సకుటుంబ సపరివార సమేత సమరం

రాజధాని పోరులో నారా-నందమూరి ఫ్యామిలీ

బ్రహ్మణి, భువనేశ్వరి మద్దతు

త్వరలో బాలకృష్ణ, వసుంధర

పదునెక్కుతున్న బాబు పోరాటం


(మార్తి సుబ్రహ్మణ్యం)


అమరావతి... ఇప్పుడు ఏపీలో ఎక్కడ విన్నా వినిపించే పేరు ఇదే.  రాజధాని అమరావతిలోనే ఉంటుందా? విశాఖకు పోతుందా? అన్నది ప్రధానాంశమయితే.. రాజధాని కోసం అక్కడి రైతులు చేస్తున్న ఆందోళన ఎక్కడి వరకూ వెళుతుంది? అందులో వారి పోరాటం ఫలిస్తుందా? లేదా? అన్న ప్రశ్నలు ఉత్కంఠగా మారాయి. అయితే.. వీటితో సంబంధం లేకుండా రాజధాని రైతులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు.  వారికి మద్దతుగా మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష ఆందోళనకు దిగడంతో అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

సహజంగా విపక్షంలో ఉన్నప్పుడు బాబు మెదడు పాదరసంలా పనిచేస్తుంది. సర్కారును ఇబ్బందిపెట్టడంలో విపక్ష నేతగా ఆయనకున్న అనుభవం అపారం. ఆ అనుభవంతోనే ఇప్పుడాయన రాజధాని పరిరక్షణ ఉద్యమ నేతగా అవత రించారు. అన్న ఎన్టీఆర్ తరహాలో అల్లుడు చంద్రబాబు కూడా బాధితుల కోసం జోలె పట్టి అందరినీ ఆకర్షిస్తున్నారు. నాడు ఎన్టీఆర్ దివిసీమ ఉప్పెన బాధితుల కోసం జోలె పడితే, ఇప్పుడు బాబు అమరావతి పరిరక్షణ ఉద్యమం కోసం జోలె పడుతున్నారు. అమరావతి రాజధాని ఉద్యమం కేవలం 29 గ్రామాలకే పరిమితమయిందన్న విమర్శల నేపథ్యంలో, బాబు తన నిరసన ఉద్యమాన్ని అనంతపురం, చిత్తూరు, పశ్చిమగోదావరి వరకూ విస్తరింపచేశారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఒకరకరంగా రాజధాని తరలింపు అంశం చంద్రబాబును మళ్లీ జనంలోకి వెళ్లేలా చేసింది. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం వైసీపీకి మద్దతునిస్తున్నందున, వారిపై ఆరోపణల దాడికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న చంద్రబాబుకు రాజధాని మహిళా రైతులపై పోలీసుల దాడి అంశం కలసివచ్చింది. పండుగ రోజు గ్రామాల్లో తయారుచేసిన నైవేద్యాన్ని, బెజవాడ కనకదుర్మ ఆలయానికి పాదయాత్రగా తీసుకువెళుతున్న మహిళా భక్తులపై,పోలీసులు లాఠీచార్జి చేసిన వైనం జాతీయ మీడియా దృష్టినీ ఆకర్షించింది. ఈ అంశం హిందువుల మనోభావాలపై దాడి అనే అంశం దిశగా అడుగులేసింది. ఇది కూడా చదవండి.. ‘ అమరావతికి అమ్మవారి సెంటి‘మంట’ ’...  ఫలితంగా అది జాతీయ అంశంగా మారి మహిళా హక్కుల కమిషన్ స్వయంగా బెజవాడకు వచ్చేలా చేసింది. వెంటనే హైకోర్టు కూడా సర్కారుకు అక్షింతలు వేసింది. ఇవన్నీ రాజధానిని అక్కడే ఉంచేందుకు పనికివస్తాయా? రావా? అన్నది పక్కకుపెడితే.. చంద్రబాబు నాయుడును జనంలోకి తీసుకువెళ్లేందుకు మాత్రం కచ్చితంగా అక్కరకొస్తాయని మాత్రం నిజం.

అమరావతి రాజధాని కోసం బిజెపి అగ్రనేత కన్నా లక్ష్మీనారాయణ, ఎంపి సుజనా చౌదరి, పురంధ్వీరితోపాటు స్థానిక నేతలంతా రైతుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. కన్నా లక్ష్మీనారాయణ ఒక అడుగు ముందుకేసి, ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన చోటనే మౌన దీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో హటాత్తుగా చంద్రబాబు భార్య, ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి రాజధాని రైతుల వద్దకు రావడం చర్చనీయాంశమయింది. ఇది కూడా చదవండి.. ‘ నారా అమ్ములపొదిలో నందమూరి కార్డు ’ రైతుల ఉద్యమానికి ఆమె తన గాజు విరాళంగా ఇవ్వడంపై ప్రశంసలు, విమర్శలూ వెల్లువెత్తాయి. ఆ రకంగా ఆమె రంగప్రవేశం ఒకరకంకగా విజయవంతమయినట్లే. మళ్లీ సంక్రాంతి పండుగ రోజు చంద్రబాబు, భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి రైతుల మధ్య పండుగుచేసుకున్నారు. దీక్షలో ఉన్న రైతులకు బ్రహ్మణి తీసుకువచ్చిన అరిసెలు పంచిపెట్టారు.

పైగా.. రెండు సందర్భాల్లో భువనేశ్వరి చేసిన ప్రసంగాలు కూడా ఆకట్టుకున్నాయి. తన భర్త ఎప్పుడూ అమరావతి గురించే ఆలోచిస్తుంటారని, ఆయనకు తన కుటుంబం కంటే రాజధానిపైనే ఎక్కువ ప్రేమ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆకర్షించాయి. మహిళలపై దాడులు చేయడం దుర్మార్గమని, మహిళలు తలచుకుంటే ఏదైనా చేస్తారని హెచ్చరించడం బట్టి.. భువనేశ్వరి క్రమంగా రాజకీయ ప్రసంగాలకు అలవాటుపడుతున్నట్లు అర్ధమవుతుంది. ఇక త్వరలో బాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ కూడా, రాజధాని పరిరక్షణ ఉద్యమంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన రంగంలోకి దిగితే నందమూరి-నారా కుటుంబం అమరావతి ఉద్యమానికి అంకితమయినట్లే.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Surya Online News website
Address:
Marthi Subramanyam
Phone:
9705311144.
Email:
admin@suryaa.co.in
Scroll
X