– కృష్ణా బేసిన్ నుంచి ఏపీ ఎక్కువ నీళ్లు తోడుకుంటోంది
– కేంద్రానికి ఫిర్యాదు చేశాం
– మీడియాతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
న్యూఢిల్లీ : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఏపీపై విరుచుకుపడ్డారు. కృష్ణాబేసిన్‌లో ఎక్కువ నీటిని వినియోగించుకుంటున్న ఏపీని అడ్డుకోవాలని కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు.
కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా బేసిన్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధిక నీటిని తీసుకుంటోందని ఆయన విమర్శించారు. నీటి తరలింపును అడ్డుకోవాలని తాము కేంద్రాన్ని కోరామని స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కార్యాలయం వెలుపల సీఎం రేవంత్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ చేపడుతోన్న బనకచర్లపై తమ అభ్యంతరాన్ని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు తెలియజేశామన్నారు. అయితే ఏపీ నుంచి ఈ బనకచర్ల ప్రాజెక్ట్‌పై తమకు ఎలాంటి డీపీఆర్ రాలేదని మంత్రి వివరించారని చెప్పారని తెలిపారు.
పాలమూరు, రంగారెడ్డి, సమ్మక్క – సారక్క ప్రాజెక్టులకు.. త్వరగా నీటి కేటాయింపులు చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. ఇక తమ ప్రాజెక్టులకు సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ ఇంకా రాలేదని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరామని చెప్పారు.