-
పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు ప్రారంభోత్సవాలు చేయవచ్చా?
-
ఉప ముఖ్యమంత్రి స్ధానంలో ఎమ్మెల్సీ ప్రారంభోత్సవాలకు అనుమతిస్తారా?
-
శిలాఫలకాలపై నాగబాబు పేరు వేసేందుకు అనుమతించింది ఎవరు?
-
మున్సిపల్ మంత్రి సరే.. శిలాఫలకాలపై సీఎం పేరేదీ?
-
ఇంకా ఎమ్మెల్సీగా నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోని నాగబాబు
-
అధికారిక ఉత్తర్వులు రాకముందే ఎలా ప్రారంభోత్సవాలు చేస్తారు?
-
అదేమయినా ప్రైవేటు, పార్టీ కార్యక్రమాలా?
-
కలెక్టర్ ఎలా అనుమతించారు?
-
వివాదంగా మారుతున్న ఎమ్మెల్సీ నాగబాబు వ్యవహారం
-
పిఠాపురంలో ‘ప్రేమకు వేళాయరా’
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఒక అక్క.. ఒక బావ.. ఒక అత్త.. ఒక మామ. అదీ సినిమా! ఇది ‘ప్రేమకు వేళాయరా’ సినిమాలో పండిన డైలాగ్. ఇప్పుడు పవర్‌స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో మాత్రం అందుకు భిన్నంగా, ఒక అన్న,తమ్ముడు.. ఒక పిఠాపురం.. అదీ సినిమా! అని పేలుతున్న డైలాగు.
ప్రజాస్వామ్యంలో అధికారికంగా బంధాలకు స్థానం ఉండదు. వాటి వెనుక ఏమున్నప్పటికీ, ఏదైనా చట్టబద్ధంగా ఉండాలి. కనిపించాలి కూడా! అప్పుడే విమర్శలు రావు. అధికారం ఉందని నిబంధనలను ఉల్లంఘించి, దానిని కుటుంబ వ్యవహారం చేయకూడదు. అందుకు భిన్నంగా జరిగితే విమర్శలు తప్పవు.
కానీ పిఠాపురం నియోజకవర్గంలో ఒక చిత్రాచిత్రమైన దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. తమ్ముడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కమ్ డిప్యూటీ సీఎం. అన్నయ్య ఎమ్మెల్సీ. తమ్ముడు బిజీ కాబట్టి, ఆయన చేయాల్సిన ప్రభుత్వ పరమైన ప్రారంభోత్సవ కార్యక్రమాలు, శంకుస్థాపనలు, జాతినుద్దేశించి ప్రసంగించడాలు అన్నీ అన్నయ్య చేస్తే, దానిని ఎవరైనా అనుమతిస్తారా? ఎవరూ అనుమతించరు. అనుమతించకూడదు. కలెక్టరయితే అసలు అంగీకరించకూడదు. అధికారులు అలాంటి కార్యక్రమాలకు హాజరుకాకూడదు. కానీ గమ్మతుగా వీటికి అభ్యంతరం చెప్పాల్సిన కలెక్టరే.. స్వయంగా ఆ అధికారికమైన ‘అనధికార’ కార్యక్రమాలకు హాజరయ్యారు. అదే విచిత్రం.
తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో.. జనసేన నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పవన్ కల్యాణ్ అన్నయ్య నాగబాబు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రజలనుద్దేశించి ప్రసంగించడమే కాకుండా, వారితో ముఖాముఖి నిర్వహించారు. నిజానికి ఇవన్నీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం అయిన తమ్ముడు పవన్ కల్యాణ్ నిర్వహించాలి. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే ఆయనే కాబట్టి. ప్రొటోకాల్ ప్రకారం శిలాఫలాకాలపైనా ఆయన పేరే ఉండాలి. కానీ అందుకు భిన్నంగా ఆయన పేరుతో పాటు, కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన అన్నయ్య నాగబాబు పేరు కూడా శిలాఫలకాలపై ప్రత్యక్షమవడం వివాదమే కాకుండా, అభ్యంతరాలకు కారణమయింది. ఇప్పుడు ఇది వైసీపీకి ఆయుధమయింది.
శిలాఫలకాల్లో సీఎం పేరేదీ?
నాగబాబు ప్రారంభించిన అన్నక్యాంటీ న్ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలపై మున్సిపల్ మంత్రి నారాయణ పేరు పెట్టిన అధికారులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరు మాత్రం విస్మరించడం, తమ్ముళ్లను అసంతృప్తి పరిచింది. సహజంగా ఏదైనా నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాల్లో ఎంపి, ఆ శాఖ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధుల పేర్లు రాస్తుంటారు. ఎంపిలు- ఎమ్మెల్యేలు వచ్చినా, రాకపోయినా ప్రొటోకాల్ ప్రకారం వారి పేర్లు ముద్రిస్తుంటారు. అయితే పిఠాపురం నియోజకవర్గం కాబట్టి.. అంతకుమించి అది పవన్ కల్యాణ్ నియోజకవర్గం కాబట్టి, అక్కడ జరిగే అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం పేరు శిలాఫలకాలపై ఉంచాలి కదా? ‘‘అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తొలిసారి డిప్యూటీ సీఎం పవన్ ఫొటోలు పెడుతున్నప్పుడు, ఆయన నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పేరు రాయరా? ఇదేనా మిత్రధర్మం’’ అని పిఠాపురం తమ్ముళ్లు, కారాలు మిరియాలు నూరుతున్నారు.
ఎమ్మెల్సీల ప్రొటోకాల్ లెక్క ఇదీ!
నిజానికి ఒక ఎమ్మెల్సీ తనకు ఇష్టమైన నియోజకవర్గాల్లో, ఇష్టమైన జిల్లాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. వాటికి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఒక ఎమ్మెల్సీ ఎన్నికైన తర్వాత.. తాను ఏ జిల్లా, ఏ నియోజకవర్గాన్ని ఎంచుకునే అంశాన్ని అసెంబ్లీ సెక్రటేరియేట్‌కు చెప్పాల్సి ఉంటుంది. దాని ప్రకారం అసెంబ్లీ కార్యదర్శి దానిని జీఏడీకి పంపిస్తారు. జీఏడీ విభాగం సదరు ఎమ్మెల్సీ ఎంపిక చేసుకున్న జిల్లా కలెక్టర్‌కు దానిని పంపిస్తారు. జిల్లా కలెక్టర్ దాని ప్రకారం, సదరు ఎమ్మెల్సీకి నియోజకవర్గంలో ప్రొటోకాల్ ఏర్పాటు చేస్తారు. తర్వాత ఆ నియోజకవర్గంలో జరిగే, అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలపై ఆయన పేరు రాస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానిస్తారు. డీఆర్‌సీ సమావేశాలకూ ఆయనను ఆహ్వానిస్తారు. ఇదీ ఎమ్మెల్సీలకు ఉన్న నిబంధన.
ఇప్పటిదాకా నియోజకవర్గం ఎంపిక చేసుకోని నాగబాబు
అయితే అసెంబ్లీ వర్గాల సమాచారం ప్రకారం.. మూడురోజుల క్రితం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు.. శనివారం రాత్రి వరకూ, తన జిల్లా-నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోనట్లు తెలుస్తోంది. మరి ఒక ఎమ్మెల్సీ తన నియోజకవర్గం ఏమిటన్నది ఎంపిక చేసుకోకుండా, జీఏడీ నుంచి ఆ మేరకు ఉత్తర్వులు రాకుండా, ఆయన పేరు శిలాఫలకాల్లో ఎలా వేస్తారు? ఆయన ప్రభుత్వ కార్యక్రమాలను ఎలా ప్రారంభిస్తారు? ఇక్కడ పవన్ కల్యాణ్ అన్నయ్య కావడం ఒక్కటే అర్హత కాదు. నిబంధనలు పాటించాలి కదా? ఎలాంటి అధికారం లేని వ్యక్తులు ప్రారంభించే కార్యక్రమాలకు అధికారులు ఎలా హాజరవుతారు? ఇది ప్రభుత్వ కార్యక్రమమా? ప్రైవేటు కార్యక్రమమా? అన్నది రాజకీయ వర్గాలు, సోషల్‌మీడియాలో నె టిజన్ల నుంచి వినిపిస్తున్న ప్రశ్న.
నాకు సమాచారం లేదు: కలెక్టర్
కాగా ఎమ్మెల్సీ నాగబాబు కాకినాడ జిల్లాలో ఏ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారన్న విషయం తనకు తెలియదని, అసెంబ్లీ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని కాకినాడ కలె క్టర్ షన్మోహన్ చెప్పారు. ‘మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు? నాకు సమాచారం లేదు’ అని వివరణ ఇచ్చారు. జీఏడీ నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత కలెక్టర్‌గా ప్రోటోకాల్ ఉత్తర్వులు ఇచ్చేది మీరే కదా అన్న ప్రశ్నకు, నాకయితే సమాచారం లేదు అన్నారు.