అవినాష్‌ రెడ్డిని కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం ఎత్తులు

-అందుకే సీబీఐ విచారణకు అడ్డంకులు
-ఘటనా స్థలంలో ఆధారాల ధ్వంసంలో అవినాష్‌రెడ్డి పాత్ర
-ఢిల్లీ ల్యాబరేటరీలో విశ్లేషించి నిర్ధారించిన సీబీఐ
-నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు
-అవినాష్‌ రెడ్డి ఇంటికి పదేపదే సునీల్ రాకపోకలు
-ముందు వాంగ్మూలం ఇచ్చి.. తర్వాత మాట మార్చారు
-వివేకా కుమార్తె సునీత అఫిడవిట్‌

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డిని కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తోందని.. వివేకా కుమార్తె సునీత అన్నారు. అందుకే సీబీఐ విచారణకు అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. ఈమేరకు తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును అడ్డుకుని, ఎంపీ అవినాష్‌ రెడ్డిని రక్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికార యంత్రాంగం, ప్రభావితం చేయగల వ్యక్తులు.. వివిధ రకాల ఎత్తుగడలు వేస్తున్నారని వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ హత్యకు ప్రణాళిక రూపకల్పన, అమలు, హత్య తర్వాత ఘటనా స్థలంలో ఆధారాల ధ్వంసంలో అవినాష్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు.. సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రాలు, సాక్షుల వాంగ్మూలాల ద్వారా ఇప్పటికే స్పష్టంగా వెల్లడైందన్నారు. అవినాష్‌ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా తనపైన, తన కుటుంబంపైన తీవ్రమైన నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా, విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డు చేసేలా సీబీఐని ఆదేశించాలంటూ అవినాష్‌ రెడ్డి ఇటీవల తెలంగాణ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఆ పిటిషన్లో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలంటూ సునీత తెలంగాణ హైకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్‌, అఫిడవిట్‌ దాఖలు చేశారు.

దర్యాప్తు జాప్యం చేయాలనే ఇలా చేస్తున్నారు
జనవరి 23న విచారణకు రమ్మంటే అవినాష్‌ రెడ్డి జనవరి 28న సీబీఐ ముందు హాజరయ్యారని, దర్యాప్తును జాప్యం చేయాలనే ఇలా చేస్తున్నారని అఫిడవిట్‌లో ప్రస్తావించారు. సీబీఐ దర్యాప్తునకు సహకరించకుండా నిరర్థక పిటిషన్లు వేస్తున్నారని వివరించారు. అధికారుల పైనే నిరాధార ఆరోపణలు చేస్తూ దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని తెలంగాణ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వివేకా హత్యకు కొన్ని గంటల ముందు.. అనగా 2019 మార్చి 14 సాయంత్రం 6.14 గంటల నుంచి 6.33 గంటల వరకు.. నిందితుడైన సునీల్‌ యాదవ్‌.. ఎంపీ అవినాష్‌ రెడ్డి ఇంట్లోనే ఉన్నారని గూగుల్‌ టేకవుట్‌కు సంబంధించిన ఫోరెన్సిక్‌ విశ్లేషణలో వెల్లడైందని సునీత అఫిడవిట్‌లో పేర్కొన్నారు.హత్యకు ముందురోజు కూడా భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ఇంటికి సునీల్‌ పదే పదే రాకపోకలు సాగించాడన్నారు. 2019 మార్చి 14 అర్ధరాత్రి నుంచి 15వ తేదీ తెల్లవారుజాము వరకూ సునీల్‌ యాదవ్‌ వారింటికి వెళ్లినట్లు సీబీఐ దర్యాప్తులో తేలిందన్నారు. 2019 మార్చి 15న ఉదయం 6.25 గంటల ప్రాంతంలో అవినాష్‌ రెడ్డికి సన్నిహితుడైన గజ్జల ఉదయ్‌ కుమార్‌రెడ్డి కూడా ఎంపీ ఇంట్లోనే ఉన్నారని.. 6.27 గంటల సమయంలో ఆయన వివేకానందరెడ్డి ఇంటి బయట ఉన్నట్లు మొబైల్‌ ఫోన్‌ లొకేషన్‌ ద్వారా వెల్లడైందన్నారు. ఉదయం 6గంటల 29 నిమిషాల నుంచి 6గంటల 31 నిమిషాల మధ్య ఉదయ్కుమార్ రెడ్డి.. వివేకా ఇంటి లోపల ఉన్నట్లు గూగుల్‌ టేకవుట్‌కు సంబంధించిన సమాచారాన్నిదిల్లీలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీలో విశ్లేషించి సీబీఐ అధికారులు నిర్ధారించినట్లు పేర్కొన్నారు.

వివేకా హత్య సమయంలో పులివెందుల సీఐగా ఉన్న జె.శంకరయ్య.. సీబీఐకి తొలుత ఇచ్చిన వాంగ్మూలంలో అవినాష్‌ రెడ్డితో పాటు ఇతరులను అనుమానితులుగా పేర్కొన్నారని గుర్తు చేశారు. వివేకా హత్యా నేరాన్ని మీద వేసుకుంటే భాస్కర్‌ రెడ్డి, అవినాష్‌ రెడ్డి 10 కోట్ల రూపాయలు చెల్లిస్తారంటూ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనకు ఆఫర్‌ ఇచ్చారని సాక్షుల్లో ఒకరైన కల్లూరు గంగాధర్‌రెడ్డి తొలుత సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం ఇమ్మంటే.. వీరిద్దరూ మాట మార్చేశారని చెప్పారు. అందుకే సీబీఐ అధికారి హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. సీబీఐ దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ వేధిస్తున్నారంటూ అవినాష్‌ రెడ్డికి సన్నిహితుడైన గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు ఇవ్వడంతో కడపలో కేసు నమోదైందన్నారు. దీనిపై రామ్‌సింగ్‌ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. వివేకా హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, అనుమానితుడైన అవినాష్‌రెడ్డిని కాపాడాలన్న ఉద్దేశంతో.. సీబీఐ తనను హింసిస్తోందంటూ ఎంవీ కృష్ణారెడ్డి కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారని చెప్పారు. తనపైన, తన భర్తపైనా ఆయన ఆరోపణలు చేశారన్నారు.

Leave a Reply