Suryaa.co.in

Editorial

రాజ్యసభకు బీద, సాన, కృష్ణయ్య

– ఖరారు చేసిన సీఎం చంద్రబాబునాయుడు
– పవన్ అన్న నాగబాబుకు మంత్రి పదవి
– బీజేపీలో చేరిన కృష్ణయ్యకు బీఫారంతోపాటు పార్టీ సభ్యత్వం
– ఉత్కంఠకు తెరవేసిన కూటమి
– హైదరాబాద్‌లో కసరత్తు చేసిన బాబు, లోకేష్
– సాన అభ్యర్ధిత్వంపై టీడీపీలో అసంతృప్తి
– ఆయన ఎవరంటూ సోషల్‌మీడియా సైనికుల ప్రశ్నల వర్షం
– అయినా పట్టించుకోని బాబు,లోకేష్
– తమ నిర్ణయానికే కట్టుబడిన వైనం
– ఇకపై ఇదే విధానం అమలుచేసే అవకాశం
– బీద, సాన, కృష్ణయ్య పేర్ల ఖరారుపై నిజమైన ‘మహానాడు’ జోస్యం
– అందరికంటే ముందే చెప్పిన ‘మహానాడు’
– ‘రాజ్యసభ అభ్యర్ధులు ఖరారు’ శీర్షికతో గత నెల3వన మహానాడు కథనం
( మార్తి సుబ్రహ్మణ్యం)

అనుకున్నదే అయింది. పెద్దల సభకు కూటమి ఎవరి ఒత్తిళ్లు, నిరసనలు, అభ్యంతరాలు ఖాతరు చేయకుండా తాను అనుకున్నదే చేసింది. రాజ్యసభ వైసీపీ ఎంపీలయిన బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్య తమ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో ఉప ఎన్నిక వచ్చింది. వారి స్థానంలో బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య టీడీపీ,బీజేపీ అభ్యర్ధులుగా బరిలో దిగారు. అయితే మోపిదేవి స్థానంలో.. కాకినాడకు చెందిన పారిశ్రామికవేత్త సాన సతీష్‌కు అనూహ్యంగా టీడీపీ అభ్యర్ధిత్వం దక్కింది. యనమల రామకృష్ణుడు, టిడి జనార్దన్, దేవినేని ఉమ వంటి సీనియర్లను కాదని, కొత్త ముఖమైన సాన సతీష్‌ను తెరపైకి తెచ్చిన నాయకత్వం అందరినీ విస్మయపరిచింది. కాగా ఈ ముగ్గురికీ రాజ్యసభ సీటు దక్కుతుందని, గత నెల 30న ‘రాజ్యసభ అభ్యర్ధులు ఖరారు’ పేరిట వెలువరించిన వార్తా కథనం ఇప్పుడు నిజమయింది.

నిజానికి సాన సతీష్ అభ్యర్ధిత్వం తెరపైకి రావడంతో, రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక ప్రకటన ఆలస్యమయింది. పార్టీ నాయకత్వానికి తప్ప, పార్టీ శ్రే ణులకు ఆయన పేరు తెలియకపోవడం, ఆయనపై గతంలో అనేక కేసులు నమోదుకావడం వంటి కారణాలతో సతీష్ పేరుపై పార్టీ వర్గాల్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తమయింది. అసలు ఆయన పార్టీలోకి ఎప్పుడు వచ్చారన్న ప్రశ్నలు టీడీపీ సోషల్‌మీడియా సైనికులు సంధించడం విశేషం.

అయితే మోపిదేవితో ఆయనే ఎంపీ పదవికి రాజీనామా చేయించుకుని, ఆమేరకు ఆయనను ‘సంతృప్తిపరిచే’ బాధ్యత కూడా సతీషే తీసుకున్నందున.. ఆ సీటు సానకే ఇవ్వడం ధర్మమని నాయకత్వం భావించింది. దానితో ఆయన పేరు చర్చలోకి వచ్చిన వెంటనే.. టీడీపీ సోషల్‌మీడియా సైనికులు, తీవ్రమైన వ్యాఖ్యలతో తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు తూర్పు గోదావరి జిల్లా నేతలకూ ఆయన పట్ల సానుకూలత వ్యక్తం కాకపోవడం విశేషం.

దానితో పార్టీ నాయకత్వం ఆయన పేరు పరిశీలనలో, కొంచెం తర్జనభర్జన పడింది. అందువల్లే అభ్యర్ధుల ప్రకటన ఆలస్యం అయినట్లు కనిపిస్తోంది. చివరకు సాన అభ్యర్ధిత్వం అంశంలో ఎలాంటి ఒత్తిళ్లు, విమర్శలకు లొంగకూడదని.. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎంత అసంతృప్తి ఉన్నా సతీష్‌కే సీటు ఇవ్వాలని ఆర్టీ అధినేత చంద్రబాబునాయుడు- జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నిర్ణయించారు.

దీన్నిబట్టి ఇకపై పాన్టీ వర్గాల్లో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ.. విమర్శలకు లెక్కచేయకుండా, తాము అనుకున్న దానినే అమలుచేయాలనే స్థిరమైన నిర్ణయానికి వచ్చినట్లు, సతీష్ అభ్యర్థిత్వం స్పష్టం చేసింది. అయితే ఈ ఎంపికలో పొలిట్‌బ్యూరో ప్రమేయం ఏమీ లేకపోవడం గమనార్హం. నిజానికి గత ఆరు నెలల నుంచీ వివిధ ఎంపికలపై, పొలిట్‌బ్యూరో భేటీలు నిర్వహించడం లేదు. ఇది గత సంప్రదాయానికి భిన్నం.గతంలో పొలిట్‌బ్యూరోలో చర్చించిన తర్వాతనే అభ్యర్థిత్వాలు ఖరారు చేసే సంప్రదాయం ఉండేదన్నది తెలిసిందే. కార్పొరేషన్ పదవులు, ఎమ్మెల్సీ, ఎంపీ అభ్యర్ధుల ఎంపికపై.. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇద్దరే కసరత్తు చేసి, తుది నిర్ణయం తీసుకునే కొత్త సంప్రదాయం మొదలవడం.. పార్టీలో కనిపిస్తున్న సరికొత్త పరిణామం.

కాగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నట్లు.. పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబునాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యసభ అభ్యర్ధులతోపాటు, ఈ విషయాన్ని కూడా ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం క్యాబినెట్‌లో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. ఇప్పుడు బాబు ప్రకటన పరిశీలిస్తే, దానిని నాగబాబుకు ఇస్తారని ఖాయమయిపోయింది.

అయితే గతంలో వైసీపీ నుంచి చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణతో రాజీనామా చేయించుకున్నందున, ఆ స్థానం బాలినేనికి ఇచ్చి, మంత్రి పదవి ఇస్తానని పవన్ హామీ ఇచ్చారన్న ప్రచారం, పార్టీ వర్గాల్లో సాగిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ పోతుల సునీత స్థానాన్ని బీటెక్ రవికి ఇచ్చేందుకు సూత్రప్రాయ నిర్ణయం జరిగిపోయిందన్న ప్రచారం జరిగింది.

అయితే సతీష్ అభ్యర్థిత్వంపై పీటముడి నెలకొన్న నేపథ్యంలో, పవన్ కల్యాణ్ సైతం, ఆయన పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరిగింది. ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా నాగబాబు పేరు ప్రకటించడం ద్వారా.. పవన్‌ను సంతృప్తిపరిచినట్టయిందని, పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

ఇక బీజేపీలో సైతం గతానికి భిన్నంగా కొత్త పరిణామం చోటు చేసుకుంది. బీసీ నేత ఆర్.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేసే సమయంలో, మళ్లీ ఆ పదవి తనకి ఇస్తేనే రాజీనామా చేస్తానన్న షరతుతోనే, తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రచారం జరిగింది. దానితో అంతా అనుకున్నట్లుగా.. నామినేషన్‌కు ఒకరోజు ముందుగా కృష్ణయ్య బీజేపీ తీర్థం తీసుకోవడం, అదే సమయంలో పార్టీ అభ్యర్ధిగా బీ ఫారం తీసుకోవడం ఏకకాలంలో జరిగిపోయాయి. ఆరకంగా రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక కథ సుఖాంతమయింది

LEAVE A RESPONSE