Suryaa.co.in

Telangana

అప్పులు తేవడంలో కేసీఆర్ కు అన్నరేవంత్!

– భూములమ్మనిదే డబ్బులు దొరికే పరిస్థితి లేదు
– ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని కేసీఆర్ కాపాడారు
– ఇప్పుడు కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్‌ను రేవంత్ కాపాడుతున్నాడు
– అసలు ఆరు గంటలు ఏం చర్చించారు?
– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.కాసం వెంకటేశ్వర్లు

హైదరాబాద్: కాంగ్రెస్ కేబినెట్ మీటింగ్ అట్టహాసంగా జరిగింది. కానీ వారం రోజుల పాటు సుదీర్ఘ ప్రిపరేషన్ తర్వాత జరిగిన ఆ సమావేశంలో తేల్చింది ఏమీలేదు. నిర్ణయాలు ఏవీ లేవు. అసలు ఆ కేబినెట్ మీటింగ్ ఎందుకు పెట్టారన్నదే సందేహంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి దశదిశ కరువైంది.

రైతు భరోసా పేరిట రైతుల ఖాతాల్లో మొత్తం డబ్బులు జమ చేశామని చెప్పుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుని సమావేశాన్ని ముగించారు. అసలు ఆరు గంటల పాటు చర్చించిన అంశాలు ఏమిటో ప్రజలకు చెప్పడం లేదు. రైతు భరోసా పైసలు గత మూడు విడతలు ఎగ్గొట్టారు.

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కోర్టు మొట్టికాయలు వేస్తుందేమోననే భయంతో, పోటీకి అభ్యర్థులు దొరకరన్న ఆందోళనతో రైతు భరోసా పేరిట హడావుడిగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేశారు. వాస్తవంగా భూముల అమ్మకంల ద్వారా వచ్చిన నిధులను, అప్పులు తెచ్చిన పైసలతో రైతులకు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. భూములమ్మనిదే రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు దొరికే పరిస్థితి లేదు. అప్పులు చేయనిదే రోజులు గడిచే పరిస్థితి లేదు.

గతంలో కేసీఆర్ రూ.10 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు సీఎం పదవిలోకి వచ్చాక అదే దారిలో కొనసాగుతూ, కేసీఆర్‌ను మించిపోయే స్థాయిలో ప్రజలపై అప్పుల భారం పెడతారేమోనన్న అనుమానం కనపడుతోంది. అప్పులు తేవడంలో కేసీఆర్ కు అన్నగా మారే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్-బీఆర్ఎస్ దొందుదొందే. తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాయి.

బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు అవినీతిలో కవలపిల్లలు. ఒకరినొకరు రక్షించుకోవడానికి ఎన్ని కసరత్తులు చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి విషయంలో, సీఎం రేవంత్ రెడ్డి సీబీఐ విచారణకు ఎందుకు కోరడం లేదు? ఒకవైపు అవినీతి విచారణ కోసం ఘోష్ కమిషన్‌ను నియమించినట్టుగా పబ్లిక్‌కి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం… కానీ 18 నెలలు గడిచినా, ఆ కమిషన్‌కి ఆధారాలు ఇవ్వలేకపోయిన దురదృష్టకరమైన స్థితిలో ఉంది. ఇంకా కేబినెట్ లో ‘ఆధారాలు ఇవ్వాలా? వద్దా?’ అనే ఆలోచన చేశారు.

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని కేసీఆర్ కాపాడారు. ఇప్పుడు కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్‌ను రేవంత్ కాపాడుతున్నాడు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని, అది తెలంగాణకు వరప్రదాయిని అని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నరు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ అధికారుల ఇళ్లలో ఎలాంటి అక్రమాస్తులు దొరికాయో ప్రజలందరికీ తెలిసిన విషయమే.

ఒక అధికారి నూనె శ్రీధర్ వద్ద రూ.200 కోట్లు… హరిరామ్ అనే ప్రాజెక్టు ఈఎన్సీ వద్ద రూ.500 కోట్ల అక్రమాస్తులు బయటపడినప్పుడు, అధికారులే ఈ స్థాయిలో దోచుకున్నారంటే… అటు అధికారుల నియామకానికి, ముఖ్యమైన నిర్ణయాలకు బాధ్యత వహించినవారు ఎంత దోచుకున్నారో ప్రజలు ఊహించుకోవచ్చు. బీఆర్‌ఎస్ నేతలు, మాజీ మంత్రులు కాళేశ్వరంలో అవినీతి లేదు అని నిస్సిగ్గుగా తేల్చేస్తే, కాగ్ రిపోర్ట్ మాత్రం వారిని బొక్కబొర్లా పడేసింది.

భారతదేశ చరిత్రలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద కుంభకోణమని కాగ్ రిపోర్టు చెబుతోంది. అసలు ప్రాజెక్ట్ ఖర్చు రూ. 81 వేల 911 కోట్లుగా మొదలై… అది చివరకు రూ.1.47 లక్షల కోట్లకు ఎలా దూసుకెళ్లిందో కాగ్ స్పష్టంగా బయటపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఒక్క రూపాయికి గరిష్ఠంగా 52 పైసలే ఖర్చుపెట్టారని కాగ్ చేసిన వ్యాఖ్య బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని చాటిచెప్పే ఆధారం.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నాలుగు పార్టీలు మారిన నాయకుడు. దేశ చరిత్రలో ఓ విద్యార్థి నాయకుడు అవినీతి ఆరోపణలతో సస్పెండైన చరిత్ర లేదు. కాని అలాంటిది దాసోజు శ్రవణ్ విద్యార్థి నాయకుడిగా ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసి అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ఏకైక వ్యక్తి. అలాంటి వ్యక్తి నీతి గురించి మాట్లాడటం వింతగా ఉంది. ఐరన్ లెగ్ శాస్త్రిలా పార్టీలు మారుకుంటూ వచ్చిన ఆయనకు బిజెపిని విమర్శించే, నీతులు వల్లించే నైతిక హక్కులేదు.

మాజీ మంత్రి గంగుల కమలాకర్ పుస్తకాల గురించి, చదువు గురించి నీతులు చెబుతున్నారు. అసలు ఆయన జీవితమే కుంభకోణాలమయం. విలువైన ఖనిజాలను మైనింగ్ మాఫియాలకు విదేశాలకు ఎగుమతి చేసి రూ. 500 కోట్ల పన్నును ఎగ్గొట్టిన వ్యక్తి. కరీంనగర్‌లో మైనింగ్ మాఫియా అంటే గంగుల కమలాకర్ గుర్తు వస్తారు. అలాంటి వ్యక్తికి బిజెపి పై విమర్శలు చేసే నైతిక హక్కులేదు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్-బిజెపి ఒక్కటంటూ విమర్శలు చేయడం సిగ్గుచేటు.

నిజాయితీ అంటే తానే.. న్యాయానికి నిర్వచనం తానే అన్నట్లుగా మాట్లాడుతున్న బోయినపల్లి వినోద్ రావు పాత్రను ప్రజలే ప్రశ్నిస్తున్నారు. గతంలో కేసీఆర్‌కు తప్పుడు సలహాలు ఇచ్చి ఆయనను నష్టపరిచింది ఈయననే. యాదాద్రి పవర్ ప్రాజెక్టులో రూ. 500 కోట్ల అవినీతికి సంబంధించి వినోద్ పైనే ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్ శాఖలో అవినీతిని విచారించేందుకు ప్రభుత్వం నియమించిన కమిషన్ నివేదిక బయటకి రాకపోయినా, ఆ కమిషన్‌లో అవినీతి వ్యవహరానికి సంబంధించి వినోద్ పాత్రే ప్రముఖంగా కనపడినట్లు తెలిసింది.

వినోద్, దాసోజు శ్రవణ్, గంగుల కమలాకర్ లాంటి నాయకులు బిజెపి-కాంగ్రెస్ ఒకటేనంటూ జతకట్టే ప్రయత్నం చేస్తూ.. ముగ్గురూ నీతి గురించి మాట్లాడుతుంటే గురివింద గింజ సామెతలా ఉంది. ఇంకో బీఆర్ఎస్ నేత… తనకు ప్రజలు ఓటేయకుంటే చనిపోతానన్న వ్యక్తి కూడా ఇప్పుడు బిజెపి విమర్శలు చేస్తున్నాడు.

బీఆర్ఎస్ చేసిన అవినీతి పనులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఉద్యమం పేరుతో అమరవీరులపై రాజకీయం చేసి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్, మోసపు హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నపుడు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని, తాము అధికారంలోకి వస్తే అవినీతి సొమ్మును కక్కిస్తామని చెప్పారు.

కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గతంలో అనేకసార్లు ‘‘కాళేశ్వరం అవినీతిని బట్టబయలు చేస్తాం’’, సీబీఐతో విచారణ జరిపించాలని మాట్లాడారు. కానీ ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి కేసుపై సీబీఐ విచారణకు కోరాలని బిజెపి డిమాండ్ చేస్తున్నది.

LEAVE A RESPONSE