Suryaa.co.in

Andhra Pradesh

తప్పు చేసి కులానికి ఆపాదించడం ఏమిటి?

– జగన్‌కు ఏబీ వెంకటేశ్వరరావు క్షమాపణలు చెప్పాలి
– చంద్రబాబు ఆదేశాలతోనే ఏబీవీ రెచ్చిపోయాడు
– ఒక్క కమ్మకులం ఓట్లతోనే చంద్రబాబు సీఎం కాలేదు
– ఆ విషయాన్ని ఏబీ వెంకటేశ్వరరావు గుర్తుంచుకోవాలి
– జగన్‌కు కులాన్ని ఆపాదించడం చంద్రబాబు తరం కాదు
– ఏబీవీ వ్యాఖ్యలపై ఇప్పటికైనా పవన్‌కళ్యాణ్‌ స్పందించాలి
– వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ తలశిల రఘురాం

తాడేపల్లి: తప్పు చేసి ఏసీబీ కేసు ఎదుర్కొన్న రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు కుల దురహంకారంతో ప్రవర్తించడం ఏ మాత్రం సరికాదని వైయస్సార్‌సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ తలశిల రఘురాం స్పష్టం చేశారు. గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని, జగన్‌ని ఉద్దేశించి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఆయన కుల జాడ్యానికి నిదర్శనమని తలశిల రఘురాం వెల్లడించారు. ఏబీ వెంకటేశ్వరరావు వెంటనే జగన్‌ కి క్షమాపణ చెప్పాలని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన తలశిల రఘురాం డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు ఆదేశాలతోనే ఏబీ వెంకటేశ్వరరావు చౌకబారు చిల్లర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తి కృష్ణా జిల్లాలో పుట్టినందుకు బాధపడుతున్నాం. మాజీ సీఎం జగన్‌పై రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలను మా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఏబీవీ చదువుకున్న వ్యక్తిలా, ఉన్నత పోలీస్‌ ఉద్యోగం చేసిన ఐపీఎస్‌ అధికారిలా కాకుండా, గేదెలు కాసుకునే వాడిలా కులోన్మాదంతో మాట్లాడారు. అవి ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి.

పుచ్ఛలపల్లి సుందరయ్య, కాకాణి వెంటకరత్నం వంటి మహనీయులు పుట్టిన కృష్ణా జిల్లాలో ఏబీవీ లాంటి వ్యక్తి పుట్టడం మేము అవమానంగా భావిస్తున్నాం. కమ్మ కులం మొత్తం ఒకేతాటిపై నిలబడి జగన్‌ని ఓడించాలని ఏబీవీ సెలవిస్తున్నాడు. మరి కేవలం కమ్మ కులస్తులు ఓటేస్తేనే చంద్రబాబు సీఎం అయ్యారా?. ఆ విషయాన్ని ఏబీవీ గుర్తుంచుకోవాలి.

మూడు ప్రధాన పార్టీలు ఏకమైనా జగన్‌ నేతృత్వంలో ఒంటరిగా పోటీ చేసిన వైయస్సార్‌సీపీ 40 శాతం ఓట్లు సాధించిన విషయాన్ని ఏబీవీ మర్చిపోయినట్లున్నారు. అందుకే ఎన్ని కుయుక్తులు పన్నినా ఆయనకు కులాన్ని ఆపాదించలేరు. జగన్‌ ఐదేళ్ల పాలనలో కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయాలకు అతీతంగా కేవలం అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేశారు.

అలా రాష్ట్రాభివృద్ధి కోసం పని చేసి, ప్రజల మన్ననలు అందుకున్నారు కాబట్టే అంత మంది ఏకమైనా 40 శాతం ఓట్లతో ప్రజలు ఆయన్ను ఆశీర్వదించారు. ఒక కులాన్ని వర్గ శతృవుగా చూడొద్దని పవన్‌కళ్యాణ్‌ చెబుతుంటారు. ఇప్పుడు ఏబీవీ వ్యాఖ్యలపై ఆయన స్పందించాలి. లేని పక్షంలో ఆయన కూడా కులవాదాన్ని సమర్థిస్తున్నారని మిగతా కులాలు భావించాల్సి ఉంటుంది.

సోషల్‌ మీడియాలో చిన్నచిన్న పోస్టులకే కేసులు పెట్టిన ప్రభుత్వం దీనిపై ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలి. అలాగే, మా నాయకుడు జగన్‌పై వ్యాఖ్యలకు ఏబీ వెంకటేశ్వరరావు వెంటనే క్షమాపణలు చెప్పాలని మేం డిమాండ్‌ చేస్తున్నాం.

ఎవరెలాంటి వారో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు: ఏబీ ట్వీట్

తనపై వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ చేసిన ఆరోపణలపై ఏబీ వెంకటేశ్వరరావు ఎక్స్ వేదికగా స్పందించారు. చాలా సుతిమెత్తిగా చురకలు అంటిస్తూ.. సమాధానం చె ప్పలేని మీరు, ఈ అంశంలో పవన్‌ను తీసుకురావడం బట్టే మీ చిల్లర బుద్ధులు అర్ధమవుతున్నాయని ట్వీట్ చేశారు.

ఎవరెలాంటి వారో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. ముక్కలు ముక్కలు కాదు. నా మాటల వీడియో మొత్తం మీ ఛానల్ లో ప్రసారం చెయ్యండి. ప్రజలు ఏమంటారో వినండి. పవన్ కళ్యాణ్ గారిని ఇందులోకి లాగడానికి ప్రయత్నించడమే మీ బుద్ధుల్ని బయటపెడుతున్నది. మీకు మీరు కితాబు ఇచ్చుకోవడం కాదు, ప్రజలను అడగండి. మీరన్న మాటలు, మీరు చేసిన పనులు రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరచిపోరు

LEAVE A RESPONSE