– ప్రభుత్వ పాఠశాల, కాలేజీ, వర్శిటీలను నిర్లక్ష్యం చేస్తే అది ప్రజాద్రోహమే
– మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– మొగిలిగిద్ద గ్రానానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు
– గ్రామంలో పాఠశాల నూతన భవనం, గ్రంధాలయ భవన నిర్మాణాల కోసం రూ.10 కోట్లు మంజూరు
– గ్రామంలో CC రోడ్ల నిర్మాణాల కోసం(మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం) క్రింద రూ.5కోట్ల రూపాయల మంజూరు
– గ్రామ పంచాయతి కార్యాలయ నూతన భవన నిర్మాణానికి రూ.50 లక్షలు
– ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.50 లక్షలు
మొగిలిగిద్ద: ఈ గ్రామాన్ని, పాఠశాలను అభివృద్ధి చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ విజ్ఞప్తి చేశారు. 150 సంవత్సరాల ఈ పాఠశాల గొప్పతనాన్ని వివరించారు. హైదరాబాద్ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావులాంటి వారిని ఈ పాఠశాల మనకు అందించింది. ఎంతో మంది మేధావులను అందించిన పాఠశాల ఇది.
తెలంగాణలో ఈ గ్రామాన్ని, పాఠశాలను అభివృద్ధి భావితరాలకు ఒక చరిత్రగా అందించాల్సిన అవసరం ఉంది. అందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని విద్యార్థులకు అందించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ గ్రామానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను మంజూరు చేశాం.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 11 వేల మంది ఉపాధ్యాయులను నియమించి పాఠశాలలను బలోపేతం చేశాం. 31 వేల మంది ఉపాధ్యాయుల ప్రమోషన్లు ఎలాంటి వివాదం లేకుండా పూర్తి చేశాం. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ లో డైట్, కాస్మోటిక్స్ ఛార్జీలను పెంచాం. పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ఉక్కు సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. వైస్ ఛాన్స్ లర్స్ ను నియమించి యూనివర్సిటీలను బలోపేతం చేసుకున్నాం.
ప్రొఫెసర్ల అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు వారి రిటైర్మెంట్ వయసును 65 కు పెంచాం. బడ్జెట్ లో 7 శాతం బడ్జెట్ విద్య కోసం కేటాయించాం. ప్రభుత్వ పాఠశాలల్ని, కళాశాలలను, యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తే అది ప్రజలకు ద్రోహం చేయడమే. అందుకే విద్య కోసం బడ్జెట్ ని 7 శాతం నుంచి దశలవారీగా 15 శాతం వరకు పెంచుకుంటూ వెళతాం.
సాంకేతిక నైపుణ్యం పెంచి నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. క్రీడల్లో మట్టిలో మాణిక్యాలని వెలికి తీసేందుకు త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించికోబోతున్నాం. హైదరాబాద్ ను స్పోర్ట్స్ హబ్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించి పాఠశాలల ప్రతిష్ట పెంపొందించాలి. లోపాలను సవరించుకుని విద్యా ప్రమాణాలు పెంచుకుందాం.