– వక్ఫ్ బోర్డ్ ను వివిధ రంగాల్లో అభివృద్ధి పరచాలి
– మైనార్టీ ల ఆర్థిక స్థితి ని మెరుగుపరచాలి
– ప్రణాళిక ను త్వరితగతిన రూపొందించండి
– ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షేక్. అబ్దుల్ అజీజ్
విజయవాడ: బందర్ రోడ్డు లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ మైనారిటీ వెల్ఫేర్ కమిషనర్ శ్రీధర్ తో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వక్ఫ్ బోర్డ్ కు ఏ విధంగా ఉపయోగపడుతాయి అనే విషయం పై అధ్యయనం చేశారు. వక్ఫ్ ఆస్తులను ఎన్ని రకాలుగా అభివృద్ధి పరచగలం అనే అంశం పై సుధీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా అబ్ధుల్ అజీజ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిధులను, వక్ఫ్ ఆస్తులను ఉపయోగించి క్రీడ, వ్యాపార, పారిశ్రామిక, వ్యవసాయ, స్కిల్ డెవలప్మెంట్ రంగాల్లో వక్ఫ్ బోర్డ్ ను అభివృద్ధి పథంలో నడిపించాలని అన్నారు. ఆదాయాన్ని పెంచి, వచ్చిన ఆదాయాన్ని మైనారిటీ ల అభ్యున్నతికి ఉపయోగించాలని, తద్వారా మైనార్టీ ల యొక్క ఆర్ధిక స్థితిని మెరుగుపరచాలని అబ్దుల్ అజీజ్ అధికారులకు సూచించారు. దీనికి సంబంధించిన ప్రణాళికను త్వరితగతిన రూపొందించాలని పేర్కొన్నారు. వారితో వక్ఫ్ బోర్డ్ సీఈఓ మొహమ్మద్ అలీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అబ్దుల్ ఖాదర్ పాల్గొన్నారు.