-లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినికి మంత్రివర్యులు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం
-బాలయోగి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్
-రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
లక్కిరెడ్డిపల్లె: విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొని తీవ్రంగా శిక్షించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
లక్కిరెడ్డిపల్లె మండలంలోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని లైంగిక వేధింపులకు గురి కావడంతో బాలయోగి గురుకుల పాఠశాలను సోమవారం రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. విద్యార్థినిలపై లైంగిక వేధింపులకు పాల్పడడం క్షమించరాని నేరమని లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకొని తీవ్రంగా శిక్షించాలని పోలీస్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఎక్కడైనా విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లయితే బాధితులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈ సందర్భంగా లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినికి మంత్రి ప్రభుత్వం తరఫున, తన సొంత డబ్బు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు.
విద్యార్థిని చదువుకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సెప్టెంబర్ 01,వ తేదీ ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన ఇంతవరకు తమ దృష్టికి రాలేదని ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతమైతే గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేసి ఇంటికి పంపడం జరుగుతుందన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపల్ భర్త ను లక్కిరెడ్డిపల్లె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.