ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్బహిరంగ లేఖ

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసుల సమస్యలు పరిష్కరించాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సీఎం జగన్‌ను కోరారు. వారి వేతనాలు, పెన్షన్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులకు హామీలివ్వడమే తప్ప వాటిని పరిష్కరించిన పాపాన పొలేదని విమర్శించారు. అనగాని బహిరంగ లేఖ సారాంశం ఇదీ..
బహిరంగ లేఖ తేదీ.31.10.2021
శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, అమరావతి
విషయం : రాష్ట్రంలోని పోలీసుల సమస్యల పరిష్కారం – వీక్లీ ఆఫ్ అమలు – పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ – పదోన్నతులు – వేతనాల సమస్య పరిష్కారం గురించి
ప్రజా సంరక్షణే ధ్యేయంగా పోలీసు వ్యవస్థ అలుపెరుగక పని చేస్తోంది. కరోనా వంటి మహమ్మారి ప్రాణాలను కబలిస్తున్నా లెక్క చేయక ముందుండి పోరాడారు. తుపాన్లు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ ప్రజలకు అన్ని రకాల సేవలు అందించారు. ఉగ్రవాదం, నక్సలిజం వంటి అసాంఘిక శక్తుల నుండి సమాజాన్ని కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తూ క్షణ క్షణం ప్రమాదపుటంచున నిలబడి పోలీసులు విధులు నిర్వహించారు. అసలుv పోలీసులు లేని సమాజాన్ని ఊహించడం కూడా కష్టమే. అటువంటి పోలీసు వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూడడం అత్యంత బాధాకరం. క్షేత్ర స్థాయిలో ప్రజలకు అండగా నిలవడంలో కానిస్టేబుల్, ఎస్సై స్థాయి అధికారులే ఎక్కువగా ఉంటారు.అలాంటి వారు గత రెండున్నర సంవత్సరాలుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు.
సైనికుల్లా రేయింబవళ్లు సేవలందిస్తున్న సిబ్బందికి డి.ఎ, టి.ఎ సకాలంలో ఇవ్వకపోవడం దుర్మార్గం. పండగలు, పుట్టిన రోజులు వంటి వాటికి కూడా దూరంగా ఉంటూ రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. సెలవు రోజుల్లో పనిచేసినందుకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు కూడా గత రెండున్నరేళ్లుగా ఎప్పుడిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో.. పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవులు (వీక్లీ ఆఫ్) ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రెండున్నరేళ్ల తర్వాత పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలోనూ అదే మాట చెప్పారు. ఇప్పుడు మళ్లీ హామీ ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వీక్లీ ఆఫ్ అమలుపై నివేదిక సమర్పించి రెండేళ్లవుతున్నా ఎందుకు పట్టించుకోలేదన్నది సమాధానం లేని ప్రశ్న.
అసెంబ్లీ సమావేశాలు, ఇతర ప్రోటోకాల్ విధులు నిర్వహించే సిబ్బందికి కనీసం వసతి సదుపాయం కూడా కల్పించక పోవడంతో రోడ్లపైనే సేద దీరే పరిస్థితులు నెలకొన్నాయి. పదోన్నతుల సంగతి సరేసరి. గత రెండున్నరేళ్లుగా కానిస్టేబుల్స్, ఏఎస్సై, ఎస్సైలకు పదోన్నతులు అన్న మాటే లేదు. రాష్ట్రంలో పోలీస్ సిబ్బంది కొరత ఉందని, అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీస్ శాఖలోని ఖాళీలన్నింటినీ భర్తా చేస్తామని హామీ ఇచ్చినా ఇంత వరకు పట్టించుకున్న దాఖలా లేదు. సిబ్బంది కొరత కారణంగా ఉన్న సిబ్బందిపై తీవ్ర పని భారం పడుతోందని పోలీసులు మొరపెట్టుకుంటున్నారు.
కుటుంబాలను వదిలి రేయింబవళ్లు విధి నిర్వహణలో నిలిచిన వారికి కనీసం ఒకటో తేదీన వేతనాలు ఇవ్వడం లేదు. పెన్షనర్లకు పెన్షన్లు అందడం లేదు. ఇవన్నీ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం. పెన్షనర్లను ముప్పుతిప్పలు పెడుతున్న CFMS విధానాన్ని తక్షణమే రద్దు చేయాలి. అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సమస్యలన్నింటినీ ఒక్క సంతకంతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చి.. రెండున్నరేళ్లు గడిచినా పీఆర్సీ, సీపీఎస్ వంటి వాటిపై కనీసం నోరెత్తడం లేదు.
కరోనా మహమ్మారి ప్రభంజనంలా వ్యాపిస్తున్న సమయంలోనూ రోడ్లపై విధులు నిర్వర్తించి.. వందలాది మంది పోలీసులు వైరస్ బారినపడి తనువు చాలించారు. అంతకు రెట్టింపు ఉద్యోగులు ఆర్ధికంగా చితికిపోయారు. అలాంటి వారికి కూడా ప్రభుత్వం నుండి అందాల్సిన సాయం అందలేదు. కనీసం మెడికల్ రీయింబర్స్ మెంట్ కూడా అందించడం లేదు. మరోవైపు పదవీ విరమణ చేసిన వారికి సదుపాయాలు అందడం లేదు. ఇంక్రిమెంట్ రావడం లేదు. పోలీస్ సిబ్బందికి ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం హామీ జాడే లేకుండా పోయింది. పోలీస్ క్వార్టర్స్ నిర్మాణాలు అతీగతీ లేకుండా ఉన్నాయి. పోలీస్ సిబ్బందికి హామీలివ్వడం తప్ప.. అమలు విషయంలో కనీస చిత్తశుద్ధి చూపకపోవడం దుర్మార్గం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. వేతనాలు, పెన్షన్ల సమస్యను తక్షణమే పరిష్కరించాలి.