తెలుగు కోయిలల తిట్ల పురాణం!

వైసీపీ-తెదేపా నేతల బూతుల పర్వం

శాసనసభనూ తాకుతున్న బూతులపర్వం

సోషల్‌మీడియాలో నగుబాటుపాలవుతున్న గౌరవం


( మార్తి సుబ్రహ్మణ్యం)


మాననీయ ప్రజాప్రతినిధుల అచ్చమైన తెలుగు భాషకు తెలుగు తల్లి పరవశించిపోతోంది. ‘ గౌరవనీయులు’, ‘గారూ’ అని గౌరవప్రదంగానే పిలుస్తూనే ‘గాడు’, ‘గాడిద’ ‘దున్నపోతు’ ‘లుచ్చా, పందికొక్కు, ఒళ్లు దగ్గరపెట్టుకో, తాట తీస్తాం’, ‘రేయ్ కూర్చోరా’ ‘నాకొడాకా’ అని మనసారా, నోరారా బూతులు తిట్టుకునే మన శాసనసభ్యులు, రాజకీయ పార్టీ నేతల బూతు పురాణానికి తెలుగుతల్లి మురిసిముక్కలవుతోంది. అంతేనా?.. తెలుగునేలపై పుట్టి తెలుగు చదవడం, మాట్లాడటం కూడా రాని వారంతా పాలితులపైకెక్కి, సవారీ చేస్తున్న వైనాన్ని చూసిన తెలుగు తల్లి ధన్యజీవిగా మారింది. ఇంతటి అదృష్టం ఒక్క మన తెలుగువారికి, అదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకే సొంతం కావడం మనకూ గర్వకారణమే కదా? ఈ నగుబాటు సోషల్ మీడియాకు ఎక్కి, దానిని ప్రపంచంలోని తెలుగు వారంతా వీక్షించడంతో, మన ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించిన ఫలితంగా తెలుగువారిగా మన జన్మకూడా జమిలిగా ధన్యమయినట్లే!

శాసనసభ లోపల- బయట శాసనసభ్యులు, వైసీపీ-తెదేపా నేతలు చేస్తున్న నేలబారు-చౌకబారు వ్యాఖ్యలు, వాడుతున్న స్థాయి తక్కువ పదాలు, కర్ణకఠోరంగా వివినిస్తున్న బూతు పురాణాలు తెలుగువాడి స్థాయిని తగ్గిస్తున్నాయి. తెలుగుభాషకు తెల్లవాడైన బ్రౌన్ దొర పట్టం కడితే, మన వారు మాత్రం దానిని పట్టిపీడిస్తున్నారు. వైసీపీ- తెలుగుదేశం అన్న తేడా లేకుండా ప్రజాప్రతినిధులు, నేతలు తెలుగు భాషను విజయవంతంగా ఖూనీ చేస్తున్న తీరు చూస్తే, బ్రౌను దొర గుండె ఘోషించకమానదు. తెలుగుభాషకు పుట్టినిల్లయిన ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నేళ్ల నుంచి, రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణలు-ప్రత్యారోపణలు, మంత్రుల ప్రమాణ స్వీకారం,ప్రసంగాలలో తెలుగుభాష ఖూనీ అవుతున్న తీరు తెలుగు భాషా పిపాసుల గుండెను పిండేస్తోంది.పాలించే మంత్రులు కొందరికి నోరారా తెలుగు మాట్లాడటమే గగనమయితే, మాట్లాడే శాసనసభ్యులూ వారి తమ్ముళ్లలా తయారైన దౌర్భాగ్యం మన దగ్గరే దాపురించింది. చాలామంది మంత్రులు ప్రమాణ స్వీకారంలో నోరు తిరగక, తెలుగును ఖూనీ చేస్తున్న సంప్రదాయం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా విజయవంతంగా కొనసాగుతోంది. చివరకు సీఎంగా పనిచేసిన చంద్రబాబు, ఇప్పుడు సీఎంగా పనిచేస్తున్న జగన్ కూడా దీనికి మినహాయింపు కాకపోవడమే విచారకరం. ఇటీవల జగన్ ఓ ప్రభుత్వ కార్యక్రమంలో, క్లిష్టమైన తెలుగు పదాలను సరిగా పలకలేక నానా అవస్థలు పడ్డారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

గతంలో చంద్రబాబు కూడా సభలోనే తమది దేశంలోనే అవినీతి పాలన అని నోరుజారి, సోషల్ మీడియా చేతుల్లో చిక్కుకున్నారు. ఇక సోషల్ మీడియా అయితే లోకేష్‌ను ఆడుకున్నంతగా మరెవరినీ ఆడుకోలేదు. మంగళగిరి బదులు ‘మందలగిరి’, గుంటూరు బదులు ‘గుంత్రు’, వర్ధంతికి బదులు జయంతి.. ఇలా అనేక పదాలు పలకలేక నానా అవస్థలు పడ్డారు. ‘ప్రపంచంలో కుల పిచ్చి, మత పిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉందీ అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే. అవునా? కాదా?’ అన్న లోకేష్ వ్యాఖ్యలు అప్పట్లో వైసీపీ సొషల్ మీడియా వింగ్‌కు బిర్యానీలా మారింది. నిజానికి లోకేష్ వ్యాఖ్యలు అటు టిడిపిని కూడా ఇబ్బందిపెట్టాయి. దానితో వైసీపీ సోషల్ మీడియా వింగ్ లోకేష్‌ను పప్పు అంటూ చేసిన వ్యాఖ్య, తర్వాతి కాలంలో స్థిరపడిపోవడానికి కారణమయింది.

 నోరు సరిగా తిరగకపోవడంతో సీఎం జగన్ కూడా సోషల్ మీడియాకు చిక్కారు. ఇటీవల సీఎం జగన్ కూడా గుంటూరును ‘గుండూరు’ అని, దిశ హత్యకు సంబంధించి ‘ఒక మహిళ టోల్ కట్టడానికని బైకు దిగితే’(సహజంగా టోల్‌గేట్ వద్ద ద్విచక్ర వాహనాలకు టోల్ కట్టరు) అన్న జగన్ వ్యాఖ్యలు.. ‘ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కన్నబాబును’ అంటూ అంబటి రాంబాబు నోరు జారి చేసిన వ్యాఖ్య.. ‘మేమంతా ఒకటే లైనులో వెళుతున్నాం. అవినీతిపాలన చేయడమే లక్ష్యమని మా జగన్మోహన్‌రెడ్డి గారు చెబుతున్నార’న్న ఓ వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్య.. జగన్ ఓ సభలో ‘సంఘ సస్కర్తలు’, ‘రాజక సౌద్దానాన్ని’ అంటూ సరిగా పలకలేకపోవడాన్ని, గతంలో ‘ఈ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన బ్రిటీషు వారంటూ’ చేసిన వ్యాఖ్యలను మళ్లీ ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చిన తెలుగుదేశం సోషల్‌మీడియా కూడా వైరల్ చేస్తోంది.అంటే లోకేష్‌కు తెలుగు రాదంటూ ఇప్పటిదాకా ట్రోల్ చేస్తున్న వైసీపీ ప్రచారానికి కౌంటర్‌గా, టిడిపి సోషల్ మీడియా వింగ్ కూడా ‘జగన్‌కూ తెలుగు రాదని’ ప్రచారం చేయడంలో సఫలమయింది. తెలుగు విషయంలో ఇబ్బందులు పడే ప్రముఖులకు సాదాసీదా భాషలో ప్రసంగం తయారుచేయకపోవడమే, గతంలో లోకేష్, ఇప్పుడు జగన్ సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది.ఇక ప్రస్తుత ఏపీ అసెంబ్లీ సమావేశాల్లోనూ మాట్లాడుతున్న బూతులు, విసురుకుంటున్న సవాళ్లు తెలుగు భాషకు అవమానంగా నిలిచేవే. గతంలో టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమ వైసీపీ సభ్యులను ‘రేయ్’ అంటూ వాడిన భాష, అందుకు ప్రతిగా కొడాలి నాని వంటి సభ్యులు వాడిన భాష సభ ప్రతిష్ఠను దిగజార్చాయి. తాజాగా విపక్ష నేత చంద్రబాబు నాయుడును మార్షల్స్ అడ్డుకున్న క్రమంలో ఆయన బాస్టర్డ్ అని సంబోధించారంటూ, సీఎం జగన్ చూపిన వీడియో సంచలనం సృష్టించింది. అయితే అందులో ఆ పదం వినిపించలేదు. ‘యూజ్‌లెస్‌ఫెలో’ అన్న మాటలు మాత్రమే వినిపించాయి. అది వేరే విషయం. ముఖ్యంగా అప్పుడు, ఇప్పుడు టిడిపి సభ్యుడు అచ్చెన్నాయుడు భారీ శరీరంపై వైసీపీ సభ్యులు సభలో చేస్తున్న రన్నింగ్ కామెంటు,్ల సోషల్ మీడియాను ఆకర్షిస్తున్నారు. దున్నపోతులా శరీరంగా పెంచడం కాదు. కొంచెం బ్రెయిన్ పెంచమంటూ, అధికారపక్షం బెంచీల నుంచి వినిపిస్తున్న కామెంట్లు శాసనసభకు ఏమాత్రం శోభనివ్వవు.గతంలో రోజాను ఇలాగే టిడిపి సభ్యులు విమర్శించారు. ఆమెపై బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్య వివాదం సృష్టించింది. గత సభలో బొండా ఉమ, కొడాలి నాని, రోజాలు ఇలాంటి తిట్ల పురాణంలో ముందుండగా, ఇప్పుడు కొడాలి సింహభాగంలో నిలిచారు. సీఎం జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వలేదన్న టిడిపి, బిజెపి విమర్శలను తిప్పికొట్టే సందర్భంలో ‘తిరుపతిని వాడి అమ్మ మొగుడు కట్టించాడా?.. సన్నబియ్యం ఇవ్వలేదన్న దేవినేని ఉమ చేసిన విమర్శలను తిప్పికొడుతూ ‘సన్నబియ్యం ఇస్తానన్న సన్నాసి ఎవరు? సన్న బియ్యం ఇస్తానని నీ అమ్మ మొగుడుకు చెప్పానా’ అంటూ.. కొడాలి నాని వాడిన దిగజారుడు భాష శాసనసభకే కాదు, శాసనసభ్యుల గౌరవం పెంచదు. సభలో లైవ్‌కాస్టుకు అందకపోయినా సభ్యులు చేసుకునే విమర్శలు, బూతులు అక్కడ ఆ దృశ్యాలను వీక్షించే జర్నలిస్టులకు వినిపిస్తూనే ఉంటాయి. కనిపిస్తూనే ఉంటాయి.శాసనసభ హుందాతనం,తెలుగుభాష ఔన్నత్యాన్ని దిగజారిస్తే పోయేది తెలుగువారి పరువేనన్న విషయాన్ని ఎవరూ గ్రహించకపోవడమే విచారకరం.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Surya Online News website
Address:
Marthi Subramanyam
Phone:
9705311144.
Email:
admin@suryaa.co.in
Scroll
X