– డ్రగ్స్ బారిన పడిన కొడుకు కళ్లలో కారం పెట్టి దారికి తెచ్చిన ఓ తల్లి
– సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్న వీడియో
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలుగు రాష్ట్రాలను కదుపివేస్తున్న డ్రగ్స్ యవ్వారంలో సిన్మా స్టార్లు, పోలీసు పెద్దసార్ల పుత్ర-పుత్రికారత్నాలున్నారన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇక బాగా బలిసిన కుటుంబాల వారసుల సంఖ్యకయితే లెక్కే లేదు. వీరికి తమ సంతానాలు ఏం ఘనకార్యం చేస్తున్నాయో, ఎక్కడ తాగి తిరుగుతున్నాయో పట్టించుకునే తీరిక-ఓపిక లేదు. ఎందుకంటే వాళ్లూ డబ్బు సంపాదనలో బిజీగా ఉన్నారు కాబట్టి. దానితో హైదరాబాద్ పబ్‌లలో పెద్దోళ్లు సంపాదించిన డబ్బును పిల్లలు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. తాత్కాలిక ఆనందం ఇచ్చి అధోజగత్తులో నిలిపే డ్రగ్స్ కోసం వేలు, లక్షల రూపాయలు తగలేస్తు.. చివరాఖరకు పోలీసులకు చిక్కి, జైలు పాలవుతున్నారు.
తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఉన్న రాడిసన్ పబ్‌లో దొరికిన బాబులే ఓ ఉదాహరణ. ఈ యవ్వారంలో తమ పరువు రోడ్డుపాలు చేసిన తమ పుత్రులు-పుత్రికలకు నాలుగు తగిలించి, ముఖం ఎక్కడో చోట పెట్టుకునేందుకు ప్రయత్నించాల్సిన బలిసిన బాబులు.. మా పిల్లలు పబ్‌లో మందుపార్టీకి మాత్రమే వెళ్లారని అని వాదిస్తే.. ఇంకో సిన్మా ఆసామి తన కూతురు రేవ్ పార్టీకి వెళ్లిన మాట నిజమేనని వీడియో సాక్షిగా సెలవిచ్చారు. ఇదీ సిటీ బాబులు, వాళ్ల బాబుల కల్చర్.
సీన్ కట్ చేస్తే.. పక్కనే సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ పల్లెతల్లి.. ఇలాగే మత్తు పదార్ధాలకు అలవాటుపడిన తన కొడుకును పట్టుకుని ఉతికి ఆరేసింది. స్తంభానికి కట్టేసింది. రెక్కలు విరిచి కళ్లలో కారం పెట్టింది. దానితో మత్తుకు అలవాటుపడిన ఆ చిరంజీవి.. ఇకపై తాను మత్తుపదార్ధాల జోలికి వెళ్లనని
కాళ్లబేరానికి వచ్చాడు. అంతకుముందు.. మత్తు పదార్ధాలు తీసుకోవద్దని ఆ తల్లి ఎంత చెప్పినా వినని సదరు పుత్రుడు, తన కళ్లలో కారం పడేసరికి దారికొచ్చాడు.‘పిల్లాడిని దారిలోకి తెచ్చేందుకు నాకు ఇంతకుమించిన మార్గం కనిపించలేదు బిడ్డా. పోలీసోళ్లు ఈ డ్రగ్స్, గంజాయిలు లేకుండా చూస్తే తప్ప దీనికి పరిష్కారం లేద’ని ఆ తల్లి వాపోయింది. పిల్లల బాగోగులు పట్టించుకోకుండా, వారిని ఆబోతుల్లా వదిలేసిన సిటీ పెద్ద బాబులు, వారి బాబులకు ఈ బుద్ధి ఎప్పుడొస్తుందో? పల్లె తల్లీ.. నీకు వందనం!