– హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్
– విజిలెన్స్ శిక్షించే వ్యవస్థగా కాదు
– సంస్కరించే వ్యవస్థగా రూపుదిద్దుకోవాలి
– జీఎస్టీ రంగారెడ్డి కమిషనరేట్ ప్రిన్సిపల్ కమిషనర్ జి.శ్రీనివాస రావు
– సింగరేణి విజిలెన్స్ వారోత్సవాల్లో ప్రముఖుల సందేశాలు
రానున్న రోజుల్లో దేశంలోని 10 రాష్ట్రాల్లో సింగరేణి కార్యకలాపాలు: సీఎండీ ఎన్.బలరామ్
హైదరాబాద్: అవినీతి అక్రమాలు, నేరాలను నియంత్రించే క్రమంలో విజిలెన్స్ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తే పారదర్శకత, ఉత్పాదకత రెండూ గణనీయంగా పెరుగుతాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.
హైదరాబాద్ సింగరేణి భవన్ లో శుక్రవారం ఉదయం నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ఐదో రోజు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సమావేశానికి సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ అధ్యక్షత వహించారు.
సజ్జనార్ మాట్లాడుతూ, “అవినీతి, అక్రమాలు తగ్గాలంటే వ్యవస్థల్లో మౌలిక మార్పులు అవసరం. లోపభూయిష్టమైన విధానాలు అక్రమాలకు దారితీస్తాయి. కాబట్టి వ్యవస్థను పటిష్టపరచి, మంచి అలవాట్లు, పద్ధతులను అమల్లోకి తేవాలి,” అని పేర్కొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.
సింగరేణి సంస్థతో తనకు 25 సంవత్సరాల అనుబంధం ఉందని పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. నేడు దేశ జీడీపీ పెరుగుదలలో ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ యువ సీఎండీ ఎన్ బలరామ్ సారథ్యంలో పలు వ్యాపార విస్తరణ చర్యల ద్వారా గ్లోబల్ కంపెనీగా రూపుదిద్దుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ దిశగా మరింత వేగంగా ఎదగాలి అని ఆయన తన శుభాకాంక్షలు తెలియజేశారు.
మార్పు స్వీకరించడంలో వెనుకబడ్డ అనేక కంపెనీలు మూతపడ్డాయని గుర్తుచేసి, సింగరేణి ఉద్యోగులు సవాళ్లను స్వీకరించి, తమ నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలని సూచించారు. విజిలెన్స్ విభాగం ఇతర సంస్థల్లో అమలు చేస్తున్న మంచి పద్ధతులను స్వీకరించడం ద్వారా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.
జీఎస్టీ రంగారెడ్డి కమిషనరేట్ విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన కార్యక్రమంలో మరొక ముఖ్యఅతిథిగా పాల్గొన్న జీఎస్టీ రంగారెడ్డి కమిషనరేట్ ప్రిన్సిపల్ కమిషనర్ జి .శ్రీనివాసరావు మాట్లాడుతూ… నేటి ఆధునిక పరిస్థితుల్లో విజిలెన్స్ శాఖ అంటే శిక్షించే వ్యవస్థగా కాకుండా సంస్కరించే శాఖగా రూపు దిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతీ ఉద్యోగి చేయాల్సిన ప్రతీ కార్యకలాపాన్ని స్థిరంగా మరియు నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఎలా నిర్వహించాలో తెలిపే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్సు ను రూపొందించాలని సూచించారు. దీనివల్ల పొరపాట్లు జరగడానికి అవకాశం ఉండదని, అలాగే అవినీతిని నిరోధించవచ్చని పేర్కొన్నారు. విజిలెన్స్ శాఖ అవినీతి అక్రమాలను అడ్డుకునే క్రమంలో అత్యుత్సాహం తో నిజాయతీగా పనిచేసే అధికారులను మాత్రం భయపెట్టకూడదని అభిప్రాయపడ్డారు. దీనివల్ల విజిలెన్స్ యొక్క అసలు లక్ష్యం పక్కదారి పడుతుందన్నారు.
బాగా పనిచేసే అధికారులకు, ఉద్యోగులకు ప్రశంసలు అవసరమని, ఇవి వారు మరింత బాగా పనిచేయటానికి ఉపయోగపడతాయన్నారు. ఉద్యోగులకు తెలియకుండా పొరపాట్లు జరిగినప్పుడు వాటిని సరిదిద్దుకునే అవకాశాన్ని ఉద్యోగులకు కల్పించాలన్నారు. తాము పనిచేస్తున్న పనికి జీతం తప్ప వేరే ఇంకా ఏమీ ఆశించని స్థాయికి ఉద్యోగులు తమ ఆలోచనలు మార్చుకోవాలని, అప్పుడు విజిలెన్స్ శాఖ అవసరం ఉండదు అన్నారు. ప్రతి ఉద్యోగి ప్రశాంతంగా తమ బాధ్యతలు నిర్వహించాలని, ప్రలోభాలకు లోను కాకూడదని పేర్కొన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ, సింగరేణి సంస్థ చేపడుతున్న వ్యాపార విస్తరణ చర్యలను వివరించారు. ఉద్యోగుల్లో క్రమశిక్షణ తీసుకురావడం కోసం, పని గంటల సద్వినియోగం కోసం ప్రత్యేక చొరవ చూపుతున్నామని, వ్యవస్థలను మరింత పటిష్ట పరిచేందుకు ఈసారి విజిలెన్స్ వారోత్సవాలలో ప్రముఖులను ఆహ్వానించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
రానున్న రోజుల్లో దేశంలోని 10 రాష్ట్రాల్లోనూ కార్యకలాపాలు నిర్వహించేలా, అలాగే అంతర్జాతీయంగా ఖనిజ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేలా విస్తరణ ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు.
సంస్థ డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, తిరుమల రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్ మెంట్ మరియు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి వెంకన్న, జీఎం(కో ఆర్డినేషన్) టి.శ్రీనివాస్, అన్ని ఏరియాల జీఎంలు, కార్పోరేట్ జీఎంలు, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు పాల్గొన్నారు.