Suryaa.co.in

Andhra Pradesh

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సిటీగా అమరావతి రాజధాని

  • 90 రోజుల్లో సీఆర్డీయే కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని అధికారుల‌కు సీఎం చంద్రబాబు ఆదేశం
  • రాజ‌ధానిలో చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ పనులు త్వరితగితన పూర్తి చేయాలన్న సీఎం

అమరావతి : అమ‌రావ‌తి రాజ‌ధాని ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సిటీగా ఉండాల‌ని, ఆ దిశగా ప్ర‌ణాళిక‌లు రూపకల్పన చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పురపాలక శాఖా మంత్రి నారాయణ, సీఆర్డీయే అధికారులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో గురువారం స‌మీక్ష నిర్వహించారు.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ స్పుర‌ణ‌కు వ‌చ్చేలా అమ‌రావ‌తి లోగోను ఆంగ్లంలో అమరావతి పేరులో మొదటి అక్షరం A, చివరి అక్షరం I అక్షరాలు కలిసి వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలన్నారు. రాజ‌ధానిలో ఎటు చూసినా సాంకేతిక సౌల‌భ్యత ఉట్టిప‌డేలా రాజ‌ధాని నిర్మాణం ఉండాల‌న్నారు. అమ‌రావ‌తి దేవ‌త‌ల రాజ‌ధాని అని, అలాంటి గొప్ప రాజ‌ధాని ప‌ట్ల గ‌త ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి రాజ‌ధానిని భ్రష్టు పట్టించారని అన్నారు.

ఇప్పుడు మ‌ళ్లీ రాజ‌ధాని ప‌నులు వేగంగా పున‌రుద్ధరించాల్సి ఉంద‌న్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు పూర్తి చేయ‌డానికి ప‌ట్టే స‌మ‌యం, ప‌నులు చేప‌ట్టడానికి టెండ‌ర్లు పిల‌వ‌డం త‌దిత‌ర అంశాల‌పై ఈ స‌మావేశంలో ఆయ‌న స‌మీక్షించారు. జీ+7విధానంతో నిర్మాణం తలపెట్టిన సీఆర్డీయే కార్యాలయంను గ‌త టీడీపీ ప్రభుత్వంలో ఏమాత్రం చేప‌ట్టామో అంత‌కుమించి అంగుళం నిర్మాణం కూడా ముందుకు క‌ద‌ల్లేద‌ని, గ‌త ప్రభుత్వం ఈ నిర్మాణాల‌ను పూర్తీగా వ‌దిలేసింద‌ని అధికారులు సీఎంకు సూచించారు.

ఇప్పుడు ఈ భ‌వ‌న నిర్మాణం పూర్తి చేయ‌నున్నామ‌ని అధికారులు తెలిపారు. ఈ భ‌వ‌న నిర్మాణాన్ని 90 రోజుల్లో పూర్తీ చేసి కొత్త కార్యాల‌యాన్ని అందుబాటులోకి తేవాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. భ‌వ‌న నిర్మాణాల‌కు కూడా అత్యాధుని టెక్నాల‌జీల‌ను ఉప‌యోగించి, నాణ్యతలో ఎక్కడా కూడా రాజీ ప‌డ‌కూడ‌ద‌ని సూచించారు.

హ్యాపీనెస్ట్‌నూ గ‌త ప్రభుత్వం నిలిపేసింది

టీడీపీ ప్రభుత్వం రాజ‌ధానిలో చేప‌ట్టిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుపైన ముఖ్యమంత్రి స‌మీక్షించారు. అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలో నివాస‌ముండాల‌ని కోరుకునే వాళ్ల కోసం 14 ఎక‌రాల్లో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును రూపొందించామ‌ని, కానీ 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావ‌డంతో ఆ ప్రాజెక్టుకు గ్రహ‌ణం ప‌ట్టింద‌న్నారు. హ్యాపీనెస్ట్ ప్లాట్లన్నీ అప్పట్లో ఒక్క గంట‌లో అమ్ముడ‌పోయాయ‌ని, అయితే త‌రువాత వ‌చ్చిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిలిపేయ‌డంతో కొనుగోలుదారులు వెన‌క్కివెళ్లిపోయార‌ని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.

దీనివ‌ల్ల సీఆర్డీఏకు భారీ న‌ష్టం వ‌చ్చింద‌న్నారు. హ్యాపీనెస్ట్ లో గ‌త ప్రభుత్వం చ‌ర్యల‌తో ఏర్పడ్డ న‌ష్టాన్ని పూడ్చేలా విధానాలు రూపొందించాల‌ని అధికారును ఆదేశించారు. ఈ ప్రాజెక్టును మ‌ళ్లీ పున‌రుద్ధరించాల‌న్నారు. రాజ‌ధానికి సంబంధించి ఇంకా 3,558 ఎక‌రాలు సేక‌రించాల్సి ఉంద‌ని, రాజ‌ధాని ప‌రిధిలోని రెండు గ్రామాల రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నార‌ని సీఎంకు అధికారులు తెలిపారు.

అయితే డెవ‌ల‌ప్ చేసిన ప్లాట్లను ఆ రైతుల‌కు కేటాయించే విష‌యంలో చిన్న చిన్న అభ్యంత‌రాలున్నాయ‌ని అధికారులు వివ‌రించ‌గా రైతుల‌తో మాట్లాడి దాన్ని ప‌రిష్కరించి ముందుకెళ్లాల‌ని సీఎం సూచించారు. రాజధానిలో జరుగుతున్న జంగిల్ క్లియరెన్స్ పనులపై సీఎం సమీక్షించారు. జంగిల్ క్లియరెన్స్ కోసం 190 హిటాచి మిషన్లు కంప చెట్లను తొలగిస్తున్నాయని, దాదాపు 60 శాతం జంగిల్ క్లియరెన్స్ ప‌నులు పూర్తయ్యాయ‌ని అధికారులు వివ‌రించారు.
బిల్డింగ్ నిర్మాణం, క్లియరెన్స్ లో టెక్నాలజీని ఉపయోగించాలని సీఎం సూచించారు. జంగిల్ క్లియరెన్స్ మదింపునకు డ్రోన్లను ఉపయోగించాలని సీఎం అన్నారు. క్లియరెన్స్ పనులు కూడా డ్రోన్స్ ద్వారా పర్యవేక్షించాలన్నారు.

మెట్రో రైలు ప్రాజెక్టు ప‌నులు వేగ‌వంతం చేయండి

విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌లో చేప‌ట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టు ప‌నుల‌ను త్వరిత‌గ‌తిన చేప‌ట్టాల‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల‌కు సూచించారు. విశాఖప‌ట్నం మెట్రో ప్రాజెక్టును రెండు ఫేజుల్లో చేప‌డ‌తామ‌ని ఏపీ మెట్రోరైల్ కార్పొరేష‌న్ ఎండీ రామ‌కృష్ణా రెడ్డి సీఎంకి వివ‌రించారు.

ఫేజ్-1లో 46 కిలో మీట‌ర్ల మేర రూ.11,400 కోట్ల వ్య‌యంతో మెట్రో రైలు నిర్మిస్తామ‌ని, త‌రువాత ఫేజ్‌-2లో 30 కిలోమీట‌ర్ల మేర రూ.5,734 కోట్ల‌తో మెట్రో రైలు నిర్మిస్తామ‌న్నారు. ఫేజ్-1 మెట్రో రైలు ప‌నులు మొద‌లు పెట్టి నాలుగేళ్లలోపు పూర్తి చేయాల‌ని సీఎం ఆదేశించారు. అలాగే విజ‌య‌వాడ‌లో 38 కిలోమీట‌ర్ల మేర రూ.11వేల కోట్లతో చేప‌ట్టబోయే మెట్రో రైలు నిర్మాణ ప్రాజెక్టు ప‌నులను కూడా వేగ‌వంతం చేయాల‌ని సూచించారు.

LEAVE A RESPONSE