అక్కడ చదువే ఓ పరువు.. అదే కొలువు

అదిగదిగో..
సువిశాల
ఆంధ్రవిశ్వకళాపరిషత్తు..
అచ్చోట అణువణువునా
అక్షరాల మత్తు..
అక్కడ విద్యాభ్యాసం
భలే గమ్మత్తు…
అదంతా
చదువులమ్మ మహత్తు..!

అదెంత విశిష్ట ప్రాంగణం..
అక్కడెందరెందరు
విలక్షణ ఆచార్యులు..
ఎందరో మహానుభావులు
అందరికీ వందనమ్ములు..
డిగ్రీలే ఆ వాకిట
పంచిపెట్టే సొమ్ములు..
అవే మన ముంజేత కలకాలం నిలిచి
ఉండే ఆభరణమ్ములు..!

ఇటు ఇన్ గేటు..
అటు ఔట్ గేటు…
వెనక మరో అందమైన వాకిలి
ఎటు నుంచి అడుగిడినా
అది వాగ్దేవి లోగిలి…
అక్కడ చదువే
నీతో చెట్టాపట్టా..
నిర్ణీత వ్యవధిలో
నీ చేత పట్టా…
జీవితంలో సక్సెస్సే
దాని లోగుట్టా..!

తిరుమలగిరిపై శిలలు
మహారుషులకు ప్రతిరూపాలు..
ఇక్కడ శిలలు సరస్వతమ్మ
తానుగా చెక్కిన శాసనాలు..
ఆమె కొలువు దీరి
ఉండే ఆసనాలు..
ప్రతి ఆకు కదలికలో అమ్మ..
ప్రాంగణంలో
స్వాగతం పలుకుతూ
ఆమె బొమ్మ!

ఆ మహావిద్యాలయం
రామలింగారెడ్డి రాసిన
కంచికి చేరని కట్టమంచి కథ..
శ్వేతవస్త్రాల
జాజిమల్లి సర్వేపల్లి
అట నుంచే చేరెను ఢిల్లీ..
వి ఎస్ కృష్ణ సారు..
ఎ ఎల్ నారాయణ మాస్టారు
బుల్లయ్య గారు..
ఎం ఆర్ అప్పారావు…
జస్టిస్ ఆవుల సాంబశివరావు
రామకృష్ణారావు..
కె వి రమణ..
గోపాలకృష్ణా రెడ్డి..
రాధాకృష్ణ..సింహాద్రి..
వేణుగోపాల రెడ్డి..
బీల సత్యనారాయణ..
నేటి ప్రసాదరెడ్డి
నిన్నటి రాజు..
ఎవరికి వారే
చదువుల మారాజులు..
నిర్వహణా తరాజులు..
మాన్యులు..అసమాన్యులు!

ఆ మహాసంస్థ ఉపకులపతి
స్థానం వాగ్దేవి సంస్థానం..
ఎన్నెన్నో గొప్ప విద్యాసంస్థల
నిజస్థానం..
దరణినే చుట్టేసిన పూర్వ విద్యార్థుల విజయప్రస్థానం..!

ఏయూలో సీటా..
అది మామూలు మాటా..
ఆర్ట్స్…లా..ఇంజనీరింగ్..
ఫుల్లు స్వింగ్..
సౌత్ లో భవితకు నో డౌట్…
నార్త్ అయితే చుట్టేసినట్టే ఎర్త్
మొత్తానికి సీటు కొట్టావంటే
రుజువైనట్టే నీ వర్త్..
అక్కడ సీట్..
నీ ప్రతిభకు మానిక..
నీ ఘనతకు మాలిక..
భవితకు సూచిక..
చదువుల తల్లి
నీ నుదుటిన దిద్దే
పట్టాల తిలక…!

విద్యార్థులే కాదు మహామహులూ
పేరు ముందు డాక్టర్
కీర్తితో మెరిసి..
అవార్డుతో మురిసి..
వెరసి కళాప్రపూర్ణులై..
జీవితాన సంపూర్ణులై..!

నేను సైతం
ఆంధ్ర విశ్వవిద్యాలయం
పూర్వ విద్యార్థినేనని గర్వంగా చెప్పుకునే..

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286