కేసీఆర్… కౌలు రైతుకు రక్షణేదీ?

– సీఎంకు బీజేపీ చీఫ్ బండి సంజయ్ లేఖ

తెలంగాణ రాష్ట్రంలో కౌలురైతులకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి సం6ఏమ పథకాలు అమలుకావడం లేదంటూ ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. లేఖ పూర్తి పాఠం ఇది.

గౌరవనీయులైన శ్రీ కె.చంద్రశేఖరరావు గారికి,
ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

నమస్కారం …
విషయం: రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులకు రక్షణ మరియు ఇతర రైతు సంక్షేమ పథకాలు అమలు చేయడం గురించి …
రాష్ట్రంలో సుమారు 14 లక్షల మంది కౌలురైతులు ఉన్నారు. వీరిలో సొంత వ్యవసాయ భూమి కొద్దిమందికి ఉండగా ఎక్కువమంది భూమి కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం వెళ్ళదీస్తున్నారు. ప్రభుత్వం నుండి ఎటువంటి గుర్తింపును కౌలు రైతులు నోచుకోక పోవడంతో వీరికి సాధారణ రైతాంగానికి వర్తించే ఏ సంక్షేమ పథకం అమలు కావడం లేదు.

భూమిపై నిజంగా సేద్యం చేసే కౌలు రైతులకు రైతు బంధు, రైతు బీమా, యంత్ర లక్ష్మి వంటి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు పొందే సౌకర్యం లేదు. వ్యవసాయానికి పంట రుణాలు అందడం లేదు. భూమిపై వ్యవసాయమే చేయని భూయజమానులు రైతుబంధుతో పాటు భూమిపై కౌలు కూడా తీసుకుంటూ రైతు భీమ సహ ఇతర సంక్షేమ పథకాలు పొందుతున్నారు. కాయ కష్టం చేసే కౌలు రైతులకు మాత్రం ఈ పథకాలను వర్తింప చేయకపోవడం సమర్థనీయం కాదు.

భూ యాజమానుల హక్కులకు ఎటువంటి భంగం వాటిళ్లకుండా రాష్ట్రాలు కౌలు చట్టాలలో మార్పులు చేసుకోవాలని 11వ పంచవర్ష ప్రణాళిక పేర్కొన్నది. కౌలు చట్ట సవరణ అంటే భూయజమాని, కౌలు దార్లకు భరోసా కల్పించే విధంగా సవరణలు ఉండాలని ఆ నివేదికలో స్పష్టం చేశారు. కాని రాష్ట్ర ప్రభుత్వం కౌలుదార్లకు ఎటువంటి హక్కులు కల్పించకపోగా వారిని కనీసం రైతులుగా గుర్తించడానికి కూడా నిరాకరించడం గర్హనీయం. పావలా వడ్డీకి కౌలుదార్లకు రుణాలు ఇవ్వవచ్చని నాబార్డు సూచించింది.

ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ రైతాంగానికి వర్తింపజేసే పథకాలను కౌలుదార్లకు అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. కాని కౌలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న్న చిన్న, సన్నకారు రైతులపై తెరాస ప్రభుత్వం చూపుతున్న వివక్ష క్షమించరానిది.

భూమిని సాగు చేసి పంట పండించే వాడే నిజమైన రైతు. అలాంటి రైతుకు బోనస్ సహా ఎరువులు, విత్తనాలతోపాటు వ్యవసాయ సబ్సిడీలన్నీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అవసరమైతే తగు చట్టాలు తీసుకొచ్చి లేదా ఉన్న చట్టాలలో సవరణలు తెచ్చి అయినా కౌలు రైతులను ఆదుకునేలా తక్షణ చర్యలు తీసుకోవాలి.

కౌలు రైతుల సమస్యలపై చర్చించేందుకు రైతుసంఘాలు, మేధావులు, అన్ని రాజకీయపార్టీలతో వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్రశాఖ డిమాండ్‌ చేస్తున్నది.
అభినందనలతో …

బండి సంజయ్‌కుమార్‌, ఎం.పి,
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి.

Leave a Reply