Suryaa.co.in

Telangana

స్థానిక సంస్థల్లో పాలన నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం

– బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా. ఎస్. ప్రకాష్ రెడ్డి

హైదరాబాద్: ఆరు గంటలపాటు జరిగిన కాంగ్రెస్ కేబినెట్ సమావేశం అనంతరం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, రాజకీయనాయకులు స్థానిక సంస్థల ఎన్నికలపై ఏదైనా స్పష్టమైన ప్రకటన వస్తుందేమనని ఎదురు చూశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కీలక అంశంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం బాధాకరం. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో పాలనను నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం అని మరోసారి రుజువు చేసుకుంది.

ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల అంశం హైకోర్టు పరిధిలో విచారణలో ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం మరో నెల రోజుల గడువు కోరడం, ఎన్నికల కమిషన్ మాత్రం రెండు నెలలు కావాలని అభిప్రాయపడటం జరిగింది. కానీ ఈ గడువులన్నింటి పట్ల ప్రజల్లో నమ్మకం పూర్తిగా పోయింది. ఒక్క నెలైనా, రెండు నెలలైనా.. ఎంత గడువు ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఎన్నికలు నిర్వహిస్తుందనే విశ్వాసం ప్రజల్లో లేదన్నది స్పష్టమైంది.

రేవంత్ ప్రభుత్వం ఎన్నికల నుంచి తప్పించుకునే దిశగా ప్రయత్నిస్తున్నదనే విషయం ప్రజలతోపాటు, అన్ని పార్టీల నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. 2024 ఫిబ్రవరిలోనే సర్పంచుల పదవీకాలం ముగిసింది. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీల పదవీకాలం 2024 జూన్‌లో పూర్తయింది. మున్సిపాలిటీలకు కూడా ఆగస్టులో గడువు ముగుస్తోంది.

హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మినహా రాష్ట్రంలోని 150కి పైగా మున్సిపాలిటీల్లో, 12,000కు పైగా గ్రామ పంచాయతీల్లో, 580 మండల పంచాయతీల్లో, 32 జిల్లా పరిషత్‌లలో పాలక మండళ్లు లేవు. ఇంత దారుణంగా స్థానిక పరిపాలన లేని పరిస్థితి దేశంలో మరెక్కడా కనిపించదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి స్పష్టమైన ఉదాహరణ.

రైతు భరోసా విషయంలో కూడా మోసం చేశారు. మొదట రైతులకు ప్రతి ఎకరానికి రూ.15,000 ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ చివరకు దాన్ని రూ.12,000కి తగ్గించి, మూడువిడతలుగా ఇస్తామన్నారు. ప్రస్తుతం కేవలం ఒక్క విడత నిధులు విడుదల చేసి, దాన్నే పెద్ద విజయంలా ప్రచారం చేసుకుంటున్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బడా భూస్వాములకు లాభం చేకూరింది, ఆక్రమణ భూములకు నిధులు ఇచ్చారు అని ఆరోపించిన కాంగ్రెస్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆ లిస్టులో ఒక్క మార్పు చేయకుండా, అదే పాత విధానాన్ని కొనసాగిస్తున్నారు.

ఒక్క విడత రైతుభరోసా నిధులు మాత్రమే ఇవ్వగలిగిన ప్రభుత్వం, దాన్నే గొప్ప విజయంగా చూపించుకుంటూ పాలాభిషేకాలతో భారీ ప్రచారానికి దిగడం రైతులను మోసగించడం కాక మిగిలింది కాదు.

ఇది కేంద్ర ప్రభుత్వంపై నెట్టే అంశమే కాదు. ఎన్నికలు నిర్వహించకుండా, రిజర్వేషన్ల సమస్యల పేరిట గానీ, ఇతర సాకుల పేరుతో పాలనను కొనసాగిస్తే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఈ నిర్లక్ష్యాన్ని తెలంగాణ ప్రజలు క్షమించరు.

రాజ్యాంగం 243(డి)(6) సెక్షన్ ప్రకారం, బీసీ రిజర్వేషన్‌ విషయంలో ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాలు తమ అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగి ఉంది. అయినా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై నెట్టే ప్రయత్నంతో షెడ్యూల్ 9లో చేర్చాల్సిన అవసరం అంటూ సాకులు చెబుతూ, బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఎన్నికలు జరగకముందే 42% బీసీ రిజర్వేషన్‌లు ఇస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని తప్పకుండా అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది.

 

 

 

LEAVE A RESPONSE