‘సాక్షి’ నుంచి రాణి రెడ్డి తొలగింపు ?
– ‘సాక్షి’లో టీడీపీ యాడ్ ఫలితం
– భారతీరెడ్డి అనూహ్య నిర్ణయం
– బంధువైనా కనికరించని వైనం
(అన్వేష్)
వైసీపీ అధినేత జగన్ తనతో ఉన్న వారు ఎన్ని తప్పులు చేసినా పట్టించుకోరు. పైగా వారిని ప్రోత్సహిస్తారు. కానీ ఆయన భార్య భారతిరెడ్డి వ్యవహారశైలి అందుకు భిన్నం. ఆమెది అంతా ఫక్తు వ్యాపారధోరణి. చిన్న పొరపాట్లను కూడా క్షమించరు. అందుకే తమకు బంధువు, ఫ్రెండ్ కూడా అయిన రాణిరెడ్డిని కూడా క్షమించలేదట. కారణం.. ఎన్టీఆర్ వర్ధంతి రోజున టీడీపీ ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఇచ్చిన యాడ్‌ను సాక్షిలో మూడవ పేజీలో ప్రచురించడ మేనట.
‘టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ఇచ్చిన యాడ్‌ను తీసుకున్న జగన్ కుటుంబ డబ్బుల కక్కుర్తి కార్యకర్తలు ఇప్పటికయినా అర్ధం చేసుకోవాల’ంటూ వైసీపీ సోషల్‌మీడియా దళాలు, తొలిసారిగా జగన్ కుటుంబంపై విరుచుకుపడిన ఘటన అది. దానితో దిద్దుబాటకు దిగిన భారతిరెడ్డి, దానికి కారణమైన రాణిరెడ్డిపై వేటు వేశారు. ఎంతైనా భారతిరెడ్డి వ్యాపారదక్షత మెచ్చదగిందే.
వైసీపీ పార్టీలోనే కాదు సాక్షి మీడియాలోనూ గందరగోళం నెలకొంది. అక్కడి వ్యక్తుల ఆధిపత్య పోరాటాల కారణంగా, సంస్థ పని తీరు రోజు రోజుకు మసకబారుతోంది. తాజాగా భారతి రెడ్డి తరపున ప్రతినిధిగా సంస్థల్ని నిర్వహించే రాణి రెడ్డి అనే టాప్ ఎగ్జిక్యూటివ్ ను తొలగించారు. ఇక ఆఫీసుకు రావొద్దని ఆమెకు సమాచారం ఇచ్చినట్లుగా సాక్షి వర్గాలు చెబుతున్నాయి.
భారతి రెడ్డికి బంధువుతో పాటు ఫ్రెండ్ లాంటి రాణి రెడ్డి చాలా కాలంగా సాక్షి మీడియాపై అజమాయిషీ చేస్తున్నారు. టీవీకే కాదు పేపర్ కు కూడా ఆమె కీలకం. ఆమె చెప్పేది మాత్రమే భారతి వింటారు. అందుకే ఆమెకు పట్టు చిక్కింది. ఆమె ప్రత్యేకంగా తన వర్గం అనుకునేవారిని పెంచి పోషించిందని అంటారు. ఇష్టం లేని వారిని సాగనంపడానికి ప్రత్యేకమైన వ్యూహాలు పాటించేవారు. అందుకే అంతా ఆమె చెప్పినట్లుగా వినేవారు అక్కడ ఉన్నారు. పై స్థాయిలో రాణిరెడ్డి తీరుపై అసంతృప్తి ఉంది. కానీ ఎవరూ ఫిర్యాదులు చేసేంత సాహసం కూడా చేసేవారు కాదు.
అయితే హఠాత్తుగా రాణి రెడ్డిని తొలగించాలని భారతి నిర్ణయించారు. రెండు నెలల నోటీసు ఇచ్చారు. నోటీసు సమయంలో కూడా రావాల్సిన అవసరం లేదని.. సంస్థ వ్యవహారాల్లో ఇక జోక్యం అవసరం లేదని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. ఇలా ఎందుకు అన్నది చాలా మందికి అర్థం కాని విషయంగా మారింది. అయితే ఇటీవల పేపర్లో వచ్చిన టీడీపీ కోటి మంది సభ్యత్వాల ప్రకటన కారణంగానే రాణి రెడ్డిని తొగిస్తున్నారన్న ప్రచారం అయితే జరుగుతోంది.
రాణిరెడ్డి సరే.. వేమిరెడ్డి సంగతేమిటి?
ఎన్టీఆర్ వర్ధంతి రోజున టీడీపీ సభ్యత్వాల యాడ్ తీసుకున్న సాక్షి అధికారిపై.. ఆ మీడియా అధిపతి భారతిరెడ్డి వేటు వే సిన వైనం చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణ ఉల్లంఘించిన ఎంతటివారినయినా ఉపేక్షించేదిలేదని భారతిరెడ్డి చేసిన హెచ్చరిక సాక్షి సిబ్బందికి చెమటలు పట్టించింది. ఇంతవరకూ బాగానే ఉంది.ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై టీడీపీ సోషల్‌మీడియా సైనికుల స్పందన భిన్నంగా ఉంది. నెల్లూరు వేమిరెడ్డి ఇచ్చిన ప్రకటనకు కారకురాలైన రాణిరెడ్డిని భారతిరెడ్డి తొలగించారు. మరి సాక్షికి యాడ్ ఇచ్చిన మన పార్టీ ఎంపి వేమిరెడ్డిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? అసలు ఆ యాడ్ ఆయనే ఇచ్చారా? లేక ఇవ్వమని పార్టీలో ఎవరైనా చెప్పారా? అన్నది తేలాలి. ఎందుకంటే కొన్ని పేపర్లకు కొంతమంది యాడ్ ఇప్పించారు. అలాగే వేమిరెడ్డితో కూడా సాక్షికి ఇప్పించి ఉంటారేమోనన్న సందేహం వ్యక్తం చేశారు.
‘ఇప్పటివరకూ ఆయనను వివరణ కూడా అడగలేదంటే, పార్టీ వారే ఆయనకు సాక్షిలో యాడ్ ఇవ్వమని చెప్పి ఉండాలి. లేకపోతే పారిశ్రామికవేత్త, డబ్బున్నాయన కదా అని వదిలేసి ఉండాలి అనుకోవలసి వస్తుంద’ంటూ కామెంట్లు పెడుతున్నారు.