Suryaa.co.in

Telangana

‘భట్టి’ బడ్జెట్ బోగస్

-ఇది రేవంత్ తుగ్లక్ పాలనకు నిదర్శనం
-ఆరు గ్యారెంటీలకు పాతరేశారు
-ఇది ఏ ఒక్క వర్గానికి ఊరటనివ్వని నకిలీ బడ్జెట్
-కాంగ్రెస్ దోపిడీకి తలుపులు తెరిచిన చేతివాటం బడ్జెట్
-మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

హైదరాబాద్: ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పెద్ద బోగస్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని తిరోగమనం పట్టించేలా ఉన్న దిశానిర్దేశం లేని ఈ దిక్కుమాలిన బడ్జెట్ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగిస్తున్న పిచ్చి తుగ్లక్ పాలనకు నిలువెత్తు నిదర్శనమని ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు.

ఆరు గ్యారెంటీల అమలుకు శాశ్వతంగా ఉప్పు పాతరేశారన్నారు. 420 హామీలను అమలుచేయడానికి నయాపైసా నిధులు కేటాయించని నకిలీ బడ్జెట్ ఏ ఒక్క వర్గానికి ఊరట నివ్వనిలేదని జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ దోపిడీకి తలుపులు తెరిచిన చేతివాటం బడ్జెట్ ఇది అని ఆయన ఆరోపించారు. యువ వికాసం పేరుతో ప్రతి విద్యార్ధికి అయిదు లక్షల విద్యాభరోసా కార్డు ఇస్తామని చెప్పి ఇప్పుడు యువ వికాసం పథకాన్ని కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపే పథకంగా మార్చారన్నారు.

తెలంగాణ అక్కాచెల్లెళ్లకు ప్రతినెలా రూ. 2500 చొప్పున ఇస్తామన్న మహాలక్ష్మీ పథకానికి బడ్జెట్ లో కేటాయింపులు ఎందుకు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు. అంకెల గారడీతో ఆరు గ్యారంటీలకు ఎగనామం పెట్టి, రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను, ఆటో డ్రైవర్లను, గిగ్ వర్కర్లను, మహిళలను, ఉద్యోగులను సబ్బండ వర్గాలను నిండా ముంచిన బడ్జెట్ అని జీవన్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE