– పులివెందుల నేత సింగారెడ్డి రామచంద్రారెడ్డికి అధ్యక్ష పదవంటూ సోషల్‌మీడియాలో ప్రచారం
– దానితో మరికొందరి చర్చ
– విస్తుపోతున్న బీజేపీ సీనియర్లు
– అంతా ఉత్తిదేనని వాదన
– ఆయన సోషల్‌మీడియా అధ్యక్షుడేనంటున్న పార్టీ వర్గాలు
– సంతోష్‌జీ ఫోన్ పేరుతో కొందరి పరాచకాలు
-అది నిజమేనని భ్రమిస్తున్న నేతలు
– రిసెప్షనిస్టులకు జిల్లా అధ్యక్ష పదవులా?
(సుబ్బు)
అమరావతి: బీజేపీకి సోషల్‌మీడియా కొత్త అధ్యక్షుడిని నియమించింది. పులివెందులకు చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డికి అధ్యక్ష పదవి ఖరరాయిందంటూ, సోషల్‌మీడియాలో ప్రత్యక్షమైన ఓ వార్త పార్టీ వర్గాలను విస్మయపరిచింది. ఆయన పేరును ఇప్పటిదాకా తాము వినలేదని రాయలసీమ నేతలు చెబుతున్నారు.
నిజానికి ఆయన పేరు ఇప్పటిదాకా పార్టీలో ఏ స్థాయి ఎప్పుడో కాలేజీ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తికి అధ్యక్ష పదవి ఇస్తారనటం అవివేకమని, సంఘ్-బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు, ప్రస్తుతం అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారిని అడ్డుకోవడం కోసమే.. కొందరు వ్యూహాత్మకంగా సోషల్‌మీడియాలో ఆయన పేరును ప్రచారంలో పెట్టినట్లు కనిపిస్తోందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
సింగారెడ్డి ఇప్పటిదాకా పార్టీకి సంబంధించి, ఏ ప్రధాన కమిటీల్లోనూ పనిచేసిన దాఖలాలు లేవని గుర్తు చేస్తున్నారు. సంఘ్‌లో పనిచేసిన సామాన్య కార్యకర్తలకు.. బీజేపీ గుర్తింపు ఇవ్వడం సహజమే అయినప్పటికీ, అసలు ఎలాంటి రాజకీయ అనుభవం, ఇతరులతో సంబంధాలు లేని వారికి కీలమైన అధ్యక్ష పదవి ఎలా ఇస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కాగా ఇటీవలి కాలంలో బీజేపీ జాతీయ సంఘటనా మంత్రి సంతోష్‌జీ పేరుతో కొందరికి ఫోన్లు చేసి.. అధ్యక్ష పదవి మీకే ఇస్తున్నామని ఆట పట్టించటం సాధారణమయిపోయింది. అదే వరసలో గతంలో గుంటూరు జిల్లా నేతకు రాష్ట్ర కమిటీలో స్థానం దక్కిందని ఓ సీనియర్ నేత గుర్తు చేశారు. అధ్యక్ష పదవి అంటే తమాషా అయిపోయిందనేదానికి ఈ ఘటన ఒక నిదర్శనమని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
పార్ట్‌టైమర్స్‌కు జిల్లా అధ్యక్షులిస్తారా?
ఇదిలాఉండగా.. ఇటీవల జరిగిన జిల్లా అధ్యక్ష పదవుల నియామకంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాలుగైదు జిల్లాల్లో ఎవరికీ తెలియని వారిని తీసుకువచ్చి, అధ్యక్ష పదవులు ఇచ్చారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ప్రధానంగా ఒక జిల్లాలో అయితే.. ఆసుపత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేసే వ్యక్తికి.. రాష్ట్ర అధ్యక్షురాలు పట్టుపట్టి మరీ, జిల్లా అధ్యక్ష పదవి సిఫార్సు చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
సామాన్య కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడం గర్వకారణమే అయినప్పటికీ, కనీసం పార్టీ కార్యక్రమాల ఖర్చు, కారు-డీజిల్ ఖర్చులు కూడా భరించే ఆర్ధిక స్తోమతు లేని వారికి, పార్టీలో పూర్తి సమయం కేటాయించలేని పార్టుటైమర్స్‌కు అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా.. పార్టీ ఆ జిల్లాల్లో బలపడాలని కోరుకుంటున్నారా? లేక బలహీనంగా ఉండాలని కోరుకుంటున్నారా అన్న సంకేతాలు వెళుతున్నాయని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం జిల్లాల్లో తమ అధిపత్యం నిలుపుకునేందుకు అగ్రనేతలు తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలను సంఘ్ పెద్దలు కూడా పట్టించుకోకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.