– చెరువుల్లా మారిన రోడ్లపై వరి నాట్లు వేసిన బిసివై శ్రేణులు
– గుంతల మయమైన పుంగనూరు, బెంగుళూరు మార్గం
– ఎంత మంది పాలకులు వచ్చినా దోచుకోవడం పైనే శ్రద్ద
– బిసివై పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తుంది
– వినూత్న నిరసనలో బిసివై పార్టీ నేతల స్పష్టం
పుంగనూరు: రోడ్ల దుస్థితిపై భారత చైతన్య యువజన పార్టీ వినూత్న నిరసన చేపట్టింది. కొంచెం వర్షం వచ్చినా చెరువుల్లా తలపించే రోడ్లపై వరినాట్లు వేస్తూ నిరసనకు దిగింది. బుధవారం పుంగనూరు, బెంగుళూరు మార్గంలో రోడ్ల దుస్థితిపై తన గళం విప్పింది. ప్రతి రోజూ పుంగనూరు బెంగుళూరు మధ్య వేలాది మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కానీ రోడ్లు మాత్రం చాలా అధ్వాన్నంగా తయారయ్యాయి. దీంతో ప్రజా సమస్యను గుర్తించిన బిసివై పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ గతంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వం నెంబర్ టూగా చెప్పుకునే వ్యక్తి కనీసం రోడ్లను పట్టించుకోలేదన్నారు. రోడ్ల దుస్థితిపై ఏనాడు చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు. అలాగే కూటమి అధికారంలోకి వచ్చి 17 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు రోడ్ల దుస్థితిపై చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్షన్ల మీద ఉన్న శ్రద్ద అభివ్రుద్దిపై లేదని దుయ్యబట్టారు.
ఇలాంటి వారికి అధికారం ఇచ్చే ముందు ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది దోపిడీ చేసి అరాచకాలు చేయడం కోసం కాదన్నారు. బిసివై పార్టీకి ఒక్కసారి అవకాశం కల్పిస్తే అభివ్రుద్ది అంటే ఏంటో చేసి చూపిస్తుందని ఈ సందర్భంగా బిసివై పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసివై పార్టీ నేతలు రమేష్ యాదవ్, హరి యాదవ్, పూల ప్రేమకుమార్, కుమ్మరి గిరిబాబు, శివకుమార్, భానుప్రకాష్, చంద్రమౌళి, స్వాతి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.