– ఉప్పందుకుని ఢిల్లీ వెళ్లిన ఎంపీ రఘురామకృష్ణం రాజు
– ఆరెస్సెస్ చీఫ్ దత్తాత్రేయ హోసబలే కార్యక్రమానికి హైదరాబాద్ వచ్చిన రాజు
– మళ్లీ అరెస్టు చేయాలని ప్రయత్నించిన ఏపీ పోలీస్
– ఇంటి బయట తచ్చాడిన నిఘా పోలీసును కనిపెట్టిన రాజు
– తెలుసుకుని ఢిల్లీ వెళ్లిన ఎంపీ రఘురామకృష్ణంరాజు
– మరోసారి ప్రధాని మోదీకి లేఖ
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ సీఎం జగన్ సర్కారుపై నిత్యం విమర్శల దాడి చేసి, ప్రభుత్వ చర్యలో భాగంగా ఒకసారి అరెస్టయిన నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. తాజాగా మరో అరెస్టు ముప్పును వ్యూహాత్మకంగా
తప్పించుకున్నారు. తన ఇంటి ముందు తచ్చాడుతున్న ఏపీ నిఘా విభాగానికి చెందిన ఓ పోలీసును గమనించిన రాజు సిబ్బంది, ఆయన వద్ద అసలు విషయం తెలుసుకుని, ఎంపీకి ఉప్పందించారు. దానితో ఆయన శవివారం అప్పటికప్పుడు ఢిల్లీకి వెళ్లిపోయారు. అయితే, దీనిపై ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. తనను ఏపీ పోలీసులు వేధిస్తున్నందున, ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని తన లేఖలో కోరారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు శుక్రవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ ఎంవీఆర్ శాస్త్రి రాసిన ‘నేతాజీ’ పుస్తకాన్ని, ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ
హోసబలే ఆవిష్కరించారు. ఆ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి వచ్చిన రాజు, ముఖ్య అతిథిగా వచ్చిన సంఘ్ చీఫ్‌తో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంలో ఆదివారం వరకూ తాను హైదరాబాద్‌లోనే ఉంటానని రాజు తనను కలసిన మీడియాకు చెప్పారు.
అయితే శనివారం మధ్యాహ్న సమయంలో ఒక వ్యక్తి ఎంపీ నివాసం గచ్చిబౌలి ఎమ్మార్ విల్లాస్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని ఆయన సిబ్బంది గమనించి, ఆ విషయాన్ని ఎంపీ దృష్టికి
తీసుకువెళ్లారు. దానితో ఆయన సీసీ టీవీని పరిశీలించి, వచ్చిన ఆ వ్యక్తి ఏపీ పోలీసుకు సంబంధించిన వారుగా గ్రహించారు. సదరు వ్యక్తి ఫొటో, టూవీలర్ నెంబర్ ఫొటోను కూడా తీయించడం గమనార్హం.
విషయం కనుక్కోమని సిబ్బంతిని పురమాయించారు. ఆ సందర్భంలో తాను ఏపీ పోలీసునని, ఎంపీ
రాజును తీసుకువెళ్లేందుకు ఏపీ నుంచి పోలీసులు వస్తారని, అందుకే తాను ఇక్కడకు వచ్చానని మాటల సందర్భంలో రాజు సిబ్బందికి వెల్లడించారట. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ రాజు అప్పటికప్పుడే ఢిల్లీకి బయలుదేరారు.
కాగా.. శనివారం తనకు జరిగిన అనుభవాన్ని ఎంపీ రాజు ప్రధానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. గతంలో తనపై జరిగిన అక్రమ అరెస్టుకు సంబంధించిన వివరాలు మరోసారి గుర్తు చేసిన ఎంపీ రాజు.. తన ఫిర్యాదు ఇంకా లోక్‌సభ ప్రివిలేజీ కమిటీ పరిశీలనలోనే ఉందని పేర్కొన్నారు. తనపై దాడి చేసిన వారిలో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఉన్నారన్న విషయాన్ని ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకూ ఏపీ డీజీపీ లోక్‌సభ కోరిన వివరణకు సైతం సమాధానం ఇవ్వలేదని ప్రధానికి రాసిన లేఖలో వివరించారు. ఏపీ ప్రభుత్వ కక్షపూరిత చర్యలతో తాను సొంత నియోజకవర్గంలోపాటు, చివరకు తెలంగాణ రాష్ట్రమైన హైదరాబాద్ కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని ఎంపీ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.