హిందూ ధర్మ రక్షకుడు.. జగనేనట!

అమరావతిలో ఆ ఆరెకరాల కోసమేనా?

మరి పీఠాథిపతులు, స్వాములు అసమర్ధులా?

రాజగురువు స్వరూపానందుల వారి సర్టిఫికెట్

టిటిడిలో అధర్మం, కృష్ణమ్మ హారతి రద్దుపై పెదవి విప్పరేమి స్వామీ?

విరుచుకుపడుతున్న హిందూ సంస్థలు

(మార్తి సుబ్రహ్మణ్యం)

‘కొత్తా దేవుడండీ..  కోంగత్తా దేవుడండీ

ఇతడే దిక్కని మొక్కని వారికి దిక్కూ మొక్కూ లేదండండి

నేలలో సొరగం దించాడండి దించిన సొరగం పంచాడండి

నెత్తిన చేతులు పెడతాడండి నెత్తినెట్టుకుని ఊరేగండి’

రాజాధిరాజు సినిమాలో విజయచందర్‌ను కొత్త దేవుడిగా క్రైస్తవ భక్తులకు చూపేందుకు, ఆయన బంటు నూతన్‌ప్రసాద్ చర్చి లోపల ఉన్న భక్తులను ఆకర్షించేందుకు పాడిన పాట ఇది. ‘ఈరోజు చర్చిలో పాత దేవుడి పుట్టినరోజు వేడుకలు. ఈరోజు నుంచి మా కొత్త దేవుడొచ్చాడు. ఇకపై ఎవరూ ఆ చర్చికి వెళ్లడానికి వీల్లేదు. ఇక ఈయనే మన కొత్త దేవుడ’ని అక్కడి భక్తులకు నూతన్‌ప్రసాద్ చెప్పిన డైలాగులు ప్రతి భక్తుడిని ఆకర్షించాయి. చర్చి గొప్పతనం, ఏసుప్రభువు మహిమలను ఆ సినిమాలో అద్భుతంగా చూపారు.

సరే..  ఇప్పుడు ఆ పాట గుర్తు చేసుకోవాల్సిన సందర్భమేమిటన్న  ప్రశ్న బుద్ధి జీవులకు రావచ్చు. ఎందుకంటే.. విశాఖ శారదా పీఠాథిపతి శ్రీమాన్ స్వరూపానందుల వారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గారు హిందు ధర్మ పరిరక్షుడని బిరుదు ఇచ్చారు కాబట్టి. దానిపై సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యంగ్యాస్ర్తాలు పేలుస్తున్నారు కాబట్టి!

ఇంతకూ జగన్ రాజగురువు స్వరూపానందుల వారేమన్నారో చూద్దాం. ‘ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం హిందు ధర్మ పరిరక్షణకు మనస్ఫూర్తిగా కృషి చేస్తోంది. ఏపీలో జగన్ ప్రభుత్వం మంచి పరిపాలనతో పాటు, హిందుత్వ ధర్మ పరిరక్షణకు పూర్తి సహకారం అందిస్తోంది. జగన్ ఏపీని దేశంలోనే నెంబర్ వన్‌గా చేస్తారన్న నమ్మకం నాకుంది’ అని కొనియాడారు. పైగా ఆయన మాట్లాడింది మన రాష్ట్ర భూభాగం మీద కాదు. తమిళనాడులో జరిగిన ఓ ఆధ్మాత్మిక కార్యక్రమంలో. దీనిపై సహజంగానే సోషల్ మీడియాలో చర్చ ప్రారంభమయింది.

క్రైస్తవ మతాన్ని విశ్వసించి, ఆ మేరకు ఆ మత సంప్రదాయాలు అనుసరించే జగన్ సీఎం అయ్యేందుకు తన తపశ్శక్తిని ధారపోశానని స్వరూపానందుల వారు నిర్భయంగా వెల్లడించారు. అంతేనా? జగన్‌కు  అందరి ఎదుటా ముద్దు పెట్టి తన అభిమానం చాటుకున్నారు. దానిపై హిందూ పీఠాథిపతులు నోరెళ్లబెట్టారనుకోండి. అది వేరే విషయం.

జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనతో కృష్ణా, గోదావరి పుష్కర స్నానాలు చేయించారు. రిషికేష్‌కు తీసుకువెళ్ళి పూజలు చేయించారు. దానిపై అప్పట్లో జగన్‌ను స్వామి వారి హిందూమతంలో చేర్పించారని భ్రమిస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు కూడా సాగాయి. ఒకరకంగా జగన్‌కు  ఆయనే రాజగురువు. అందుకే ఇప్పుడు ప్రభుత్వంలో జర్నలిస్టులు, భక్తులకు స్వామి వారు తన సిఫార్సుతో కొలువులు కూడా ఇప్పిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

     సరే.. జగన్ హిందు ధర్మ పరిరక్షకుడని వైజాగ్ స్వాములోరు సర్టిఫికెట్ ఇవ్వడం ఆయనిష్టం. ఎందుకంటే ఆయన స్వామి వారి ఖరీదైన, పలుకుబడి ఉన్న రాజకీయ  శిష్యుడు కాబట్టి! తన శిష్యపరమాణువు ఉన్నతి కోరడంలో గురువు గారి స్వార్ధాన్ని తప్పు పట్టాల్సిన పనిలేదు. ఆక్షేపించాల్సిన అవసరం అంతకంటే లేదు.

కానీ..హిందు ధర్మ పరిరక్షణకు మోకాలడ్డుతున్నదే జగన్ అయినప్పుడు.. ఆయన  హిందూ ధర్మ పరిరక్షకుడెలా అవుతారన్నది హిందువులు సంధిస్తున్న ప్రశ్నాస్ర్తాలు.  రాష్ట్రంలో మూడు నెలల నుంచి విజయవంతంగా కొనసాగుతున్న క్రైస్తవ అనుకూల విధానాలు, జగన్ ప్రభుత్వ హిందు వ్యతిరేక నిర్ణయాల గురించి స్వామి వారు,  ఇంకా ధర్మాగ్రహం చెందటం లేదెందుకున్న ప్రశ్నలూ సోషల్ మీడియాలో సహజంగానే ఆసక్తి కలిగిస్తున్నాయి.

 శేఖర్‌రెడ్డి అనే వ్యక్తి అరెస్టయితే, నిబంధనలకు విరుద్ధంగా  ఆయనకు టిటిడిలో ఎలా స్థానం కల్పిస్తారు? దానిపై స్వామి వారెందుకు మాట్లాడరని కొందరు భక్తులు ప్రశ్నిస్తున్నారు. చర్చి, మసీదు భూములు విడిచిపెట్టి, కేవలం హిందూ ఆలయ భూములనే పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పుడు, స్వాములోరు తన శిష్య పరమాణువును ఎందుకు మందలించలేదని లా పాయింట్లు తీస్తున్నారు. మసీదులో పనిచేసే ముల్లాలు, చర్చిలో పనిచేసే పాస్టర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలివ్వాలని జీఓ ఇచ్చినప్పుడు.. ఇదేం అధర్మమని సర్వసంగ పరిత్యాగులైన స్వాములోరు ధర్మాగ్రహం ఎందుకు వ్యక్తం చేయలేదంటున్నారు.

అసలు తన విశాఖలోనే కొత్వాలు గారు ప్రతి ఏసీపీ తమ పరిథిలోని చర్చిలకు వెళ్లి, అక్కడి పాస్టర్లతో చర్చిల రక్షణ గురించి చర్చించాలని ఉత్తర్వులిచ్చినప్పుడు, బిజెపి ధార్మక సెల్ వారు పూనుకునేంత వరకూ ఆ ఉత్తర్వు రద్దు కాలేదు. మరి సొంత జిల్లాలోనే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాములోరు ఖండించకుండా, మౌనవ్రతం ఎందుకు పట్టారని నిలదీస్తున్నారు.

తిరుమలలో స్వామి వారికి పింక్ డైమండ్ ఉండేదని, దానిని నాటి సీఎం చంద్రబాబునాయుడు తన ఇంటి నేలమాళిగల్లో దాచాడని నాడు నానా యాగీ చేసిన పెద్దలకు జవాబుగా.. స్వామి వారికి అసలు పింక్ డైమండే లేదని తాజా అధికారి ధర్మారెడ్డి చెప్పారు. మరి వెంకటేశ్వరస్వామిని అప్రతిష్ఠకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విశాఖ స్వాములోరు ఇప్పటి వరకూ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు సర్కారు కృష్ణా పుష్కరాల సమయంలో బెజవాడలో 64 దేవాలయాలను కూలగొట్టిన వైనంపై ఇదే స్వరూపానందుల వారు ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. బాబు సర్కారుకు పోగాలం దాపురించిందని శపించారు. కూల్చిన వాటిని వెంటనే కట్టించాలని గళం విప్పారు. మరి తన శిష్యుడే పాలకుడిగా వచ్చి మూడు నెలలయినా, ఆయన మెడలు వంచి మళ్లీ వాటిని అక్కడే ఎందుకు ప్రతిష్ఠించలేదని స్వాములోరిపై హిందువులు ధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 గత సర్కారు విజయవాడ కృష్ణానదీ తీరంలో ప్రవేశపెట్టిన ‘కృష్ణమ్మకు పవిత్ర హారతి’ని తన శిష్య పరమాణువు  ప్రభుత్వం రద్దు చేసి మూడు నెలలయితే, స్వాములోరు గొంత ఎందుకు పెగలలేదు?  బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బృందం అక్కడికి వచ్చి, వేదపండితులను విచారించేవరకూ.. తానే హిందు ధర్మపరిరక్షుడని బిరుదు ఇచ్చిన  జగన్‌కు ఎందుకు తెలియలేదని ప్రశ్నిస్తున్నారు. పోనీ దానిని పునరుద్ధరించాలని కన్నా లేఖ రాసినా తన శిష్యుడిని ఇప్పటి వరకూ దానిపై ఎందుకు స్పందించలేదని ఎప్పుడైనా నిలదీశారా? ఒక పీఠాథిపతి అయి ఉండీ, ఈ అధర్మాన్ని పాలకుడి రాజగురువు ఎందుకు సహిస్తున్నారని హిందూ భక్తులు నిలదీస్తున్నారు.

టిటిడిలో సుమారు 1400 మంది, శ్రీశైలం, అమరావతి, సింహాచలం, అన్నవరం, కనకదుర్గ ఆలయాల్లో లెక్కలేనంత మంది అన్యమతస్తులు పనిచేస్తుంటే, వారిని తొలగించాలని ఉద్యమించకుండా.. స్వాములోరు ఎక్కడ సుఖనిద్రలో ఉన్నారని భక్తులు సోషల్ మీడియాలో కన్నెర్ర చేస్తున్నారు.

 అటు విశాఖ శారదా పీఠాథిపతి..  జగన్ హిందూ ధర్మ పరిరక్షుకుడని బిరుదు ఇవ్వడంపై హిందు సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ ప్రకారంగా అనేక పీఠాలు, స్వాములు  హిందూ ధర్మపరిరక్షణకు పనిచేయడం లేదా? అని ఆగ్రహిస్తున్నాయి. రాష్ట్రంలో ఓ వైపు జగన్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటే, దానిని ఎదుర్కొని పీఠాథిపతులు, హిందూ సంస్థలను ఏకం చేసి, సర్కారు మెడలు వంచాల్సిన స్వరూపానందుల వారు.. జగన్ హిందూ ధర్మ పరిరక్షుకుడని కితాబు ఇవ్వడం ఏమిటని మండిపడుతున్నారు. మరి రాజగురువుల వారేమంటారో?

ఇంతకూ విశాఖ స్వాములోరు ఇంతగా జగన్ సర్కారు పల్లకీ ఎందుకు తాదాత్మ్యంతో మోస్తున్నారన్న ఆసక్తికరమైన చర్చ కూడా  జరుగుతోంది. ఈమధ్యనే మరో శిష్యుడైన తెలంగాణ సీఎం,  స్వామి వారి పీఠానికి ఖరీదైన ప్రాంతంలో కారుచౌకగా రెండకరాలు ప్రసాదంగా ఇచ్చారు.  మరి ఏపీలో లేకపోతే ఎలా? ఆ ప్రకారంగా అమరావతిలో కూడా ఆరెకరాల స్థలం ఇచ్చేందుకు తన శిష్యుడైన జగన్ సిద్ధమయ్యారట. ఆ మేరకు రంగం సిద్ధమయందట. అందుకే శిష్య పరమాణువు చేసే ప్రతి పనీ రాజగురువు గారికి ముద్దుగా అనిపిస్తుందేమోనని హిందూ సంస్థ నేతలు చెబుతున్నారు. అదీ.. స్వాములోరు జగన్‌కు హిందు ధర్మ పరిరక్షకుడని బిరుదు ఇవ్వడం వెనుక చిదంబరహస్యమన్న మాట!


 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X