ఏబీకే..వంకరబుద్ధితో వండివార్చిన వ్యాసమది!

ఎ.బి.కె.ప్రసాద్ గారి వ్యాసం చదివాను. పత్రికా రంగంలో ప్రగతిశీల భావాలున్న ప్రముఖులుగా పేరుగాంచిన వారు. ఆయన పట్ల నాకు గౌరవం ఉన్నది. మూడు రాజధానుల ఆలోచనను సమర్థించడానికి ఆపసోపాలుపడుతూ క్రీస్తు పూర్వం 5000 నుండి క్రీస్తు శకం 2000 సం. వరకు చరిత్ర పుటలను కూడా చకచకా తిరగేసారు. ఆ వ్యాసం చదివాక స్పందించకుండా ఉండలేక ఈ వ్యాఖ్య చేస్తున్నా.
“ఆంధ్రాలోని మచిలీపట్నంలో ఒక రాజధాని, విజయవాడలో ఒక రాజధాని, రెండేసి ప్రత్యేక కోర్టులు నడిచాయన్నది కూడా కాదనలేని మరొక సత్యం”.
“ఆమాటకొస్తే మదరాసు నుంచి విడిపోయిన తర్వాత, ప్రత్యేక ఆంధ్ర కాలంలో బెజవాడ, కర్నూలు, గుంటూరు..ఆ తర్వాత హైదరాబాదు రాజధానులుగానే వ్యవహరించాయి”.

“అది(అమరావతి) ఒక వర్గానికి చెందిన రాజధానిగా ఉండకూడదని ప్రజలు గ్రహిస్తున్నారు”. సమాజంలో పెట్టుబడిదారీ వర్గం, కార్మికవర్గం, రెండు వర్గాలు ఉంటాయని ప్రగతిశీల శక్తులుగా భావిస్తాం. అమరావతి ఏ వర్గానికి చెందినదని ఆయన భావిస్తున్నారో! దేశ రాజధానితో పాటు అన్ని రాష్ట్రాల రాజధానులు ఏ వర్గానికి చెందినవో! పాలక పార్టీ వాళ్ళు నోరుపారేసుకొన్నట్లు ఒక కులానికి చెందిందన్న భావనతోనే ఎ.బి.కె. గారు కూడా కులమన్న మాట వాడలేక “ఒక వర్గానికి చెందిందని” వ్యాఖ్యానించారో! తెలియదు.
మొత్తం మీద వ్యాసం చదివాక వంకర బుద్ధితో వండి వార్చే నేర్పరితనంతో ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఏమి ఉపకారం చేద్దామని ఈ తరహా వ్యాసాలు వ్రాస్తున్నారో! పెద్దలు వారికే తెలియాలి.– టి.లక్ష్మీనారాయణ- సామాజిక ఉద్యమకారుడు

ప్రగతిశీల భావాలను ఆయన ఎప్పుడో మడిచి లాల్చీ జేబులో కుక్కేశారు
ఎబికె గారు ఒకసారి టిబెట్ ఆక్రమణను సంపూర్ణంగా సమర్ధిస్తూ ఉదయంలో సంపాదకీయం రాశారు. అప్పటికి నాకు ఆయనతో పరిచయం లేదు. ఆయన వైఖరిని తప్పు పడుతూ ఉత్తరం రాశాను. అయన జవాబు ఇవ్వలేదు. తర్వాత కొన్నాళ్ళకు ఆయన నేను కలిసి పని చేశాం. నేను గమనించింది ఏమంటే, ఎబికె గారు అవసరం అయినప్పుడు ఎంతటి దుర్మార్గపు వైఖరి నయినా తీసుకోగలరు. ఆ అవసరం కూడా ఎప్పుడూ తన వ్యక్తిగత అవసరమే సుమా. మీరు చెప్పిన ప్రగతిశీల భావాలను ఆయన ఎప్పుడో మడిచి లాల్చీ జేబులో కుక్కేశారు. సాక్షి దినపత్రికలో ఆయన రాసే రాతలు చూస్తూ కూడా మనం భ్రమలో ఉండడం ఎందుకు?– ఆలపాటి సురేష్, జర్నలిస్టు

Leave a Reply