– చేతి వృత్తుల వారి చేతులు నరికేసి.. నిస్సిగ్గుగా తప్పుడు ప్రచారం
– మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
బీసీలకు ఏదో ఒరగబెట్టాం, ఉద్దరించేశామంటూ మాయమాటలు చెబుతున్నారు. చేదోడు పథకంలో 2.85 లక్షల మంది నాయీబ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఏదో చేస్తున్నట్లు హడావుడి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సాధికార సర్వే ప్రకారం …… జనాభా వివరాలు. ఉన్న జనాభా ఎంత.? ప్రభుత్వం చేదుడో పథకానికి అర్హులుగా గుర్తించింది ఎంత మందిని.?
నాయీ బ్రహ్మణులు, రజకులు, టైలర్లలో 10శాతం మందికి చిల్లర విదిల్చి అందర్నీ ఉద్దరించేస్తున్నానంటూ ప్రచారం చేసుకుంటూ బీసీలను నయవంచనకు గురి చేస్తున్నారు. షాపులు ఉండాలి, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ కావాలంటూ నిబంధనలు పెట్టడం వంచించడం కాదా.? ఇప్పటికీ ఎంతో మంది రజకులు తోపుడు బండ్లపై, అపార్ట్ మెంట్ల సమీపంలో బల్లలు వేసుకుని ఇస్త్రీ చేసుకునే వారు పథకానికి అర్హులు కాదనడం ద్రోహం చేయడం కాదా.?
గతంలో బీసీ కార్పొరేషన్ల ద్వారా రూ.2లక్షల చొప్పున రుణాలిచ్చి స్వయం ఉపాధి కల్పించాం. గత రెండేళ్లలో బీసీ కార్పొరేషన్ ద్వారా ఎంత మందికి రుణాలిచ్చారు? ఫెడరేషన్ల ద్వారా గ్రూప్ రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తే.. గత రెండున్నరేళ్లలో ఎంత మందికి ఆర్ధిక భరోసా కల్పించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఏటా రూ.10వేలు ఇస్తూ.. బీసీ కులాలు ఎప్పుడు అక్కడే ఉండాలి, ఆర్ధికంగా స్థిరపడకూడదు అనేలా ప్రభుత్వం వ్యవహరిస్తుండడం అత్యంత దుర్మార్గం.
గతంలో ఆదరణ పథకం ద్వారా 90 శాతం సబ్సిడీతో చేతి వృత్తుల వారికి పరికరాలు అందిస్తే.. నేడు మనసొప్పక ఆ పరికరాలు తుప్పు పట్టిస్తూ, చివరికి పరికరాలు ఇవ్వక, లబ్దిదారులు కట్టిన సొమ్ము కూడా తినేశారు.బీసీలకు చాలా చేసేశాం అంటున్న ముఖ్యమంత్రి బీసీలకు ఎంతటి ద్రోహం చేశారో వివరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. దానిపై చర్చకు ప్రభుత్వం సిద్ధమా.? బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 ఉన్న రిజర్వేషన్లను 24 శాతానికి కుదించి.. 16,800 మందికి అవకాశాలు దూరమవ్వడానికి ప్రభుత్వ అసమర్ధత కారణం కాదా.?
56 బీసీ కార్పొరేషన్లు పెట్టి, ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించి.. రూపాయి బడ్జెట్ కేటాయించకుండా ఉత్సవ విగ్రహాలను చేయడం కాదా.? నిధులు లేని, అడ్రస్ కూడా లేని కార్పొరేషన్లకు నియమించిన ఛైర్మన్లు, డైరెక్టర్లు ఏం చేయాలి.? బీసీలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తే.. నేడు వాటిని జగన్ రెడ్డి నిర్వీర్యం చేయడం వాస్తవం కాదా.? రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు, ఛైర్మన్లు, సలహాదార్లు, యూనివర్శిటీ వీసీల్లో బీసీలకు కనీస అవకాశాలు కూడా ఇవ్వకుండా.. సొంత సామాజిక వర్గాన్ని నియమించుకుని బీసీలను అవమానించారు. బీసీలు ఉన్నత పదవులకు పనికిరారా.?
బలహీన వర్గాలు ఎప్పుడూ తమ చెప్పు చేతల్లో ఉండాలి అనేలా ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు. గతంలో విద్యార్ధులకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశాం. ఒక్కో విద్యార్ధికి రూ.20 లక్షలు ఇచ్చి విదేశీ విద్య కల్పించాం. పీజీ విద్యార్ధులకు కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చాం. స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. కానీ.. జగన్ రెడ్డి ఆయా పథకాలన్నీ ఎత్తేసి.. విద్యాపరంగా, ఉపాధి పరంగా దెబ్బతీసి.. ఉద్దరించేశామని ప్రచారం చేసుకోవడానికి మనసు ఎలా అంగీకరిస్తోంది.?
ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ప్రశ్నిస్తూ విద్యార్ధులు, యువత, రైతులు, ఉద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంటే దాన్నీ ప్రతిపక్షంపైకి నెట్టేస్తారా.? రెండున్నరేళ్లలో ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా.. వాలంటీర్లు, చేపల మార్టులు, మటన్ కొట్టులతో సరిపెట్టుకోండి అనేలా జగన్ రెడ్డి వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారు. ఒకవైపు పన్నుల దోపిడీ, మరోవైపు ఖజానా లూటీ చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి దుర్మార్గపు విధానాలు వీడకుంటే.. బలహీన వర్గాలన్నీ ఏకమై తాటతీయడం ఖాయమని గుర్తుంచుకోవాలి.