ఒక రైలు ప్రయాణం….గుర్తుంచుకోవలసిన ఇద్దరు వ్యక్తులు

Spread the love

– అదీ మోదీ క్యారెక్టర్… సాటెవ్వరు?

అది 1990 సంవత్సరం వేసవి కాలం. ఇండియన్ రైల్వేస్ సర్వీస్-ట్రాఫిక్ ప్రొబేషనర్లు ఇద్దరు అమ్మాయిలు లక్నో నుండి ఢిల్లీకి ప్రయాణం చేస్తున్నారు. అదే బోగీలో ఇద్దరు ఎంపీలు కూడా వున్నారు. ఎంపీలతో పాటు ఒక డజను మంది అనుచరులు. రౌడీల్లాగా వున్న ఆ అనుచరులు ఈ అమ్మాయిల సీట్లు ఆక్రమించుకుని వాళ్లు తమ లగేజి పైన కూర్చునేలా చేయడంతో పాటు బండ బూతులతో ఘోరంగా అవమానించారు. మిగిలిన ప్రయాణీకులు, టీటీఈతో సహా మెల్లగా జారుకున్నారు. ఆ గూండాలు తమనేం చేస్తారోనని రాత్రంతా బిక్కుబిక్కుమని గడిపి ఉదయాన్నే ఢిల్లీలో దిగి పోయారు.

వాళ్లు తదుపరి ట్రెయినింగ్ అహ్మదాబాదులో చేయాల్సి వుండగా , ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి బెంబేలెత్తిపోయి తాను రానంది. ఇక మిగిలిన అమ్మాయి ఇంకో బ్యాచిమేట్ అమ్మాయితో కలిసి అహ్మదాబాదుకు ప్రయాణానికి సిద్ధమైంది.

అది రాత్రి ప్రయాణం. రిజర్వేషన్ దొరకలేదు. వెయిటింగ్ లిస్టు. ఫస్ట్ క్లాస్ బోగీ టీటీఈని కలిసి పరిస్థితి వివరించి సాయం కోరారు. అతను ఆ అమ్మాయిలనిద్దర్నీ ఒక కూపే లోకి తీసుకెళ్లాడు. అందులో ఇద్దరు మధ్య వయస్కులున్నారు. ఖాదీ బట్టలు చూస్తే రాజకీయ నాయకుల్లా వున్నారు. అమ్మాయిలిద్దరూ భయపడిపోయారు. టీటీఈ వాళ్లిద్దరూ చాలా మర్యాదస్తులనీ, తరచూ ఆ రూట్లో తిరిగే వారేనని నచ్చజెప్పి ఆ మధ్య వయస్కులకు పరిస్థితి వివరించాడు. వారు తాము ఒక మూలగా ఒదిగి కూర్చుని అమ్మాయిలకు తావిచ్చారు.

వారు తాము గుజరాత్ కు చెందిన బీజేపీ నాయకులమని పరిచయం చేసుకున్నారు. పేర్లు చెప్పారు. కానీ వీళ్లు గుర్తుంచుకునే స్థితిలో లేరు. అమ్మాయిలు తాము అస్సాంకు చెందిన IRS ప్రొబేషనర్లుగా పరిచయం చేసుకున్నారు.పిచ్చాపాటీ సాగింది. రాజకీయాలు, చరిత్ర, హిందూ మహా సభ, ముస్లిం లీగ్ ప్రారంభం లాంటి విషయాల మీద మాట్లాడుకున్నారు. వాళ్లిద్దరిలో పెద్దాయన చురుగ్గా మాట్లాడుతూ వుంటే రెండో వ్యక్తి శ్రద్ధగా వినసాగాడు.

ఒక అమ్మాయి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి అకాల మరణం ఒక మిస్టరీగా మిగిలి పోయింది అంది. వయస్సులో చిన్న వాడైన వ్యక్తి ఆ అమ్మాయి నడిగాడు ఆయనెలా తెలుసునని. తన తండ్రి అస్సాం నుంచి వచ్చి కలకత్తా యూనివర్సిటీలో చదువుకునేందుకు, ముఖర్జీ గారే స్కాలర్షిప్ ఇచ్చారని చెప్పింది. ఆ వ్యక్తి తనలో తాను గొణుక్కున్నట్లు..వీళ్లకు చాలా విషయాలు తెలుసు అన్నాడు.

అప్పుడు ఆ పెద్దాయన మీరు మా పార్టీలో ఎందుకు చేరకూడదు అని అడిగాడు. మేము అస్సాం వాళ్లం అన్నారు. అప్పుడు ఆ చిన్న వయసు వ్యక్తి మాకు అలాంటి భేదాల్లేవు. టాలెంటున్న వాళ్లకు స్వాగతం పలుకుతామన్నారు. ఇంతలో నలుగురికీ భోజనాలొచ్చాయి. బిల్లు చిన్న వయసు వ్యక్తే చెల్లించాడు.
అప్పుడు టీటీఈ వచ్చి బెర్తులు ఏర్పాటు చెయ్యలేక పోయానని చెప్పాడు. ఆ ఇద్దరూ లేచి ఏం ఫర్వాలేదు మేం సర్దుకుంటామని చెప్పి తాము కింద పరుచుకుని అమ్మాయిలకు బెర్తులిచ్చారు.

ఎంత తేడా? అంతకు ముందు రోజు రాత్రి ఇద్దరు రాజకీయ నాయకులు, వాళ్ల అనుచరులతో ఒకే బోగీలో నరకం అనుభవించారు. ఈ రోజు ఒక కూపేలో ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య నిర్భయంగా, హాయిగా నిద్ర పోయారు.తెల్లారింది. అహ్మదాబాద్ సమీపిస్తుండగా పెద్దాయన అడిగాడు మీకు వుండడానికి వసతి లేకపోతే నా ఇంట్లో సురక్షితంగా వుండ వచ్చని. చిన్నాయన మాత్రం తాను ఒక దేశద్రిమ్మరనీ తనకు ఇల్లూ గట్రా లేవని మీరు పెద్దాయన ఇంట్లో నిర్భయంగా వుండవచ్చనీ అన్నాడు. అందుకు వారు మాకు వసతి ఏర్పాటయిందని చెప్పారు.

రాజకీయ నాయకులంటే తన అభిప్రాయం మార్చుకునే విధంగా ప్రవర్తించిన ఇద్దరు గొప్ప వ్యక్తులను గుర్తుంచుకోవాలని గబగబా తన డైరీ తీసి, మళ్లీ ఒక సారి వారి పేర్లడిగి రాసుకుంది అందులో ఒక అమ్మాయి.

వారి పేర్లు. …. పెద్దాయన
శంకర్ సింగ్ వాఘేలా…
చిన్నాయన…
నరేంద్ర మోదీ.

ఆ అమ్మాయి 1995లో ఈ సంఘటనను ఒక అస్సామీ పత్రికలో రాసింది. అప్పటికి వాఘేలా కానీ మోదీ కానీ పదవుల్లో లేరు. ప్రముఖులు కాదు. ఆ అమ్మాయి పేరు…లీనా శర్మ, ఇప్పుడు జనరల్ మేనేజర్, రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టం. రెండో అమ్మాయి ఉత్పల్ పర్ణ హజారికా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రైల్వే బోర్డు.
శంకర్ సింగ్ వాఘేలా 1996లో గుజరాత్ సీయం అయ్యారు.
నరేంద్ర మోదీ 2001లో సీయం అయ్యారు.
ఈ వ్యాసం మళ్లీ ఒకసారి జూన్ 1, 2014 లో హిందూ పత్రికలో వచ్చింది.
అదీ మోదీ క్యారెక్టర్. సాటెవ్వరు?
కుక్కలు, బ్లేడు బాబ్జీలు ఎన్ని కూసినా ఆయన ఇమేజ్ మసక బారదు.

Leave a Reply