Suryaa.co.in

Telangana

వ్యవసాయరంగంలో ఏఐ సాంకేతికత

– రోజువారీ సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్న మంత్రి తుమ్మల
– ఈ రోజు మరో రెండు సంస్థలతో చర్చలు
– సాగులో ఉన్న భూమి, పంటల వారి విస్తీర్ణము మరియు ముందుగానే పంట చీడల గుర్తింపు, నివారణలో ఏఐ పరిజ్ఙానాన్ని వాడుకొనే యోచనలో ప్రభుత్వం

హైదరాబాద్‌: వ్యవసాయ రంగంలో ఏఐ సాంకేతికతను వాడుకునే దిశలో భాగంగా వివిధ ఏఐ సంస్థల ప్రతినిధులతో గత రెండు, మూడు రోజులుగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

వ్యవసాయ యోగ్యమైన భూమి, సీజన్ల వారిగా పంటల విస్తీర్ణము, పంట చీడ పీడల గుర్తింపులో మనుషుల వాడకాన్ని తగ్గించి ఏఐ సాంకేతికత వాడాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని, తద్వారా రైతాంగానికి సత్వర సేవలందించడానికి అవకాశాలు ఏర్పడుతాయని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ రోజు జరిగిన సమీక్ష సమావేశంలో ఈ దిశగా ప్రొ. జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయము వారు గత మూడు సంవత్సరాల నుండి చేస్తున్న పరిశోధనల ఫలితాలను ఆగ్రోనమి ప్రొ. డా. నీలిమ, మంత్రి తుమ్మలకు తెలియజేశారు. ఇక్రిశాట్ నుండి హాజరైన ప్రతినిధులు తాము ప్రయోగిస్తున్న ఉపగ్రహ చాయాచిత్రాల వివరాలు, దాని ఆధారంగా వివిధ రాష్ట్రాలకు అందిస్తున్న సేవలను ముఖ్యంగా పంటల సాగు విస్తీర్ణాన్ని అంచనా వేయడంలో తాము అవలంబిస్తున్న పద్ధతులను తెలియజేశారు.

అగ్రివాస్ ప్రతినిధులు తాము ఉపయోగిస్తున్న ఉపగ్రహ చాయాచిత్రాలు, వాటి ద్వారా పంటలకు వచ్చే తెగుళ్లు, క్రిమికీటకాలు మరియు నీటి ఎద్దడి పరిస్థితులను ఎలా అంచనా వేయగలుగుతున్నాము, తమ పరిశోధనల ఫలితంగా రైతులు ఏ విధంగా ప్రయోజనం పొందిన విషయాలను తెలియచేశారు.

మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సూచనలతో వ్యవసాయ రంగంలో కూడా ఏఐ సాంకేతికత ఉపయోగించుకొని, రైతులకు ప్రభుత్వం ద్వారా అందే సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయుటకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని తెలిపారు. ఈ వానాకాలం నుండి పైలట్ పద్ధతిలో అందుబాటులో ఉన్న అన్ని రకాల టెక్నాలజీని వాడుకొని, అన్నింటికంటే రైతులకు ప్రయోజనకరంగా ఉన్న పద్ధతులను రాష్ట్రమంతటా విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉన్నదని మంత్రి తెలిపారు.

ఈ సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి , వ్యవసాయశాఖ సెక్రటరి రఘునందన్ రావు , వ్యవసాయ అధికారులు, యూనివర్సిటీ అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE