మహిళ స్వేచ్ఛ జీవనానికి ‘దిశ’ సమగ్ర ప్రణాళిక

Spread the love

– జాతీయ మహిళా మాక్ పార్లమెంట్ లో హోం మంత్రి సుచరిత
– స్పీకర్ స్థానంలో కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
– ‘దిశ’, 50శాతం మహిళా రిజర్వేషన్ తదితర బిల్లుల ఆమోదం

గుంటూరు : సమాజంలో మహిళ ఎవ్వరికీ భయపడకుండా స్వేచ్చగా జీవనం సాగిస్తూ సమగ్రమైన దిశలో పయనించినప్పుడే మహిళ అన్ని రంగాల్లో రాణించేందుకు మార్గం ఏర్పడుతుందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు.

శుక్రవారం ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ జాతీయ మహిళ పార్లమెంట్ -2022’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అధ్యక్షత వహించగా,
రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

కార్యక్రమం ప్రారంభంలో తిరుపతి నుంచి వచ్చిన అర్చకులు ప్రత్యేకంగా పూజాకార్యక్రమాలు నిర్వహించి, తీర్ధ ప్రసాదాలను అతిధులకు అందించారు. యువత మహిళా చైతన్య గీతాలను ఆలపించారు. అనంతరం జాషువా కల్చరల్ అకాడమీ నుంచి యువత ‘స్ర్తీ గమనం’ అనే నాటకాన్ని ప్రదర్శించి బాలికల రక్షణపై గీతాలను పాడి వినిపించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో విశాఖ పట్నం ఆంధ్రా విశ్వ విద్యాలయంకు చెందిన డిస్టెంట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ పి. ఉష రచించిన ‘ఎఫైరింగ్ స్టేటజీ ఫర్ ట్రైబల్ గాల్స్’ అనే పుస్తకాన్ని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, అతిధులు ఆవిష్కరించారు.

రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ప్రజలు,మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని కొనియాడారు. కోవిడ్ పరిస్థితులను తట్టుకొని పరిపాలనలో సమూల మార్పులు తీసుకురావడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రయోజనాలను కల్పించేందుకు చేస్తున్న కృషి కొనియాడారు. అమ్మఒడి, చేయూత, ఆసరా, ఇంటి పట్టాలు మహిళల పేరిట అందించడంతో పాటు ఇల్లు కట్టించే ప్రక్రియకు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.

తద్వారా అనేక రంగాల్లో మహిళలు స్థిర అభివృద్ధిని సాధించేందుకు బాటలు వేస్తున్నారని అభినందనలు తెలిపారు. మహిళల రక్షణ కోసం దిశా యాప్ ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు దిశా చట్టం అమలు చేసేందుకు రాష్ట్ర శాసన సభలో తీర్మానం చేసి కేంద్రం ఆమోదం కోసం పంపిన విషయాన్ని గుర్తు చేశారు. నవరత్నాల పధకాలన్నీ మహిళలను దృష్టిలో పెట్టుకొని చేసినవేనని తెలిపారు. మహిళకు భవిష్యత్తు మార్గాలను సరళం చేసి రాష్ట్రంలో ప్రతీ మహిళ తలెత్తుకుని తిరిగేందుకు మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారని కొనియాడారు.

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ కేంద్రంలో జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు వర్శిటిలో జాతీయ మహిళా పార్లమెంట్ – 2022 కార్యక్రమం నిర్వహణతో మహిళల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో మహిళా సాధికారతను సాధించేందుకు అవసరమైన 5 ముఖ్యాంశాల అజెండాను దృష్టిలో ఉంచుకొని జాతీయ మహిళా పార్లమెంట్ – 2022 కార్యక్రమం నిర్వహించామన్నారు.

ఈ సందర్భంగా మహిళా కమిషన్ కార్యకలాపాలు, కమిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చూపిన చొరవ, రాష్ట్ర మహిళా కమిషన్ నిర్వహించిన కార్యక్రమాలు, కేంద్రంలో జాతీయ మహిళా కమిషన్ అందిస్తున్న సహకారం, మహిళలకు మహిళా సాధికారత, మహిళలు పని చేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, ఆహారం, ఆరోగ్యం, విద్య, బాలలు, మహిళాసదనాల సందర్శన వంటి అంశాలను పేర్కొన్నారు.

శాసన మండలి సభ్యురాలు పోతుల సునీత మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు ప్రయోజనాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి నిరంతరం పాటు పడుతున్నారని తెలిపారు. గతంలో కన్నా ఇప్పుడు మహిళలకు అన్ని రంగాల్లో పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలను కల్పించిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.

ఉపాధ్యాయ శాసన మండలి సభ్యురాలు కల్పలత మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి నాలుగు రోజుల ముందే జాతీయ మహిళా పార్లమెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చేయడం అభినందనీయమన్నారు. గతంలో ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి మహిళా చైతన్య కార్యక్రమాలు చేపట్టలేదని నిర్వహకులను అభినందించారు. విద్యకు తగిన ప్రాధాన్యత, ఆరోగ్యపరిరక్షణ, మహిళల సంరక్షణకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆమె కొనియాడారు.

తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యురాలు డాక్టర్. ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న నేపథ్యాన్ని వివరించారు. విద్యార్ధి దశ నుంచే యువతలకు, మహిళలకు ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పధకాల ద్వారా తగిన సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. 50శాతం మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలను కల్పిస్తున్న సీఎం జగన్ కు అందరం రుణపడి ఉన్నామన్నారు.

యునిసెఫ్ (ఏ.పి. తమిళనాడు, కర్నాటక) రాష్ట్రాల ప్రతినిధి సోనీ జార్జీ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అద్భుతమైన విధానాలను అనుసరిస్తోందని పేర్కొన్నారు. సమాజంలో మహిళలకు అందిస్తున్న సహకారం అద్భుతమన్నారు. మహిళల అభివృద్ధికి కృషిచేస్తున్న ప్రభుత్వానికి తామ చిత్త శుద్ధితో తగిన సహకారం అందిస్తామన్నారు.

ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయ ఉప కులపతి పి, రాజశేఖర్ మాట్లాడుతూ మహిళల అభివృద్ధి, సాధికారితకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా తగిన రీతిలో ఎప్పుడూ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పలు విభాగలకు మహిళా హెచ్.ఓ.డి లను ఏర్పాటు చేశామని పలువురు మహిళా అధికారులను సభలో పరిచయ చేశారు. జాతీయ మహిళా పార్లమెంట్ నిర్వహణకు ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం వేదిక కావడం గొప్ప విషయమన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి సుచరిత, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తల్లి భారతిని, కార్యక్రమానికి విచ్చేసిన అతిధులను సత్కరించి మెమోంటో లను బహూకరించారు.

దిశ బిల్లు, రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం:
అనంతరం ‘జాతీయ మహిళా పార్లమెంట్ – 2022’ నిర్వహణ పేరుతో పార్లమెంట్ విధానాలు, అక్కడ మహిళ సంక్షేమం కోసం చర్చించాల్సిన ఐదు ప్రధాన అంశాలను మాక్ పార్లమెంట్ ముందుంచారు. ఇప్పటికే ఉన్న చట్టాలను బలోపేతం చేయడం – గృహహింస చట్టం, 125 సీఆర్.పీసీ, పోష్ చట్టం, వివాహ ఆర్డర్ అమలులో వయస్సు పెంపు, దిశ బిల్లు తదితర చట్టాలకు సంబంధించి సిఫార్సు చేసిన అవకాశాలతో లోపాలను పూరించడంపై చర్చించారు.
అదేవిధంగా మహిళలకు ఆర్థిక సహాయాన్ని ప్రోత్సహించడానికి మహిళల ఆర్థిక సాధికారత అంశంపై ప్రధానంగా ఫోకస్ తో చర్చించారు. లింగ సాధికారత – అన్ని పాఠ్యాంశాల్లో లింగ సున్నితత్వం/ సమానత్వంతో కూడిన కొత్త విద్యా విధానంపై ఆసక్తికర చర్చ నడిపించారు. మహిళలు, బాలికల భద్రత – దిశ యాప్. సైబర్ క్రైమ్ జోక్యం, పోస్కో కోసం అన్ని జిల్లాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు. అక్రమ రవాణా మరియు ఇతర చర్యలపై పరిశీలనాత్మకంగా చర్చించారు.

చివరి అంశంగా మహిళల ఆరోగ్యం & శ్రేయస్సు అనే ప్రధానాంశంగా చర్చించి ఆయా అజెండాలపై ఫోరమ్ నుండి చర్చ తర్వాత అంశాలవారీగా తీర్మానాలను చేశారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించిన దిశ బిల్లును, 50శాతం మహిళా రిజర్వేషన్, 21 సంవత్సరాల వివాహ వయసు పెంపు తదితర బిల్లులను మాక్ పార్లమెంట్ లో ఆమోదించారు.

సభకు పార్లమెంట్ స్పీకర్ గా వాసిరెడ్డి పద్మ, మిగతా ప్రధాన మంత్రి, ఇరత కేంద్ర మంత్రులుగా రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు గజ్జల లక్ష్మి, కర్రి జయశ్రీ, బూసి వినీత, గడ్డం ఉమ, షేక్ రుకియాబేగం వ్యవహరించగా.. ఎంపీలుగా వాసవ్య మహిళా మండలి ప్రతినిధులు కీర్తి, పోలిశెట్టి సుభాషిణి, రష్మి, కుమారి, వర్శిటీ ప్రొఫెసర్ లు విమల, సరస్వతి, విశ్వ విద్యాలయ అధ్యాపకులు, హెచ్.ఓ.డి లు, న్యాయవాదులు, పోలీసు అధికారులు, ఎన్.జి.ఒ లు పాల్గొన్నారు.

Leave a Reply