గుంటూరులో ప్లాస్టిక్ సంచుల నిషేధం

పర్యావరణ పరిరక్షణ కోసం ఈ నెల 10వ తేదీ నుంచి
నగరంలో ప్లాస్టిక్ సంచుల విక్రయం, వినియోగం నిషేధం
పక్కాగా అమలులో ఉంటుందని కమిషనర్ అనురాధ ఒక
ప్రకటనలో తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారికి భారీ
మొత్తంలో జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ప్రతి
ఒక్కరూ మార్కెట్‌కు వచ్చేటప్పుడు ఇంటి నుంచి వస్త్రం,
పేపర్, జూట్ సంచులను వెంట తెచ్చుకోవాలని తెలిపారు.
నిషేధిత ప్లాస్టిక్ సంచులు విక్రయించినా, వినియోగించినా
చర్యలు తీసుకుంటామన్నారు. పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు
ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్లాస్టిక్ సంచుల తయారీ
దారులపై రూ. 50 వేలు, రిటైల్ వర్తకులకు రూ. 2, 500
నుంచి రూ. 15 వేలు, వినియోగదారులపై రూ. 250 నుంచి
రూ. 500 అపరాధ రుసుం విధిస్తామన్నారు. తయారీ, విక్రయ
సంస్థలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్
చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.