Suryaa.co.in

Andhra Pradesh

అంబటి .. జగన్ అసమర్థత,అవినీతే పోలవరం నిర్మాణానికి శాపంగా మారాయని తెలుసుకో

-అంబటి .. జగన్మోహన్ రెడ్డి అసమర్థత, చేతగానితనం, అవినీతే పోలవరం నిర్మాణానికి శాపంగా మారాయని తెలుసుకో
– పోలవరం గురించి మాట్లాడేటప్పుడు అయినా నోటిపనికాస్త తగ్గించి, మెదడుకి పనిచెప్పడం నేర్చుకో. పాడిందే పాటరా..పాచిపళ్ళ దాసుడా అన్నతీరుగా వ్యవహరించి ఉన్నకాస్త పరువు తీసుకోకు రాంబాబు
– టీడీపీహాయాంలో ఆమోదించిన ప్రాజెక్ట్ నిర్మాణ అంచనావ్యయం నిధులు తెచ్చుకోలేని అసమర్థస్థితిలో ఉన్న మీ నాయకుడు చివరకు ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించి, దాన్నిబ్యారేజీ స్థాయికి దిగజార్చడానికి సిద్ధమయ్యాడు
• అనిల్ కుమార్ జలవనరుల మంత్రిగా ఉండి తొడలుకొట్టి, అప్పుడు పూర్తిచేస్తాం.. ఇప్పుడు పూర్తిచేస్తామని హూంకరించాడు
• చివరికి మంత్రి పదవి పోయాక పోలవరం గురించి నన్నేమీ అడగవద్దనే స్థాయికి వచ్చాడు.
• రెండోకృష్ణుడిగా జలవనరుల శాఖ బాధ్యతలు చేపట్టిన అంబటి… కొత్తగా పోలవరంలో టీడీపీ అవినీతి చేసిందంటూ కూనిరాగం ఆలపిస్తున్నాడు
• ప్రాజెక్ట్ నిర్మాణంలో టీడీపీ హయాంలో ఎలాంటి అవినీతిజరగలేదని స్వయంగా ఢిల్లీ హైకోర్టు చెప్పిన విషయాన్ని కొత్తమంత్రి మర్చిపోతేఎలా?
• అంబటికి జలవనరుల శాఖపై అవగాహనఉంటే.. పోలవరం గురించి పూర్తిగా తెలిసుంటే, ప్రాజెక్ట్ ఎత్తు,నీటినిల్వ సామర్థ్యం,నిర్వాసితులకు ఇచ్చేసాయంపై మాట్లాడాలి
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు

పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఒకవరప్రసాదమని, రాష్ట్రాన్ని కరువు రహితం గా మార్చే ప్రాజెక్ట్ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రశ్నార్థకంగా మారిందని, మూడేళ్లపాటు జలవనరులశాఖామంత్రిగాఉన్న అనిల్ కుమార్, రాష్ట్రంలోని సాగునీటిప్రాజెక్టులతోపాటు, పోలవరంప్రాజెక్ట్ పై చెప్పాల్సిన కట్టుకథలన్నీ చెప్పాడని, ఇప్పుడు ఆయన స్థానంలో రెండో కృష్ణుడిగా వచ్చిన అంబటిరాంబాబు ప్రజలకు ఉన్న అనుమానాలు తీర్చకుండా బాధ్యతలే కుండా మాట్లాడుతున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

శుక్రవారం ఆయన జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆవివరాలు ఆయన మాటల్లోనే…
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరంనిర్మాణంప్రశ్నార్థకంకావడంతో పాటు, పోలవరం ప్రాజెక్ట్ నీటినిల్వసామర్థ్యంతోపాటు, భద్రతపై అనేకసందేహాలు ఉద్భవించాయి. ఈ సందేహాలన్నీ రాష్ట్రరైతాంగంతోపాటు, ప్రజల్ని వేధిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ భద్రత, నిర్మాణం, నీటినిల్వ సామర్థ్యం గురించి ప్రజలకుసమాధానంచెప్పకుండా నోటికిపని చెప్పడమే తమపని అన్నట్లుగా మంత్రులు మాట్లాడుతున్నారు. జలవనరుల మంత్రిగా బాధ్యతలుచేపట్టిన అంబటిరాంబాబు మెదడుకుమేత వేయకుండా, నోటికిపనిచెప్పి, ఏదేదో మాట్లాడి, చంద్రబాబునితిట్టేసి తప్పించుకోవాలని చూస్తున్నాడని, మంత్రిమాటలను బట్టే అర్థమవుతోంది.

2014-2019 మధ్యన చంద్రబాబుగారి హయాంలోకేవలంఐదేళ్లలో పోలవరం నిర్మాణం 70శాతంవరకు పూర్తయిందని ఈప్రభుత్వంలోని అధికారులే స్వయంగాచెప్పారు. నిర్మాణ పనుల్లో భాగంగా కేవలం 24గంటల్లోనే 32,350క్యూబిక్ మీటర్లకాంక్రీట్ పనులు జరిగి, గిన్నిస్ రికార్డులకుఎక్కడం జరిగింది. చంద్రబాబుగారు ముఖ్యమంత్రి కాకముందు… 10ఏళ్లు అధికారంలోఉన్న గతప్రభుత్వాలహాయాంలో పోలవరంప్రాజెక్ట్ పనులు ముక్కి మూలిగి కేవలం 7శాతమే జరిగాయి.

పోలవరంపై సమాధానంచెప్పకుండా చంద్రబాబుని ఆడిపోసుకుంటున్న మంత్రులంతా నిజంగా సిగ్గుపడాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ మూడేళ్లలోపోలవరం పనులు కేవలం 4శాతంమాత్రమే జరిగాయి. 4శాతంపనులుచేసినందుకు నగుబాటుతో తల వంచుకోకుండా మాజీముఖ్యమంత్రిని ఆడిపోసుకుంటారా? కేంద్రజలశక్తి శాఖ తనవార్షిక నివే దికలో పోలవరంపనుల నివేదికను బహిర్గతంచేసింది. 2020 డిసెంబర్ నుంచి 2021 నవంబర్ వరకు 41.10 నుంచి 42.56 శాతంమాత్రమేపనులుజరిగాయని చెప్పారు. మొత్తం గా ఈప్రభుత్వం వచ్చాక పోలవరంపనులు కేవలం 1.46శాతం మాత్రమేజరిగాయని కేంద్రజల శక్తి శాఖ తననివేదికలో తేటతెల్లం చేసింది.

గతంలో పోలవరంనిర్మాణంపై తాము ఈప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అప్పుడు జలవనరుల మంత్రిగా ఉన్నఅనిల్ కుమార్ అసెంబ్లీలో తొడలుకొట్టాడు. 2021 జూన్ నాటికి తమప్రభుత్వం ప్రాజెక్ట్ ని పూర్తిచేస్తుందని ఒకసారి, 2021 డిసెంబర్ కి అని మరోసారి, 2022 డిసెంబర్ నాటికని వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు. ఎత్తుతగ్గింపుపై వ్యంగస్త్రాలుసంధించాడు. టేప్ తెచ్చికొలుచుకోండి అంటూ మాపై అసెంబ్లీలో వ్యంగాస్త్రాలు సంధించాడు. మాజీ నీటిపారుదల శాఖామంత్రిగా ఉన్న అనిల్ కుమార్ చివరు పోలవరం గురించి తనను ఏమీఅడగవద్దనిచెప్పే స్థాయికివచ్చాడంటేనే అయనపరిస్థితి ఏమిటో అర్థమవుతోంది.

జలవనరులశాఖ మంత్రిగా ఒకటోకృష్ణుడిగా అభినయించిన అనిల్ కుమార్ పెర్ఫార్మెన్స్ అలాఉంటే, రేపట్నుంచి రెండోకృష్ణుడైన అంబటిరాంబాబు అభినయం ఎలా ఉండబోతోందోచూడాలి. రెండోకృష్ణుడిగా జలవనరుల శాఖ బాధ్యతలు చేపట్టిన అంబటి… కొత్తగా పోలవరంలో టీడీపీఅవినీతిచేసిందంటూ కూనిరాగం ఆలపిస్తున్నాడు. ప్రాజెక్ట్ నిర్మాణంలో టీడీపీ హయాంలో ఎలాంటి అవినీతిజరగలేదని స్వయంగా ఢిల్లీ హైకోర్టే చెప్పిన విషయాన్ని కొత్త మంత్రి మర్చిపోతే ఎలా? అంబటికి జలవనరులశాఖపై అవగాహనఉంటే.. పోలవరం నిర్మాణం గురించి పూర్తిగాతెలిసుంటే, ప్రాజెక్ట్ ఎత్తు,నీటి నిల్వ సామర్థ్యం,నిర్వాసితులకు ఇచ్చేసాయంపై మాట్లాడాలి.

పోలవరం ప్రాజెక్ట్ ని బ్యారేజీగా మార్చేప్రయత్నంచేస్తున్నారని, నీటినిల్వసామర్థ్యాన్ని తగ్గించే ప్రయత్నంతోపాటు, ఎత్తుతగ్గించేకుట్రలుజరుగుతున్నాయని తాము ముందునుంచీ చెబు తూనే ఉన్నాం. రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తితో పోలవరం ప్రాజెక్ట్ నీటిసామర్థ్యంఎత్తుని తగ్గించడానికి, ఏకంగా కేంద్రజలశక్తి శాఖ ఒప్పుకున్నట్లు వార్తలువస్తున్నాయి. కేంద్రజలశక్తి శాఖకు ఏపీప్రభుత్వం ఏంచెప్పిందో, దానివల్ల ఏపీకి ఒరిగేప్రయోజనాలేమిటో, నష్టాలేమిటో అంబటిరాంబాబు ప్రజలకు చెప్పరా? గతంలో పోలవరంఎత్తుపై తెలంగాణ సీఎంకేసీఆర్ మాట్లాడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏమీ స్పందించలేదు.

పోలవరం ప్రాజెక్ట్ అంచనావ్యయాన్ని రూ.55,548కోట్లుగా నిర్ధారించి, గతంలో టీడీపీ హాయాంలోనే కేంద్రప్రభుత్వంతో ఆమోదంపొందడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.55,548కోట్లుగా ఆమోదించాక, దానికి అనుగుణంగా పనులుచేసి, నిధులు తెచ్చుకోలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, చివరకు ప్రాజెక్ట్ నిర్వాసితుల నోట్లోమట్టికొట్టేచర్యలకు సిద్ధమైం ది. పోలవరం నీటిసామర్థ్యం ఎత్తు వాస్తవంగా 45.72 మీటర్లఎత్తుఉండాలి. కేంద్రనుంచి నిధులు తెచ్చుకోలేని అసమర్థప్రభుత్వమైన జగన్మోహన్ రెడ్డిప్రభుత్వం ఎత్తుని 41.15మీటర్ల కుతగ్గించడానికి సిద్ధమైంది.

దానికి ప్రధానకారణం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఇచ్చే నష్టపరి హారాన్ని తగ్గించడానికే. ప్రాజెక్ట్ ఎత్తు 45.72 మీటర్లుగానేఉంచితే, లక్షా07వేల నిర్వాసిత కుటుంబాలకు జగన్ రెడ్డి ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి. అలాకాకుండా ఎత్తుని 41.15 మీటర్లకే కుదిస్తే, నిర్వాసితకుటుంబాల సంఖ్య కేవలం 20వేలకుటుంబాలకే పరిమితం అవుతుంది. కేంద్రంనుంచి ప్రాజెక్ట్ అంచనావ్యయం తాలూకా నిధులుతెచ్చుకోలేకనే చేతగాని, దద్దమ్మ ప్రభుత్వమైన జగన్మోహన్ రెడ్డిప్రభుత్వం ప్రాజెక్ట్ ఎత్తుని తగ్గించడానికి సిద్ధమైంది.

ఒక్కమాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అసమర్థత, నిర్వాకంతో పోలవరం ప్రాజెక్ట్ కాస్త బ్యారేజీగా మారనుంది. 194 టీఎంసీల నీరు నిల్వఉండాల్సిన పోలవరం ప్రాజెక్ట్ ని , కేవలం 115 టీఎంసీలకే జగన్మోహన్ రెడ్డి పరిమితంచేయనున్నారు. ప్రాజెక్ట్ ఎత్తుని 41.15 మీటర్లకు పరిమితంచేస్తే, దానిలో 115టీఎంసీలకంటే ఎక్కువ నీటిని నిల్వచేయలేము. ఆ మాత్రం నీటినిల్వతో రాష్ట్రానికి , రైతాంగానికి ఒరిగేదేమీ ఉండదు. 115టీఎంసీలు అనేది మినిమమ్ డ్రాయింగ్ లెవల్. అలాచేస్తే రాష్ట్రానికి నష్టమే తప్ప, ఎలాంటి ఉపయోగం ఉండదు .

ప్రాజెక్ట్ ఎత్తు 45.72 మీటర్లుగాఉంచి, 190 టీఎంసీల నీటిని నిల్వ చేస్తేనే గోదావరిజలాలను రాయలసీమకు, ఉత్తరాంధ్రకు తరలించడానికి వీలవుతుంది.ప్రాజెక్ట్ ఎత్తుని 41.15 మీటర్లుకు తగ్గిస్తే జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం తప్ప, రాష్ట్రానికి, రాష్ట్ర రైతాంగానికి ఎలాంటిఉపయోగం ఉండదని బల్లగుద్దిచెప్పగలం. తనపై ఉన్న కేసుల భయంతోనే జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ ఎత్తుని తగ్గించడానికి సిద్ధపడ్డాడు. బహుళార్థసాధక ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని బ్యారేజీగా మార్చింది ముమ్మాటికీ జగన్మోహన్ రెడ్డి. చేతిలో 28 మంది ఎంపీలను ఉంచుకొని కూడా జగన్మోహన్ రెడ్డి పోలవరంప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేక , చివరకువిధిలేక ప్రాజెక్ట్ ఎత్తుని తగ్గించడానికి రెడీ అయ్యాడు.

జలవనరులశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో కృష్ణుడు అంబటిరాంబాబు ఈ వాస్తవా లు తెలుసుకోకుండా పోలవరంప్రాజెక్ట్ పనుల్లో చంద్రబాబు హాయాంలో అవినీతిజరిగిందంటూ పాతపాడే పాడుతున్నాడు. పాడిందే పాట రా..పాచిపళ్లదాసుడా అన్న తీరుగా ప్రవర్తించి పరువుపోగోట్టుకోకు రాంబాబు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడి, ప్రాజెక్ట్ పనుల్ని అనుభవం లేని సంస్థ కట్టబెట్టాడు. పంపులు, లిఫ్టులు తయారుచేసే అనామక కంపెనీ నిర్మాణపనులు అప్పగించ బట్టే పోలవరానికి ఈ దుర్గతి పట్టిందని అంబటి గ్రహించాలి. అత్యంత లోతైన, పొడవైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణంచేపట్టి, మొత్తంగా ప్రాజెక్ట్ పనుల్ని టీడీపీ ప్రభుత్వం 70శాతం పూర్తిచేసింది అంబటి. మీప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి అధికారంలోకివచ్చాక పోలవరం నిర్మాణపనులు కేవలం 1.46శాతంమాత్రమే జరిగాయని కేంద్రజలశక్తి శాఖే చెప్పింది. కేంద్రజలశక్తి శాఖ నివేదికలోని అంశాలు అంబటికి అర్థమైతేవాటిపై ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలి.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలోని జలవనరుల ప్రాజెక్ట్ లన్నీ పడకేశాయి. ప్రాజెక్ట్ ల గేట్లకు గ్రీజు పెట్టలేని దుస్థితికి ఈప్రభుత్వం వచ్చింది నిజంకాదా? కడపలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి చేతగానితనం కాదా? పులిచింతల ప్రాజెక్ట్ గేటు ఎలా కొట్టుకుపోయిందో నీకుతెలియదా అంబటి. అంబటి రాంబాబు తాను ఇప్పుడు మంత్రిననే విషయం మర్చిపోయి, మెదడుకి పని చెప్పకుండా నోటికి పని చెప్పి, ఎప్పటిలానే ప్రజల్ని ఏమార్చాలని చూస్తున్నాడు.

LEAVE A RESPONSE