‘సారాజు’తో నవ్వులపాలవుతున్న ‘పువ్వుపార్టీ’

Spread the love

– కమలం పార్టీని వెన్నాడుతున్న ‘చీప్’ లిక్కర్
( మార్తి సుబ్రహ్మణ్యం)

అక్క ఆరాటమే గానీ బావ బతికుంది లేదు.. బూడిదలో పోసిన పన్నీరు.. దరిద్రుడు బంగారం పట్టుకున్నా అది మట్టి అవుతుందట.. అదృష్టదేవత ఒకసారే తలుపు కొడుతుంది. దరిద్ర దేవత తలుపు తీసేదాకా కొడుతుందట.. అదృష్టవంతుడిని చెడగొట్టలేం. దుదృష్టవంతుడిని బాగుచేయలేం.. కాలం కలసిరాకపోతే తాడే పామై కరుస్తుందట! ఏపీ ‘పువ్వు పార్టీ’.. సారాజు వ్యాఖ్యాలతో ‘నవ్వుల పార్టీ’గా మారిన తర్వాత గుర్తుకొచ్చిన తెలుగు సామెతలివి.

బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ 50 రూపాయలకే ఇస్తానంటూ ఏపీ కమలదళపతి సోము వీర్రాజు ఇచ్చిన హామీ, పాపం ఆయనను సారా వీర్రాజుగా మార్చేసింది. సోషల్ మీడియాలో శరపరంపరగా వస్తున్న ట్రోలింగుకయితే లెక్కలేదు. దానితో కేటీఆర్, షర్మిల సహా 16 మంది ఎంపీలు బీజేపీని ఆటపట్టిస్తూ ట్వీటారు. అసలు అప్పటి వరకూ కొంతమందికే తెలిసిన వీర్రాజన్నయ్య పేరు, సారా దెబ్బతో మొత్తం దేశానికి పాకిపోయింది. అసలీ వీర్రాజన్నయ్య ముఖం చూద్దామని చాలామంది నెటిజన్లు గూగుల్‌మాతను అడిగారట.

పోనీలెద్దూ… ఏపీలో పనికిపోతురాజు.. తిండికి తిమ్మరాజులా మారిన బీజేపీ పేరు, ఇలాగైనా మార్మోగడం మంచిదేనని సంతోషిద్దురూ! అదికూడా గర్వించదగ్గదే కదా? ఒక తెలుగువాడి పేరు ఆ లెవెల్లో నానుతుండటం చూసి, వీర్రాజన్నయ్య పుట్టిన తూ.గో.జి లోని కాతేరు గ్రామం ఉప్పొంగిపోయిందట. తమ ఊరోడు సాధించిన ఈ ఫీట్ చూసి మురిసిముక్కలయిపోతున్నారట. వీర్రాజన్నయ్యకు సారాయి వీర్రాజు, బుడ్జి వీర్రాజు, కోడిగుడ్ల వీర్రాజు అన్న బిరుదు రావడం చూసి, అవి తమకే వచ్చినంత సంబరపడతున్నారట.

సరే.. పాపం పార్టీ ఎదగాలని కోరుకుంటున్న కమలనాధులేమో, హతవిధీ.. ఏమిటీ దర్రిదం? పార్టీకి దరిద్రం అదృష్టంలా పట్టిందేమిటి చెప్మా అని తలపట్టుకున్నారట. నష్టనివారణకు ఏం చేయాలో ఎవరికీ ఐడియాలు లేవు. అప్పటికీ ‘ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందన్న’ ఎయిర్‌టెల్ వాళ్లనూ.. గీవ్ మీ సమ్ ఐడియా అని అడిగినా, అబ్బే ఇలాంటి వాటికి మాకూ ఐడియాల్లేవని వాళ్లూ చేతులెత్తేశారట. అంటే ఆ రే ంజ్‌లో వీర్రాజన్నయ్య పార్టీకి కొద్దో గొప్పొ మిగిలిన పరువును, ఇనుప చీపురుతో రజనుతో సహా విజయవంతంగా ఊడ్చేశారన్న మాట.

కానీ, ‘సారాజన్న’య్య వీరాభిమానులు మాత్రం.. మా అన్న ఆమాత్రం మాట్లాడకపోతే, రేపు ఎన్నికల్లో తాగుబోతుల నుంచి కోటి ఓట్లు ఎట్లా వస్తాయని లా పాయింటు తీస్తున్నారు. సరే.. ఎవరి అభిమానం, ఆనందం వారిది! పువ్వుపార్టీని ప్రేమించే ఇంకొందరు మాత్రం.. అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లు, పిచ్చోళ్లను వింటమేగానీ లైవ్‌లో చూడటం ఇదే ఫస్ట్ టైమనుకున్నారట.

ఈలోగా వైసీపీ, కాంగీయులు, కామ్రేడ్లు రంగంలోకి దిగి సారాజు భుజంపై తుపాకి పెట్టి, పువ్వుపార్టీని పేల్చడంతో.. పాపం కమలదళం కక్కలేక మింగలేక, జరుగుతున్న ట్రోలింగ్ చూసి నోట్లో గుడ్డలు కుక్కుకుని తలుపులేసుకుని రోదించింది. దిసీజ్ వాస్తవం! అయితే చెడగొట్టేవాళ్లు ఎలా ఉంటారో బాగుచేసేవాళ్లూ ఉంటారు కాబట్టి, సత్యకుమార్ అనే జాతీయ నేత మస్తిష్కం నుంచి, పాదరసం లాంటి వచ్చిన ఓ భావోద్వేగపూరిత ఆలోచన పార్టీని ఓ రెండురోజులు గట్టెక్కించింది. గుంటూరులో ఉన్న జిన్నా సెంటర్ పేరు మార్చి, దానికి అబ్దుల్‌కలామో, గుర్రం జాషువా పేరో పెట్టాలన్న కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. పాకిస్తాన్‌లో ఉండాల్సిన ఆ దరిద్రపు పేరు మనకెందుకంటూ చేసిన కొత్త వాదనతో పొలిటికల్ తేనెతుట్టె కదిలింది.

ఇంకేముంది? వైసీపేయులు, కాంగీయులు, కామ్రేడ్లు ఉమ్మడిగా బీజేపీపై మాటల కత్తులతో దాడిచేసి, ‘దేశభక్తుడైన(?) మా జిన్నాను అంతలేసి మాటలంటారా’ అని ఎగబడ్డారు. గుంటూరు సాయిబులయితే.. జిన్నా పక్షాన నిలిచినందుకు, అప్పిరెడ్డన్నకు సన్మానం కూడా చేశారు. మరి పువ్వుపార్టీ వాళ్లూ ఎక్కడా తగ్గకుండా వాళ్లూ ఎదురుదాడి చేశారు. జగన్ నిజంగా భారతీయుడైతే జిన్నా టవర్ పేరు మార్చాలన్న లాజిక్కు తెరపైకి తెచ్చారు. మరి జగన్ భారత్ వైపా? పాకిస్తాన వైపా అని ఇరికించే ప్రయత్నం చేశారు. ఆరకంగా సారా వీర్రాజు పార్టీకి చేసిన డ్యామేజీ కంట్రోలయి, కొత్తగా జిన్నా కథ తెరపైకి రావడంతో, పువ్వుపార్టీ నేతలు ‘హమ్మయ్య గండం గడిచి పిండం బయటపడింద’ని ఊపిరిపీల్చుకున్నారు.

కానీ సారా వీర్రాజు అక్కడితో ఆగితే బాగానే ఉండేది. మళ్లీ రెచ్చిపోయిన వీర్రాజన్నయ్య ఇంకో అడుగుముందుకేసి, ఈ సారా యవ్వారం తేల్చాలనుకుని చీప్ లిక్కరు హామీని మేనిఫెస్టోలో పెడతామని ప్రకటించి, పువ్వుపార్టీ పక్కలో మరోసారి బాంబు వేశారు. అంతేనా.. ఓ ప్రెస్‌మీట్‌లో జిన్నా అంశం తర్వాత.. ముందు కోడిగుడ్ల సంగతి కూడా కొంచెం చూపించండి బాబూ అని విలేకరులను బతిమిలాడుకోవడం చూస్తే.. సోమన్నకు జిన్నా కంటే కోడిగుడ్ల కతే ముఖ్యమని తేలింది. దానితో పాపం

సత్యకుమార్ చచ్చీ చెడీ వేసిన మాస్టర్‌ప్లాన్ అడ్డం తిరిగి, మళ్లీ సారాయి కథ మొదటికొచ్చింది. మేనిఫెస్టోలో కూడా చీప్ లిక్కర్ రేట్లను పెడతానన్న వీర్రాజన్నయ్య మాటలు విని.. అదృష్టవంతుడిని చెడగొట్టలేం. దుదృష్టవంతుడిని బాగుచేయలేం అని తమ నెత్తి తామే కొట్టుకోవడం పువ్వుపార్టీ లీడర్ల వంతయిందిట.

మంచోడు మంచోడని మంచమెక్కిస్తే మంచమెక్కి ఒంటేలు పోసినట్లు.. కన్నాను మించి ఏదో పొడుస్తాడన్న నమ్మకంతో ఢిల్లీ పెద్దలు వీర్రాజన్నయ్యకు పదవి ఇస్తే, మళ్లీ పార్టీని ముప్ఫైఏళ్ల వెనక్కి తీసుకువెళుతున్నాడేంటని కారాలు మిరియాలూ నూరుతున్నారట. అవును మరి.. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగిందన్న సామెత ఢిల్లీ వాళ్లకు తెలియదుకదా పాపం?!

Leave a Reply