*జగన్ పాలన కు తెలుగు ప్రజలు తిలోదకాలు ఇచ్చి 16 నెలలు దాటింది. …. వ్యవస్థికృతం అయిన ఆ క్లెప్టోక్రసీ స్థానం లో చంద్రబాబు(కూటమి) పాలన వచ్చింది. ఈ కూటమి, దూకుడు పోకడలను పక్కనబెట్టి ; తమకు అవకాశం ఎందుకు వచ్చిందో ఒక్క క్షణం ఆలోచించుకున్నారో…లేదో తెలియడం లేదు . కూటమికి ఇది ‘పాజిటివ్ ‘ ఓటు కాదు. జగన్ పై ఇచ్చిన ‘నెగటివ్ ‘ ఓటు అనే స్పృహ అయినా కూటమి నేతలకు ఉన్నదో ….లేదో తెలియడం లేదు .
మరి, జగన్ పై తెలుగు ప్రజలు, ఇంతటి అనూహ్యమైన ‘ నెగటివ్ ‘ తీర్పు ఎందుకు ఇచ్చారు? కూటమి నేతలు ఆలోచించారా!?. తెలియదు .
తెలుగు ప్రజలు కోటి ఆశలు పెట్టుకుని, 151 స్థానాలతో అధికారం లోకి తీసుకు వచ్చిన జగన్ పాలనను ఎందుకు సంపూర్ణం గా, సమగ్రం గా, ఏక మొత్తం గా ఎందుకు తిరస్కరించారు ? ఓట్లను చిల్లరగానో… టోకునో కొనడానికి డబ్బు షార్టేజ్ వచ్చి (అంటే బ్లాక్ మనీ అందుబాటులో లేక ), జగన్ పార్టీ ఓడి పోయిందా?
లేక, ఓటర్లకు పోయడానికి మందూ, మాకూ సరిగ్గా పంపిణీ కుదరక ఓటర్లు జగన్ అభ్యర్థులను తిరస్కరించారా? ముస్లిం లు, తన తోటి క్రిస్టియన్లు, రెడ్డి కులం మొదలైన వర్గాలలో అత్యధికులు మద్దతు పలికినా…. 40 శాతం ఓటింగ్ బలం ఉన్నప్పటికీ జగన్ పార్టీ ఎందుకు అంత ఘోరాతిఘోరం గా ఓడిపోయింది?
అసెంబ్లీ కి పోటీ చేసే అభ్యర్థులు 40 లక్షలకు మించి వ్యయం చేయగూడదని కేంద్ర ఎన్నికల సంఘం విధించిన పరిమితిని మించి ; విలువలకు కట్టుబడిన తమ అభ్యర్థులు ఖర్చు చేయలేక పోవడం వల్ల జగన్ పార్టీ ఓడిపోయిందా ?
వైసీపీ ఎన్నికల అక్రమాలకు సహకరించే పోలీసులు , ఎస్ ఐ లు, సీ ఐ లు, డీ ఎస్ పీ లు,ఎస్పీలు , డీ ఐ జీ లు, డీ జీ పీ, కలెక్టర్లు , ఐపీఎస్ లు , సీ ఎస్,దొంగ ఓట్లు జాబితాలో చేర్చే ఐఏఎస్ లు లేక ….జగన్ పార్టీ ఓడిపోయిందా ?
ఇన్ని రకాల వనరులు, డబ్బు వాములు ( గడ్డి వాముల తరహాలో ),మనుషులు, నీతుల బ్యాచ్ లు, వై. ఎస్. రాజశేఖర రెడ్డి లెగసీ ఉండి కూడా జగన్ పార్టీకి… 151 సీట్ల స్థానం లో 11 సీట్లు మాత్రమే వచ్చాయి .
రావు గోపాలరావు భాషలో చెప్పాలి అంటే…. జగన్ పార్టీ కి వచ్చిన ఈ సీట్లు- హ్యాండ్ కర్చీఫ్ కు ఎక్కువ…. గోచి కి తక్కువ. ఇక ఎక్కడా వంటి మీద నూలుపోగు అనేది లేకుండా చేశారు. ఓటర్లు ఇలా ఎందుకు చేశారో..కూటమి నేతలు ఎప్పుడైనా సింహావలోకనం చేసుకున్నారో…. లేదో తెలియదు.
ఇది చరిత్ర. ఇప్పుడు కూటమి పాలన లో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. 164 సీట్ల బలం తో ఉన్నది. అసెంబ్లీ లో మెజారిటీ కి కావలసింది… ముష్టి 88,90 స్థానాలే. అంటే… అవసరమైన వాటికంటే, ఇంకో 75 స్థానాలను ఓటర్లు కూటమికి అదనంగా ఇచ్చారు.
ఈ ప్రభుత్వాన్ని రాజకీయం గా పడగొట్టడం ఎవరికీ సాధ్యమయ్యే పని కాదు. .
ఇంగ్లీష్ లో ఓ సామెత / నానుడి ఉంది. ఒక సంఘటన జరగడం అనివార్యమైనప్పుడు ; దానిని అస్వాదించడమంత ఉత్తమం మరొకటి లేదు అనేది ఆ ఇంగ్లీష్ సామెత సారాంశం.
అక్కడ, నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాన మంత్రి కావడం, దానికి కూడా “తెలుగుదేశం ” అనే ఊత కర్ర సాయం కావలసి రావడం అనేది అనివార్యమైన ఘటన. ఈ అనివార్య సంఘటననే ప్రధానమంత్రి ఆస్వాదిస్తున్నారు.
బీజేపీ కి తగ్గి, తెలుగుదేశం కు లోకసభ సీట్లు పెరగడం ద్వారా ఢిల్లీ లో …..నీటి బుడగల్లా పైకి ఉబికిన రాజకీయ గౌరవాన్ని చంద్రబాబు నాయుడు కూడా పూర్తిగా అస్వాదిస్తున్నారు.
అందుకే, ఒకరిని ఒకరు ఆకాశానికి “ఎత్తేసు”కుంటున్నారు.
ఈ “సరికొత్త” రాజకీయ బంధం లో…. మన కూటమికి మించిన రాజకీయ క్లౌట్…బహుశా దేశం లోని మరో ప్రాంతీయ అధికార కూటమికి లేదంటే ఆశ్చర్యం అవసరం లేదు.
ఏ పథకం కోసమైనా… చంద్రబాబు కాకితో ఢిల్లీ కి కబురు పెడితే ; మరుసటి రోజుకల్లా ఆ పధకం రెక్కలు కట్టుకుని అమరావతి వస్తున్నదనే భావం రాజకీయ వర్గాలలో ఉన్నది. బనక చర్ల మీద మేధావి వర్గాలలోనూ , తెలంగాణా ప్రభుత్వం లోనూ అంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, చంద్రబాబు ….”బనక చర్ల ….బనక చర్ల “ అంటూండడానికి – ఢిల్లీ లో పెరిగిన యీ పలుకుబడి కారణమన్నది పలువురు పరిశీలకుల భావన .
అంత రాజకీయ బలవంతుడి గా కనబడుతున్న చంద్రబాబు నాయుడు ….. తన వ్యవహార శైలిలో అత్యంత బలహీనుడిగా ప్రజలకు కనిపిస్తున్నారు . రాష్ట్రం లో జరిగే ప్రతి చిన్న సంఘటనకూ అతి గా స్పందిస్తున్నారు . పవన్ కళ్యాణ్ ను చూసి అతిగా భయపడుతున్నారు అనే భావం ప్రజలకు కల్పిస్తున్నారు . ప్రజలలో కలుగుతున్న యే భావన ….తెలుగుదేశం పార్టీ కి భారీ నష్టం కలిగిస్తున్నది .
ఈ “బలహీనత”ను జగన్ బాగా క్యాష్ చేసుకుంటున్నారు .
ఇక్కడ అసెంబ్లీ లోను,అసెంబ్లీ బయట రాష్ట్రం లోను, అక్కడ ఢిల్లీ లోను అంతటి బలం కలిగినప్పటికీ ; కూటమి మంత్రుల చేత…. జగన్, తన నామస్మరణ చేయించుకుంటున్నారు .
జగన్ వ్యూహం ఇంకా కూటమి నేతలకు అర్ధమైనట్టు లేదు.
చంద్రబాబు నేతృత్వంలో నడిచే ప్రభుత్వం పై జగన్ రోజూ ఏవో ఆరోపణలు చేస్తుంటారు. సత్యాసత్యాలతో ఆయనకు ఎప్పుడూ పని లేదు కదా! చంద్రబాబు & కో పై ఈ రోజు ఎంత బురద , అశుద్ధం జల్లాము అన్నదే జగన్ కు ప్రధానం. ఇక కూటమి నేతలు దానిని కడుక్కోడానికి రోజువారీగా ఆపసోపాలు పడడం తో పుణ్యకాలం కాస్తా గడిచిపోతున్నది.
జగన్ &కో చెప్పేవి అన్నీ అసత్యాలే అని జనానికి తెలుసు కదా… మరి కూటమి నేతలెందుకు హైరానా పడిపోవడమో అర్ధం కాదు. పట్టించుకోవడం 100 శాతం, పూర్తిగా మానేస్తే…. జనం కూడా అర్ధం చేసుకుంటారు కదా! ఈ స్పృహ కూటమి నేతలకు లేదు . చంద్రబాబుకు లేదు . లోకేష్ కు లేదు . ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు…. రోజూ ఒకసారైనా జగన్ పాలనను ప్రత్యక్షం గానో…. పరోక్షంగానో తలవని రోజు ఉండడం లేదు అనిపిస్తున్నది.
రోజూ జగన్ ను విమర్శించడం వల్లనో, దెప్పి పొడవడం వల్లనో, హేళన చేయడం వల్లనో… తమకు రాజకీయంగా మైలేజ్ వస్తుందని కూటమి నేతలు భావిస్తున్నారేమో తెలియదు.
మాట వరసకు, పర్యాటక శాఖమంత్రి కందుల దుర్గేష్ ఉన్నారు. ఏ కళాకారుడికో ఓ దుశ్శాలువా కప్పుతారు. వెంటనే, ” జగన్ ప్రభుత్వం లో కళాకారులను పట్టించుకోలేదు…. కూటమి ప్రభుత్వం లో కళాకారులు ఆనంద డోలికల్లో ఓలలాడుతున్నారు. ముఖ్యమంత్రి…. ఉప ముఖ్యమంత్రి సూచనల మేరకు ఇంత చేస్తున్నాం …. ” అంటారు.
నిమ్మల రామా నాయుడు ఉన్నారు . నీటి పారుదల శాఖమంత్రి. ఏ కాలువలోకో లాకులు ఎత్తి నీరు వదులుతారు . ” జగన్ ఒక్క కాలువ లోకి కూడా చెంబుడు నీళ్లు వదల లేదు… ప్రజలు తెల్లవారు జామున కాల కృత్యాల కోసం ….కాలువ గట్లకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడేవారు” అని అంటారు.
ఆనం రామానారాయణ రెడ్డి. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి. వీలైనంత మృదువుగా మాట్టాడతారు. పరుషం గా మాట్టాడడం ఆయనకు తెలియదు . దేవాదాయ శాఖ మంత్రి కాబట్టి; ఏ గుడి కో వెడతారు. పూజారి గారు హారతి ఇచ్చి, శఠ గోపం పెట్టి, చేతిలో కొబ్బరి చిప్ప, ప్రసాదం పెడతాడు. వెంటనే…. ” జగన్ హయాం లో ఏ గుడిలోనూ దీప దూప నైవేద్యాలు సరిగ్గా జరగలేదు…. ” అంటూ విమర్శిస్తారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. “ఇదివరకు ఓ రాక్షసుడు ఉండేవాడు. ప్రజలు బుద్ధి చెప్పారు…” అంటారు. పవన్ కళ్యాణ్…. ఉప ముఖ్యమంత్రి. ” మహిళలంతా సత్యభామల్లా ఆ నరకాసురుడికి బుద్ధి చెప్పాలి…. ” అంటారు.
ఇక, అనగాని సత్యప్రసాద్, పార్ధసారధి వంటి మంత్రులైతే నిత్య పారాయణమే.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్… నిత్యం చెప్పే దుర్లక్షణాలు అన్నీ జగన్ పాలనలో మూర్తీభవించి ఉన్నాయనే కదా, ఆయనను ఓటర్లు ‘ఎత్తేసింది!?’. ఆయన చేతిలో పదకొండే పెట్టింది!? .
అందుకే గదా…పాలనా పగ్గాలు వీరికి అప్పగించింది జగన్ నిత్య స్మరణ చేయమనా!?
పూర్వపు ముఖ్యమంత్రి స్మరణతోనే కూటమి నేతలు సరిపెట్టడం లేదు. పధకాల అమలు తీరులోనూ జగన్ బాటనే కూటమి పాలన అనుకరిస్తున్నట్టు కనిపిస్తున్నది; కొన్ని కొన్ని చూస్తుంటే.
మాట వరుసకు ; తల్లికి వందనం.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పని చేసిన మొదటి మూడు సందర్భాల లోనూ ‘తల్లికి వందనం ‘ పధకం గానీ, దానిని పోలిన పధకం గానీ లేదు. ఇప్పుడు తల్లికి వందనం అంటున్నారు . ఇది, జగన్ చేతికి ప్రభుత్వ పగ్గాలు వచ్చిన తరువాత ; ఆ మహిళలను తమ ఓటర్లు గా మార్చుకోడానికి ఉద్దేశించిన వెదజల్లుడు పధకం . కానీ, పాలకుల వ్యవహార శైలి పద్ధతిగా లేకుండా… దోపిడీకి తెగబడితే….; ఏ వంకతో వారిపై సొమ్ములు వెదజల్లినా, ఓట్లు వేయరనే విషయం 2024 ఎన్నికల ఫలితాల అనుభవం రాజకీయ వాదులకు నేర్పాలి. కానీ, నేర్పినట్టు లేదు. అధికారం పై ఆశ…. ఆలోచించనివ్వదు. బుర్ర పనిచేయనివ్వదు.
జగన్ దుష్పరిపాలన ను గుర్తు చేసే మరో పధకం…. ఆటో వారికి ప్రజల సొమ్ము వెదజల్లుడు. “వైస్సార్ వాహన మిత్ర ” పేరు మీద, ప్రజల కష్టార్జితాన్ని జగన్మోహన్ రెడ్డి ఆటో, క్యాబ్ డ్రైవర్లకు పప్పు బెల్లాల్లా పంచిపెట్టారు.
ఇప్పుడు కూటమి కూడా ఆ దుబారా తో జగన్ ను తలపించింది. వాళ్ళకే, మనిషికి 15 వేల వంతున…. ఏకంగా దాదాపు రెండు లక్షల తొంభయ్ వేలమందికి పంచేసింది.
పంచేసిన సొమ్ము…. సుమారు నాలుగు వందల ముప్ఫయ్ ఆరు కోట్లు. ఇది సరిపోదు అన్నట్టుగా…. మైనారిటీ వర్గాల డ్రైవర్లకు మరో నలభై రెండు కోట్లు.
ఎవరి డబ్బు ఇది? ఇది సంక్షేమ పథకమా?
నెల్లూరు జిల్లాలో ఎవరో ఎవరి చేతుల్లోనో మర్డర్ అయితే, 23 లక్షల సొమ్ము…. 10 ఎకరాల భూమి ఎవరి సొమ్ము ఇస్తున్నారు? మరి, ఏటా మర్డర్ అయ్యే 900 మంది కుటుంబాల సంగతేంటి? వారికి పంచరా? ఈ పంచుడు కు విధాన పరమైన నిర్ణయం ఏమైనా ఉందా? ఎవరికి ఎంత అనుకుంటే…. అంత పంచుడేనా? సుపరిపాలన అంటే ఇదేనా?
కూటమి నేతలు…. జగన్ చేసిన ప్రభుత్వ సొమ్ము దుబారా నుంచి నేర్చుకోవాలి.
ఈ దుబారా వ్యయం చూస్తుంటే…. ” జగన్ ఎడం చెయ్యి తీసేయండి . మా పురచెయ్యి పెడతాము … ” అని కూటమి నేతలు అన్నట్టుగా ఉంది. పాలన అంటే జనం డబ్బును విచ్చలవిడిగా పంచేది , ప్రచారం లో మునిగి తేలేది కాదు .
జగన్ దుష్పాలన ను గుర్తుకు తెచ్చే పంచుడు పనులు కూటమి చేయడం ఎందుకు…. జగన్ నే ఇంకోసారి తెచ్చుకుంటే….; ఆయనే జనం డబ్బు విచ్చల విడిగా పంచేస్తాడుగా!?
చంద్రబాబు గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతున్నది.(ఆ మేరకు జగన్ గ్రాఫ్ పెరగడం లేదు . ). గమనించారో… లేదో తెలియదు. చంద్రబాబు గ్రాఫ్ తగ్గి …. జగన్ గ్రాఫ్ పెరగని రాజకీయ పరిస్థితులు ఏర్పడితే ఏం జరుగుతుంది ?
“మనల్ని పాలించడానికి , సమాజాన్ని సరిదిద్దడానికి …. ఎవరున్నారబ్బా అనే ఆలోచనల దిశగా జనం దృష్టి మళ్లుతుంది. అలా మళ్లిస్తే ….. మూడో ప్రత్యామ్నా యం దిశగా ప్రజల ఆలోచనలు మళ్ళితే….దానికి బాధ్యులు -చంద్రబాబు , లోకేషే అవుతారు .
గుండమ్మ కథ, మిస్సమ్మ వంటి సినిమాలను నిర్మించిన విజయా పిక్చర్స్ నాగిరెడ్డి గారి దగ్గరకు ఒక యువకుడు వచ్చి, ” నేను అచ్చం యన్ టీ రామారావు లాగా నటిస్తాను. నాకో అవకాశం ఇవ్వండి… ” అని అడిగాడట.
ఇందుకు, నాగిరెడ్డి గారు నవ్వి,” యన్ టీ రామారావు లాగా నువ్వు నటించడం ఎందుకు? యన్ టీ రామారావే ఉన్నాడుగా…. నటించడానికి!? ” అన్నారట.
కూటమి నేతలు ఇప్పటికైనా మేలుకోవాలి.
– భోగాది వేంకట రాయుడు