు వాదనలు హాస్యాస్పదం. భారత్‌లో పుట్టిన ఏ ముస్లిం పాక్ వెళ్లాలని కోరుకోరు. ఇంతవరకూ కోరుకోలేదు. మరో మతంతో ఘర్షణ అసలు కోరుకోరు. వారంతా ఈ దేశపు వారసులు.యుద్ధవీరులు, సైంటిస్టులు, క్రీడాకారులు, జర్నలిస్టులు, వ్యాపారుల నుంచి... రోడ్డుపై సైకిల్ పంక్చర్ వేసుకుని జీవించే సాదాసీదా సగటు ముస్లిం ఈ దేశంలో అందరూ కలసి బతకాలని కాంక్షిస్తారు. వారి దేశభక్తిని శంకించాల్సిన అవసరం గానీ, ఆ విషయంలో వారికి మరొకరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పనిలేదు. ప్రపంచంలోని ముస్లిమేతర దేశాల్లో రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, గవర్నర్లను మైనారిటీలకు ఇచ్చిన దేశమేదైనా ఉందంటే అది ఒక్క భారత్ మాత్రమే.

మన దేశంలో కాశీ, రామేశ్వరం, అమర్‌నాధ్‌యాత్రలకు నయాపైసా ఇవ్వకపోయినా, మక్కా వెళ్లేందుకు రాయితీలిస్తున్న రాష్ట్రాలు, ముల్లాలకు జీతాలిస్తున్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. విద్య, ఉపాథి రంగాల్లో ఉదారంగా ఆర్ధిక సాయం చేస్తున్న దేశమిది. ఇదే పరిస్థితి పాక్-బంగ్లా-ఆఫ్ఘనిస్తాన్‌లో నివసించే హిందు,క్రైస్తవ,సిక్కు,పార్శీ,జైను, బౌద్దులకు ఆయా దేశాలు ఇవ్వడం లేదన్న విషయం మన దేశంలోని ముస్లింలకు తెలియదనుకుంటే పొరపాటే. అందుే ఈ దేశంలోని ముస్లింలకు మన దేశమంటే భక్తి, గౌరవం. పాక్‌లో రోడ్డుకు అడ్డుగా ఉన్న అనేక మసీదులను కూల్చివేసే ఘటనలు టీవీలో చూస్తుంటాం. అయినా ఎవరూ అడ్డు చెప్పరు. కానీ మన దేశంలో రోడ్డుకు అడ్డుగా ఉందని చిన్న చిన్న గుళ్లను తొలగిస్తారే తప్ప.. అదే ఒక మసీదును గానీ, చర్చిని కానీ కూల్చేసిన ఘటనలు చరిత్రను తవ్వినా దొరకదు. అందుకే మన దేశమంటే ముస్లింలకు అంత ఇష్టం. ఈ గౌరవం, ఇంత రక్షణ, ఇన్ని సౌకర్యాలు, ఇంత జీవనాధారం ముస్లిం దేశాల్లో దొరకదన్న విషయం ముస్లింలకు తెలియనుకున్న వారు మూర్ఖుల కిందే లెక్క.అందాకా ఎందుకు?.. కార్గిల్‌లో పాక్ ముష్కరుల స్వైరవిహారంతో, మన జవానులు నిహతులయినప్పుడు.. దేశం మొత్తం రగిలిపోతే, దానికి ముస్లిములూ గొంతు కలిపారు. పాక్ చేతిలో మన సైనికులు వీరమరణం పొందిన ప్రతిసారీ జరిగే నిరసన కార్యక్రమాల్లో, ముస్లిములే ముందువరసలో ఉన్న సందర్భాలు బోలెడు. తిరుమల, శ్రీశైలం వంటి దేవాలయాల్లో దైవదర్శనానికి వచ్చే వారిలో ముస్లిములూ ఉన్నారంటే వారి పరమత సహ నానికి, సోదర భావానికి కొత్తగా సర్టిఫికెట్ ఇవ్వడం అవసరమా?

ఇప్పుడు పౌరసత్వ సవరణ బిల్లుతో మన దేశంలోని ముస్లిములకు ఏదో గత్తరొచ్చిపడతుందంటూ కాంగ్రెస్, తెరాస, మజ్లిస్, వామపక్షాల వంటి ఎక్‌స్ట్రా పాత్రలు చేస్తున్న వాదనలు చూస్తుంటే.. అసలు వీరే ముస్లిములను సమాజం నుంచి వేరు చేస్తున్నట్లు, వేరు కావాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. మన దేశానికి చెందిన సంతతి మన దేశానికి వస్తుంటే, అది ముస్లిములకు ఏవిధంగా హానికరమో చెప్పిన మొహాలు ఇంతవరకూ కనిపించలేదు. పైగా ఈనాశ్య రాష్ట్రాల వారి మనుగడకే ముప్పన్న ఇటలీమాత సోనియమ్మ అదెలాగో విశ్లేషించి, వివరించనూ లేదు. పాక్-బంగ్లా-ఆఫ్ఘనిస్తాన్‌లో వేధింపులకు గురవుతోంది ఒక్క హిందువులే కాదు.మరో ఐదు మతాలు. అందులో క్రైస్తవులూ ఉన్నారు. మరి వారంతా తిరిగి వెనక్కి వస్తే ముస్లిములకు నష్టమేమిటన్న ప్రశ్నలకు ఈ లౌకికవాద మొహాలవద్ద జవాబు ఉండదు. ఈ బిల్లులో ముస్లింలకు నష్టం. అదొక్కటే ఈ కుహనా లౌకిక ముఠాలకు తెలిసిన మాట! మరి అలాగైతే ముస్లిములనూ ఎందుకు రానివ్వరన్నది ఓ తెలివి లేని లాజిక్కు ప్రశ్నలు. అసలు ఆ మూడు ముస్లిం దేశాలే. అక్కడ మెజారిటీ ప్రజలూ ముస్లిములే. అక్కడి స్థానిక ముస్లిముల చేతులో వేధింపులకు గురవుతున్నది ఆరు మతాలు. ఆ ఆరుమతాలకు చెందిన వారు మన దేశానికి తలదాచుకునేందుకు అనుమతిస్తే.. ఎవరైతే వేధింపులకు పాల్పడుతున్నారో వారినీ తీసుకురావాలన్న మతిలేని వాదనలు చేసే, క్షుద్ర రాజకీయనేతల నుంచి అసలు ఈ దేశానికి రక్షణ ఎంతన్నది ప్రశ్న. మత కలహాలకు పుట్టినిల్లయిన ఉత్తరప్రదేశ్, హైదరాబాద్‌లో.. తాజా అయోధ్యపై తీర్పు వచ్చిన తర్వాత ఈ గడ్డపై ఒక్క రక్తపుచుక్క కూడా చిందకుండా, ఒక్క ఆందోళన స్వరం కూడా వినిపించకుండా, ఒక్కరూ రోడ్డెక్కకుండా ఉన్నారంటే.. ఈ దేశ ముస్లిములు ఎంత పరిణతి చెందారన్న వాస్తవం అర్ధం చేసుకోలేని వారికి దేశం గురించి వాపోయే నైతికఅర్హత ఉందా అన్నది సగటు భారతీయుడి ప్రశ్న.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Surya Online News website
Address:
Marthi Subramanyam
Phone:
9705311144.
Email:
admin@suryaa.co.in
Scroll
X