రోడ్ల నిర్మాణాలు రివ్యూలతోనే కాలక్షేపం – పేపర్లకే పరిమితం

– జగన్ రెడ్డి రివ్యూలకు చేసిన ఖర్చు కూడా రోడ్ల కోసం చేయలేదు
– బిల్లులు పెండింగ్ పెట్టి కాంట్రాక్టర్లను రోడ్ల పాలు చేశారు
– మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్

రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోగా రివ్యూ, ప్రకటనలకే పరిమితం అయ్యింది. పాలన లేకుండా ప్రజల గోడును పట్టించుకోని ఏకైక ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం. వైసీపీ పాలనలో అధికారంలో వచ్చిన తరువాత 2020 అక్టోబర్ 13న రోడ్ల నిర్మాణంపై రివ్యూ చేసి సాగిపోదాం సాఫీగా అంటూ బులుగు పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్డింగ్ లతో ప్రకటనలు ఇచ్చుకున్నారు.

31 జులై 2021న మళ్లీ రివ్యూ చేసి రోడ్లపై ప్రత్యేక శ్రద్ధ అని ప్రకటనలు ఇచ్చారు. అక్టోబర్ 2020 నుంచి జులై 2021 వరకు ఏ ఒక్క రోడ్డు బాగుపడలేదు సరికదా కనీసం మరమ్మత్తులు చేసిన దాఖలాలు లేకపోగా సెప్టెంబర్ 7, 2021న రోడ్ల మ్యాప్ రడీ అని మరో రివ్యూ చేయడం జరిగింది. ఆ తరువాత నవంబర్ 16, 2021లో మరమ్మత్తులకు రోడ్ మ్యాప్ సిద్ధం అంటూ రివ్యూ చేశారు.

వర్షాలు తగ్గటమే ఆలస్యం 2,205 కోట్లు రోడ్ డవలప్ మెంట్ కార్పొరేషన్ అప్పుతో 8,212 కి.మీ. రోడ్ల వేయబోతున్నామని చెప్పారు. జగన్ రెడ్డి రోడ్ల మీద చేసిన రివ్యూలు కేవలం పేపర్లకే పరిమితం అయ్యాయి తప్పా ఎక్కడా కార్యచరణ రూపుదాల్చలేదనేది వాస్తవం. మళ్లీ నిన్న చేసిన రివ్యూలో వడివడిగా నిర్మాణాలంటూ ప్రకటనలు ఇచ్చుకున్నారు.

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లల్లో రివ్యూల కోసం చేసిన ఖర్చులో భాగం కూడా రోడ్ల కోసం ఖర్చు చేయకపోవడం దురదృష్టకరం. బులుగు మీడియాలో బిల్డప్ లు, తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ అసమర్ధ పాలన చేస్తున్నారు. జగన్ రెడ్డి హయాంలో ఇప్పటి వరకు రూ.15 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ నిధుల కింద ఖర్చు చేశారు.

అప్పులాంధ్రప్రదేశ్ గోతుల రాష్ట్రంగా మార్చిన గొప్ప పాలన జగన్ రెడ్డి. కాంట్రాక్టర్ లకు పెండింగ్ బిల్లులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. మీచర్యలకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. నిధులను పక్కదారి పట్టించారు. ఒక వైపు రోడ్ల నిర్మాణాలు బ్రహ్మంఢంగా సాగుతున్నాయని వైసీపీ నాయకులు చెబుతుంటే మరో వైపు కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి. గతంలో తెలుగుదేశం హయాంలో 25 వేల కి.మీ. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేశారు. రూ.3,690 కోట్లతో 6,694 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాల కోసం ఖర్చు చేస్తే నేడు జగన్ రెడ్డి ఆ స్థాయిలో ఎందుకు పనులు చేయించలేకపోతున్నారు?

ఎందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేకపోతున్నారు? స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఇటువంటి దుస్థితి లేదు. కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు ఇస్తారా లేదా? అని భయం వేసి పనులు చేపట్టడానికి ముందుకు రావడం లేదు.

రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, పనులు ఎక్కడా జరగటం లేదని వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్వయంగా చెప్పారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఏ ఒక్క జిల్లాలోను చెప్పుకోలేని స్థితిలో రోడ్లు ఉన్నాయి. అంతే కాకుండా స్వయానా ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోను రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండటం సిగ్గుచేటు.

నాడు చంద్రబాబు నాయుడు బిల్డ్ ఏపీతో రాష్ట్రాన్ని బాగు చేస్తే నేడు జగన్ రెడ్డి సేల్ ఏపీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడ ఆస్తులుంటే అక్కడ తాకట్టు పెట్టడం. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియకుండా ఇసుక, భూకబ్జాలు, మైనింగ్ మాఫియాలు తయారయ్యాయి. మద్యపాన నిషేధం పేరుతో ప్రజలను మోసగించి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు.

ఇంత దరిద్రంగా, దౌర్బాగ్యంగా ఏ ఒక్కరి ప్రభుత్వ పాలనలో లేదు. గత ప్రభుత్వం మహాత్మా గాంధీ స్పూర్తికి నిదర్శనంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేశారు. కాని నేడు రోడ్లను అధ్వాన స్థితికి దిగజార్చారు. రోడ్లకు కనెక్టివిటీలను తెంచేస్తున్నారు. వర్షాలు పడితే రోడ్ల మీద ఈదే పరిస్థితి రావడం సిగ్గుచేటు.

Leave a Reply