కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి భట్టి పాదయాత్ర దోహదం

Spread the love

– తెలంగాణ సాధనలో మధిరకు ప్రత్యేక ముద్ర
– ఎస్సీ ఎస్టీ మైనార్టీలను మోసం చేసిన టిఆర్ఎస్ సర్కార్
– కాంగ్రెస్ కు మోసం చేసిన ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో ఓడించాలి
– మధిర పాదయాత్ర సభలో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి clp నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర దోహదపడుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి సమస్య పరిష్కారమవుతుందని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. డిప్యూటీ స్పీకర్ గా భట్టి విక్రమార్క శాసనసభలో తెలంగాణ బిల్లు ఆమోదం చేయడం కోసం తన వంతు పాత్రను సమర్ధవంతంగా నిర్వహించిన గట్టి నాయకుడు అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భట్టి విక్రమార్క తో పాటు మధిర నియోజకవర్గం ప్రత్యేక ముద్రను సంతరించుకుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాలలో సైతం భట్టి విక్రమార్క పాత్ర అవసరం ఉందని, భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో గెలవడం వల్ల రానున్న రోజుల్లో నియోజకవర్గ ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని పునరుద్ఘాటించారు. వరి వేస్తే ఉరి అని సీఎం ప్రకటించి అనేక అంక్షలు పెట్టడం వల్ల సగం మంది రైతులు యాసంగిలో వరి సాగు చేయలేదని అన్నారు. బీజేపీతో పోరాటం చేస్తున్నాని డ్రామాలు చేసి కేసీఆర్ వరి ధాన్యం తామే కొనుగోలు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. కేసీఆర్ మాటలు నమ్మి వరి సాగు చేయకుండా మోసపోయిన రైతులకు ఎకరానికి 15 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా దళారులకు, మిల్లర్లకు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకున్న రైతులకు క్వింటాలుకు 600 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత గిరిజన జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని ప్రకటించిన కేసీఆర్ 8 ఏళ్లుగా మైనార్టీలను మోసం చేస్తూనే ఉన్నాడు అని మండిపడ్డారు.

గిరిజన, ఆదివాసుల సమస్యల పరిష్కారం కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్లనే సాధ్యమవుతుందని మరోసారి పునరుద్ఘాటించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మొండి వైఖరి వల్లనే ప్రజాసమస్యల పరిష్కారం కావడం లేదని వివరించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీ లో ఇరుకన పెట్టినప్పటికీ ప్రయోజనం లేకపోవడం వల్లనే ప్రజలను సమాయత్తం చేసి ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వం మెడలు వంచడానికి చేపట్టిన పాదయాత్రలో ప్రజలు కదం తొక్కుతూ రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసి బంగారు తెలంగాణ పేరిట టిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Leave a Reply