– సీనియర్ల మద్దతు కూడా ఆయనకే
( మార్తి సుబ్రహ్మణ్యం)
రాజ్యసభ మాజీ ఎంపి, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్‌ను ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు వ్యవహారాలు పర్యవేక్షించారు. ప్రధానంగా ఎన్నికల సంఘంపై ప్రతిరోజూ ఒత్తిడి చేసి, అధికార వైసీపీపై ఫిర్యాదు చేసి, వాటిని దగ్గరుండి పర్యవేక్షించారు.
సుప్రీంకోర్టులో పోస్టల్ బ్యాలెట్ కేసు సందర్భంగా, ఆ కేసును కూడా పార్టీ తరఫున ఆయనే పరిశీలించారు. కాగా వివాదరహిత నాయకుడు, చంద్రబాబునాయుడుకు అత్యంత విధేయుడిగా పేరున్న కనకమేడల, కేంద్రప్రభుత్వ శాఖలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రభుత్వ ప్రతినిధి అవకాశం లభించవచ్చంటున్నారు. ఆమేరకు టీడీపీ సీనియర్ల మద్దతు కూడా ఆయనకే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నిజానికి ఈ పదవికి మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహన్‌రావు పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ, ఆయన తెలంగాణ టీడీపీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు. ఏపీ టీడీపీ కార్యకలాపాల్లో ఆయన భాగస్వామ్యం-పాత్ర తక్కువేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీకి సంబంధించి ఢిల్లీ వ్యవహారాల్లో గత ఐదేళ్ల నుంచీ.. కనకమేడల రవీంద్రకుమార్ చురుకుగా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నందున, ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా కూడా ఆయనకే అవకాశం దక్కవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.