Suryaa.co.in

Andhra Pradesh

జాతీయ స్థాయిలో ఏఐ హ్యాకథాన్

– ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
• జూన్ 27 నుంచి 29 వరకు గుంటూరులో జరగనున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జూన్ 27, 28, 29 తేదీల్లో గుంటూరులోని ఆర్‌.వీ.ఆర్‌. అండ్ జే.సీ. ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయిలో ‘AI హ్యాకథాన్’ నిర్వహించనున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బుధవారం తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రతిష్ఠాత్మక “ఏఐ హ్యాకథాన్‌” కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

డీజీపీ మాట్లాడుతూ, పోలీసింగ్, ప్రజా సేవలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పరిష్కారాల ఆవిష్కరణే ఈ హ్యాకథాన్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ, 4SightsAI నాలెడ్జ్ పార్ట్నర్‌ సహకారంతో ఎనిమిది సమస్యలపై “ఏఐ” పరిష్కారాల కోసం ఈ హ్యాకథాన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్యలపై పరిష్కారాలు రూపొందించి, జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టులుగా ప్రారంభించి, రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయడం లక్ష్యమని చెప్పారు.

దీని ద్వారా పోలీసు వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుందని, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందుతాయన్నారు. ఇది ఒకసారి జరిగే కార్యక్రమం కాదని, పరిశ్రమల సహాయ, సహకారాలతో నిరంతరం జరిగే ప్రక్రియ అన్నారు. అలాగే, ఈ “ఏఐ” ఆధారిత పరిష్కారాలను మెరుగుపరచడం, అమలు చేయడం కోసం ప్రత్యేకంగా “PRISM” అనే కొత్త పరిశోధన, అభివృద్ధి విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు డీజీపీ తెలిపారు. త్వరలో “ఇండియా AI” సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకొనున్నట్లు తెలిపారు.

ఈ AI హ్యాకథాన్‌లో పాల్గొనడానికి ఎలాంటి ప్రవేశ రుసుం లేదన్నారు. విజేతలకు ₹10 లక్షల బహుమతులు మరియు ధృవీకరణ పత్రాలు అందచేయడం జరుగుతుందన్నారు.. ఎంపికైన జట్లకు ఉచిత వసతి, ప్రయాణ సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఐటీ నిపుణులు, సీనియర్ పోలీస్ అధికారులు, అకాడెమిక్ పరిశోధకులతో కూడిన కమిటీ ఎంపిక ప్రక్రియను నిర్వహించనున్నదన్నారు. ఇప్పటివరకు 30 జట్లు ఈ హ్యాకథాన్‌లో పాల్గొనడానికి తమ పేర్లు నమోదుచేసుకున్నాయన్నారు.

పోలీసింగ్‌లో సాంకేతికత వినియోగం పెరుగుతోందని, విజయవాడ వంటి నగరాల్లో డ్రోన్లను గస్తీల్లో వాడుతున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో సీసీటీవీ కవరేజ్‌ గణనీయంగా పెరిగిందన్నారు. ప్రజల భాగస్వామ్యంగా సమస్యలు పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ముందడుగు వేస్తోందని డీజీపీ తెలిపారు.

LEAVE A RESPONSE