Suryaa.co.in

Andhra Pradesh

ముంచుకొస్తున్న ఒమిక్రాన్ –మొద్దు నిద్ర వీడని జగన్ ప్రభుత్వం

– ఒమిక్రాన్ తో ఏ ఒక్కరు మరణించినా అది ప్రభుత్వ హత్యే అవుతుంది
– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య

కరోనా కట్టడి కంటే కక్షసాధింపు చర్యలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మొదటి ప్రాధాన్యగా ఇవ్వడం దారుణమైన చర్య. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు 6 నమోదైనా ప్రభుత్వ యంత్రాంగంలో చలనం లేదు. ఒమిక్రాన్ కేసుల పెరుగుదల దృష్ట్యా దేశంలో 17 రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించి కఠినంగా ఆంక్షలు అమలు చేస్తుంటే మన రాష్ట్రంలో ఆ దిశగా చర్యలు శూన్యం.

నిర్లక్ష్యంతో కరోనా మొదటి, రెండో దశల్లో భారీ ప్రాణనష్టానికి కారణమైన ప్రభుత్వం గత అనుభవాల నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకోకపోవడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రికి ప్రజాధనంతో సొంత పత్రిక సాక్షిలో ప్రకటనలు ఇవ్వడంపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలను కాపాడటంలో లేకుండా పోయింది.

రాష్ట్ర బడ్జెట్ లో , ప్రభుత్వ నిధుల మంజూరులో కమీషన్లు వచ్చే పథకాలకే కేటాయింపులు ఘనంగా చేసుకుని కరోనా నివారణ, వైద్య రంగానికి కేటాయింపు విషయంలో ప్రభుత్వం ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేడంలేదు. కరోనా నివారణకు నిర్ధిష్ట ప్రణాళిక లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయకుండా కేవలం ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించి రాజకీయ కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇస్తోంది.

ఎంతసేపూ ముఖ్యమంత్రికి దోచుకోవడం, దాచుకోవడమే కానీ ప్రజారోగ్యం పట్టడం లేదు. నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దేశమంతా టీకాప్రక్రియ వేగంగా జరుగుతుంటే మన రాష్ట్రమేమో వ్యాక్సినేషన్ లో వెనకబడి ఉంది. రోజువారీ కరోనా కేసుల్లో 5వ స్థానంలో, వ్యాక్సినేషన్ లో 10వ స్థానంలో ఏపీ ఉందంటే అందుకు ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమే కారణం. ఒక్కసారిగా ఒమిక్రాన్ కేసులు పెరిగితే రాష్ట్రప్రజల పరిస్థితి ఏంటి? ప్రజల ప్రాణాలకు బాధ్యులెవరు?నేటికీ ప్రభుత్వాసుపత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి. ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం కాదా?

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సకాలంలో వైద్య సేవలు అందక కరోనాతో లక్షలమంది ప్రాణాలు కోల్పోయినా ఈ ప్రభుత్వం తనకేం సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరించింది. జాతీయస్థాయిలో పేరుగాంచిన స్క్రోల్ వెబ్ సైట్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా ఈ ఏడాది ఒక్క మే నెలలోనే లక్షా 30 వేల మంది వరకు మరణించారు . గత రెండు, మూడు సంవత్సరాలలో మే మాసంలో సుమారుగా 27 వేల మంది మరణిస్తే ఈ సంవత్సరం కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం వల్ల మరణాలు అత్యధికంగా పెరగాయి.వాస్తవాలు ఇలా ఉటే ప్రభుత్వం మాత్రం మే మాసంలో కోవిడ్ వల్ల కేవలం 2,938 చనిపోయినట్టు అధికారిక లెక్కల పేరుతో దొంగ లెక్కలు విడుదల చేసింది. దీన్ని మోసం చేయడం అనరా ముఖ్యమంత్రి గారూ?

వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యం పూర్తిగా పడకేసింది. నాడు-నేడు కింద వైద్య రంగం అభివృద్ధికి వేల కోట్లు కేటాయించి ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి మాటలు కేవలం సమీక్షలు, కాగితాలకే పరిమితం అవుతున్నాయి. వైద్యరంగాన్ని ఏదో ఉద్దరిస్తున్నట్టు ప్రచారార్భటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మానవాళిని చిధ్రం చేస్తున్న కరోనా నుంచి ప్రజలను రక్షించడంలో ఘోరంగా వైఫల్యం చెందింది.

కరోనా టీకా పంపిణీ నుంచి ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన వరకూ అన్నింటా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. కోవిడ్ సమయంలో మందులు, వైద్య పరికరాలు సరఫరా చేసిన కంపెనీలకు వందలకోట్ల బకాయిలు పెట్టడంతో ఇకపై వాటిని సరఫరా చేయొద్దంటూ ఏపీకి రెడ్ నోటీస్ ఇచ్చేదాకా తీసుకెళ్లారంటే ఎంత తలవంపులో ఆలోచించాలి.

పేదలకు ఉచిత వైద్యం కోసం వాడాల్సిన ఆరోగ్య శ్రీ నిధులను కూడా దారి మళ్లించారు. ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ ను రోడ్డున పడేశారు. రెండున్నరేళ్లుగా జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో కనీస వసతులు లేక గ్రామీణులు వైద్యం కోసం అల్లాడుతున్నారు. మందుల కొరత వేధిస్తోంది. కానీ ఇవేమీ ప్రభుత్వానికి పట్టడం లేదు.ఏదో వైద్యఆరోగ్యశాఖ ఉంది. దానికీ ఒక మంత్రి ఉండాలి కాబట్టి ఆళ్ల నాని ఉన్నారన్నట్టుగా పరిస్థితి ఉందే కానీ ఆయన ఏనాడూ క్షేత్రస్థాయిలో ఆస్పత్రులను సందర్శించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న దాఖలాలు లేవు.

ప్రజారోగ్యం కోసం కేంద్రం విడుదల చేస్తున్న వందల కోట్ల రూపాయల నిధులనూ దారి మళ్లించేస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి , వైద్యశాఖ యంత్రాంగం మొద్దు నిద్ర వీడాలి. కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి. ఆస్పత్రుల్లో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పించాలి. ప్రభుత్వానికి కేంద్రం, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రతిపక్షాలు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ అప్రాధాన్య విషయాలపై దష్టి సారిస్తోంది. ఒమిక్రాన్ తో ఏ ఒక్కరు మరణించినా అది ప్రభుత్వ హత్యగానే భావించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి, ప్రభుత్వం గుర్తించాలి.

LEAVE A RESPONSE